ఏలూరు సిటీ :‘రాష్ట్ర విభజనతో ఎవరికేం ఒరిగిందో తెలియదు కానీ.. మా జీవితాలు మాత్రం నాశనమయ్యే దుస్థితి నెలకొంది. బాగా చదువుకున్నా ఉద్యోగాలకు దరఖాస్తులు చేయలేని దీనస్థితిలో బతుకుతున్నాం. మాకు అన్యాయం చేయకండి’ అంటూ పోలవరం పాజెక్ట్ ముంపు మండలాలైన వేలేరుపాడు, కుకునూరు డీఎస్సీ-14 అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన 200 మందికి పైగా అభ్యర్థులు డీఎస్సీ-14లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానికత లేదంటూ అందులో 100కు పైగా దరఖాస్తులను విద్యాశాఖ అధికారులు తిరస్కరించారు. దరఖాస్తు సమర్పించిన అనంతరం వేలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణ పొందుతున్నామని అభ్యర్థులు తెలి పారు. తమ దరఖాస్తులను తిరస్కరించినట్టు అధికారులు సమాచారం ఇవ్వడంతో తీవ్ర మానసిక వేదనకు గరవుతున్నారు. దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో డీఈవో డి.మధుసూదనరావు లిఖతపూర్వక సమాధానం ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
న్యాయం చేయండి
మా తండ్రి చనిపోయారు. తల్లి కష్టపడి చదివిం చింది. బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ-14లో టీచర్ ఉద్యోగం వస్తుందని భావించాను. మా తల్లిని బాగా చూసుకోవచ్చని ఆశపడ్డాను. కానీ.. రాష్ట్ర విభజన మాకు శాపంగా మారుతుందని హించలేదు. ప్రభుత్వాలు చేసిన తప్పులకు మేం బలైపోతున్నాం. న్యాయం చేయండి.
- ఎం.రమణయ్య, కుకునూరు
రెక్కాడితేగాని డొక్కాడదు
కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబం మాది. పనులు చేసుకుంటూనే చదువుకున్నాను. డీఎస్సీకి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. సమాధానం చెప్పే నాథుడే లేడు. రెక్కాడితే గాని డొక్కాడని మాకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏం కావాలి. ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
- కారం నాగేశ్వరరావు, వేలేరుపాడు
శిక్షణకు రూ.15 వేలు కట్టా
డీఎస్సీ-14కు దరఖాస్తు చేసుకున్నాను. పరీక్ష కోసం ఆవనిగడ్డలోని కోచింగ్ సెంటర్‌కు రూ.15 వేలు చెల్లించా ను. అక్కడే ఉండి చదువుకునేందుకు మరో రూ.5 వేలు ఖర్చయ్యాయి. ఇప్పుడు దరఖాస్తు తిరస్కరిస్తే నా పరిస్థితి ఏం కావాలి. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. మాకు ఇలాంటి కష్టాలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు. - కుంజా నాగమణి, వేలేరుపాడు
విలీన కష్టాలు
Published Mon, Mar 16 2015 2:01 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement