
ట్రై చేద్దాం..!
అధికారుల ఊగిసలాట
బదిలీ కోసం విశ్వప్రయత్నాలు
తరచూ సెలవుపై వెళ్తున్న జిల్లా అధికారులు
విభజన పర్వం ముగిసినా అధికారుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు జిల్లాలోని ఉన్నతస్థాయిలోని ఉన్నవారు తమకు అనువైన ప్రాంతాలకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ప్రభావం పాలనపై పడి వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులంతా ఇదే మూడ్‌లో ఉండడంతో ప్రజావసరాలకు ఇబ్బందులు వస్తున్నాయి.
మహబూబ్‌నగర్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో.. జిల్లాలోని ఉన్నతాధికారులు బదిలీపై దృష్టి సారించడంతో.. ఊగిసలాట మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయించుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తుండగా.. తెలంగాణ రాష్ట్రంలోనే మెరుగైన స్థా నాలకు వెళ్లాలన్న యోచనలో మరికొందరు జి ల్లా అధికారులు బదిలీల కోసం విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు. జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అనువైన చోట్లకు బదిలీ చే యించుకునే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చ ర్చించుకుంటున్నాయి. ఆ కోవలోనే కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీకి వె ళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విసృ్తత ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన పొరుగు జిల్లాల్లోని కలెక్టర్‌లు కొందరిని బదిలీ చేయడం, పదోన్నతులు కల్పించడం వంటివి చేపట్టారు. అయితే మన జిల్లా కలెక్టర్ బదిలీపై ఏమాత్రం స్పష్టత లేకపోగా.. బదిలీపై వెళ్లనున్నట్లు ఊహగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మణ్‌కూడా మంచిస్థానానికి పదోన్నతిపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఆయన సెలవుపై వెళ్లడం వెనుక ఇటువంటి ఉద్దేశమే ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌కు ఓఎస్‌డీగా మహబూబ్‌నగర్ ఆర్‌డీఓ హన్మంతరావును బదిలీ చేశారు.
ఆయా శాఖల పరిధిలోని జిల్లా స్థాయి అధికారులు బదిలీ ధ్యాసలో ఉంటుండటంతో వాటి రోజువారీ పనితీరుపై సమీక్ష చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. తమకు అనుకూలంగా ఉండే అధికారులను జిల్లాకు రప్పించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఢిల్లీస్థాయి నేత మన జిల్లాకు తమ అనుయాయుడైన కలెక్టర్‌ను రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు కూడా తాము చెప్పినట్లు నడుచుకునే ఆర్‌డీఓలు, ఎంపీడీఓలను తమ నియోజకవర్గాలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నారని, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో ఆ అధికారులు వీరి కనుసన్నల్లో మెలగాలన్న భావనతో అధికారులను బదిలీ చేయించుకునేందుకు దృష్టిపెట్టారు. ఇదిలా ఉండగా..
ఈ మధ్య కొనసాగిన తహశీల్దార్ల పోస్టింగుల్లోనూ వివాదాలు చెలరేగాయి. జిల్లా స్థాయిలో కొత్త అధికారులు వచ్చాక తహశీల్దార్ల పోస్టింగుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని రెవిన్యూ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
స్తంభించిన పాలనజిల్లా స్థాయి అధికారులు కొంతమంది ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు జవాబు లేదు. దీంతో అధికారులు బదిలీలపై దృష్టి పెట్టడంతో క్షేత్రస్థాయిలో పాలన కొంతమేరకు స్తంభించిపోయింది. కొన్ని శాఖల పరిధిలో పురోగతి శూన్యమైంది. కనీసం కొంతమంది అధికారుల బదిలీలు చేసినా పాలన గాడిలో పడేందుకు వీలుదొరికేది.. అలా కాకుండా బదిలీ చేస్తారని తెలిసినా చేయకపోవడంతో పనులు చేసుకోవడం కష్టంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి పనుల విషయం మరుగును పడిపోతోంది.