సాక్షి, హైదరాబాద్: నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ర్ట పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగా కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు అయ్యే వరకు ఈ కమిటీ మనుగడలో ఉంటుంది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో ఈ కమిటీదే తుది నిర్ణయం. ఈ మేరకు సాగునీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వి. నాగిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల అధికారులు ఉంటారు. రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇరు రాష్ట్రాల జెన్‌కో డెరైక్టర్లు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. అయితే నీటి విడుదల విషయంలో పాత విధానం (ఇప్పటి వరకు అమలులో ఉన్న) ప్రకారమే ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే వరద నియంత్రణ పర్యవేక్షణ బాధ్యత కూడా ఈ కమిటీ కిందకే రానుంది. కాగా కృష్ణా నదిపై ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలా? వద్దా ? అనే విషయాన్ని ఈ కొత్త కమిటీ నిర్ణయిస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ వరద జలాలపై ఆధారపడి ఉండడంతో నికర జల కేటాయింపులు లేవు. దాంతో వరదలు వచ్చిన సమయంలోనే ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే శ్రీశైలం, సాగర్, జూరాల, బీమా, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, డెల్టాలకు నీటి విడుదల షెడ్యూల్‌ను ఈ కమిటీ ప్రకటించనుంది. అలాగే చెన్నై, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు మంచినీటి విడుదలను కూడా కమిటీయే పర్యవేక్షించనుంది.
నీటి విడుదలపై ప్రత్యేక కమిటీ
Published Sun, Jun 1 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement
Advertisement