ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘భిన్నమైన పరిస్థితుల మధ్య రాష్ట్ర విభజన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రం నెరవేర్చాలి. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా కడప ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్టను తిరుమల తరహాలో పవిత్ర స్థలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒంటిమిట్ట, కడప పెద్దదర్గా, గండికోట ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్ జిల్లాను హార్టికల్చర్ హాబ్‌గా మారుస్తామని వెల్లడించారు.
నదుల అనుసంధానమే శరణ్యం
రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారానే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. అందుకే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొన్నారు. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీరు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు.
25, 26న మరోసారి జిల్లా పర్యటన
కడపలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పెన్నా నదిలో చెక్‌డ్యాం నిర్మిస్తామని సీఎం తెలిపారు. నీరు-చెట్టు పథకం, సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ఈ నెల 25, 26వ తేదీల్లో మళ్లీ వైఎస్సార్ జిల్లాకు వస్తానన్నారు.
చెర్లోపల్లి పనులను పరిశీలించిన సీఎం
సీఎం చంద్రబాబు గురువారం ఉదయం చెర్లోపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా అనంతరం రామగిరి మండలం వెంకటాపురంలో మంత్రి పరి టాల సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత అనంతపురంలో నీరు-ప్రగతిపై సదస్సు నిర్వహించారు. చివరగా కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో ఎలక్ట్రానిక్ అండ్ బయోటెక్నాల జీ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సదస్సుల్లో బాబు ప్రసంగించారు.