రాష్ట్ర విభజనపై జైరాం రమేశ్ పుస్తకం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ రాష్ట్ర విభజన తీరుపై ఓ పుస్తకాన్ని రాస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా జరిగిన పరిణామాలను ప్రత్యేకించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(జీఓఎం) వివరాలను సమగ్రంగా ఆ పుస్తకంలో పొందుపరుస్తున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా రాష్ట్రం పేరును ఆంధ్రప్రదేశ్‌గా ఏవిధంగా ఖరారు చేయాల్సి వచ్చిందో కూడా ఆయన అందులో వివరిస్తున్నారు.
ఈ పుస్తకాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. బుధవారం పార్లమెంటులో కలిసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పుస్తకం గురించి వివరించారు. అయితే ఆయన చెబుతున్న విషయాలను అడ్డుకుంటూ, ‘మీరు కాంగ్రెస్‌ను నాశనం చేశారు’ అని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పాత విషయాలు ఇప్పుడెందుకు లేవదీస్తారంటూ జైరాం రమేశ్ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.