అయ్యన్నా..మా మొర వినన్నా...
- నేడు మంత్రి అయ్యన్నపాత్రుడు రాక
కైకలూరు : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎన్‌ఆర్ ఈజీఎస్ (ఉపాధి హామీ) శాఖల మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు నేడు జిల్లాకు రానున్నారు. సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నిధుల కొరత వేధిస్తుండంతో అనేక పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా గ్రామ పట్టుసీమలైన పంచాయతీలు నిధుల కొరతతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
జిల్లాలో 969 పంచాయతీలుండగా...వీటిలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయలేని దీనస్థితిలో అనేక పంచాయతీలు పాలన సాగిస్తున్నాయి. ఒక పక్క 100 రోజుల ప్రణాళిక అంటూ కాగితాల మీద లెక్కలు అడుగుతున్న అధికారులు నిధుల మార్గాలు చూపాలని ప్రజాప్రతినిధుల నుంచి ఇప్పటికే ఆయా పంచాయతీల్లో వ్యతిరేకత వచ్చింది. పంచాయతీల్లో పెరుకుపోయిన విద్యుత్ బకాయిల కారణంగా కొత్త పనులు చేయడానికి విద్యుత్‌శాఖ ససేమిరా అంటుంది.
ఈ కారణంతో అనేక కాలనీలు చీకట్లో మగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే గ్రామీణ నీటి సరఫరా కోటి సమస్యలతో ఈదుతుంది. ఫిల్టర్‌బెడ్లలో ఇసుక మార్చడానికి కూడా నిధులు లేమి వేధిస్తుంది. జిల్లాలోని అనేక గ్రామాలో రక్షిత నీటి సరఫరా పథకాలు ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పనుల కోసం కూలీలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో వలసల నివారణకు ఈ పథకం ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ఎస్సీ, ఎస్టీ సర్పంచులు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. అనేక పంచాయతీలు పాడుబడ్డ కొంపల్లా దర్శనమిస్తున్నాయి. సమస్యలు తీర్చాలని మంత్రిని కోరుతున్నారు.