
పాత లారీ.. ఇక ఖాళీ
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : ‘కొత్త రాష్ట్రం.. కొత్త హద్దులు.. అదిరిందయ్యూ చంద్రం’ అనుకోకండి... ‘కొత్త రాష్ట్రం.. బెదురేనయ్యూ చంద్రం’ అనక తప్పని పరిస్థితులు తలెత్తనున్నాయి. రాష్ట్ర విభజన ప్రభావం రవాణా, వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్రంగా ఉండబోతోంది. జూన్ 2 అపాయింటెడ్ డే ముంచుకొస్తోంది. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయేందుకు ఇక మూడు రోజులే గడువు ఉంది. అపాయింటెడ్ డే రోజున రెండు రాష్ట్రాలకు సరిహద్దులు ఏర్పడనున్నాయి. ఆయా ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటవుతున్నాయి. కొత్త నిబంధనల కారణంగా రవాణా రంగంపై పర్మిట్ల రూపంలో అదనపు భారం పడనుంది. నేషనల్ పర్మిట్ (జాతీయ అనుమతి) గల రవాణా వాహనాలను మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తారు. దీనివల్ల వస్తు రవాణాతోపాటు ఎరువులు, ధాన్యం రవాణా భారంగా మారనుంది.
పాత లారీల కథ కంచికే...
ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలోని పాత లారీలు 10 టన్నుల సరుకుతో ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు సరిహద్దుల మధ్య ఏ మూలకైనా వెళ్లివచ్చేవి. ఇకపై అలాంటి అవకాశం ఉండదు. సీమాంధ్ర సరిహద్దుల్ని దాటి తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లాలంటే లారీల వంటి భారీ వాహనాలకు నేషనల్ పర్మిట్ ఉండి తీరాల్సిం దే. ఉదాహరణకు మన జిల్లాలోని జీలుగుమిల్లి, చింతలపూడి వంటి ప్రాంతాల నుంచి కూతవేటు దూరంలో గల అశ్వారావుపేటకు సరుకులు తీసుకువెళ్లాలంటే నేషనల్ పర్మిట్ తీసుకోవాలి. లేదంటే.. కనీసం వారం రోజులలోపు మనుగడలో ఉండే తాత్కాలిక పర్మిట్‌ను రూ.వెయికి పైగా వెచ్చించి తీసుకోవాలి.
ఎలాంటి ఇబ్బంది లేకుండా లారీలు రెండు రాష్ట్రాల మధ్య తిరగాలంటే లారీలకు నేషనల్ పర్మిట్ తీసుకోవాలి. నేషనల్ పర్మిట్ ఇవ్వాలంటే వాహనం వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. ఇలాంటి లారీకి సంవత్సరానికి రూ.25 వేలు వర కు పర్మిట్ చార్జీలు చెల్లించాలి. ఇంత మొత్తం చెల్లించడమంటే లారీ యజమానుల్లో అందరివల్లా అయ్యే పనికాదు. మరోవైపు 12 ఏళ్ల వయసు దాటిన పాత లారీలు ఇకపై ఖమ్మం జిల్లా వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఉండదు. అవి కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సీమాంధ్ర జిల్లాలకే పరిమితం కావాలి. దీనివల్ల వాటికి కిరాయిలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో 10వేలకు పైగా లారీలు ఉండగా, వాటిలో 75 నుంచి 80 శాతం లారీలు 12 ఏళ్లకు ముందు కొన్నవే. అందువల్ల వీటిలో చాలా లారీలు ఖాళీగా ఉండాల్సిందే.
ఎరువుల రవాణా మరింత భారం
యూరియా, కాంప్లెక్సు ఎరువులు ర్యాక్ పాయింట్ ఉన్న తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కు గూడ్స్ వ్యాగన్లలో వస్తుంటారుు. వాటిని ఇక్కడి నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు లారీల్లో పంపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో బొగ్గు, ధాన్యం వంటి వాటిని తీసుకొస్తుం టారు. తెలంగాణలో కొత్త చెక్ పోస్టులు ఏర్పాటైతే రెండు రాష్ట్రాల చెక్ పోస్టుల వద్ద అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లారీల యజమానులపై అధిక భారం పడుతుంది. ఈ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా అసలే అంతంతమాత్రంగా ఉన్న రవాణా రంగంపై మోయలేని భారం పడనుంది. ఫలితంగా ఈ రంగం మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమా దం పొంచివుంది.
రవాణా రంగం చితికిపోతుంది
టైర్లు, లూబ్రికెంట్లు, పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల, టోల్‌గేట్ ఫీజుల వడ్డింపు కారణంగా రవాణా రంగం ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయింది. వీటికి తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త చెక్ పోస్టుల వద్ద చెల్లింపులు ఈ రంగాన్ని మరింత నష్టాల్లోకి తోసే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో విజయవాడ తర్వాత ఎక్కువ లారీలు తాడేపల్లిగూడెం ప్రాంతంలోనే ఉన్నాయి. వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. యజమానులే డ్రైవర్‌గా మారి బతుకు బండిని ఈడుస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర విభజన వల్ల రవాణా రంగం పూర్తిగా చితికిపోతుంది. దీనిపై ఉభయ ప్రభుత్వాలు ఏదైనా ఒప్పందం చేసుకోవాలి.
- గురుజు సూరిబాబు, కార్యదర్శి, తాడేపల్లిగూడెం లారీ ఓనర్స్ అసోసియేషన్