మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఏపీకి ప్రత్యేకంగా నిర్వహించిన మెడికల్ కౌన్సెలింగ్ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. బీ-కేటగిరీ భర్తీలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు కొద్దిసేపు ఆందోళన మినహా తొలిరోజు ప్రశాంతంగానే కౌన్సెలింగ్ జరిగింది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూనివర్సిటీకి చేరుకున్నారు.
కౌన్సెలింగ్‌కు వచ్చినవారి కోసం యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హెల్త్ యూనివర్సిటీలోని కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పలకరించారు. హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ కేంద్రంలో తొలి సీటును గుంటూరుకు చెందిన 16వ ర్యాంకర్ కె.గీతాశ్రీ తీసుకోగా, ఆమెకు మంత్రి అడ్మిషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గీతాశ్రీ విలేకరులతో మాట్లాడుతూ న్యూరాలజిస్ట్‌ను కావాలన్నదే తన లక్ష్యమన్నారు.
ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు అరెస్ట్
యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని అఖిలభారత విద్యార్థి సంఘ పరిషత్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘ నేతలు హెల్త్ యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు. తొలుత వర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నా చేసిన అనంతరం ఒక్కసారిగా గేటును తోసుకుని లోపలికి వచ్చారు.
మాచవరం సీఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. అవకతవలకు పాల్పడుతున్న ప్రైవేటు మెడికల్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కామినేనికి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు.