నెల రాజులేనా?!
ఏళ్ల తరబడి దీన్నే నమ్ముకున్నాం.. వేతనం తక్కువైనా భవిష్యత్తులో రెగ్యులర్ అవుతామన్న ఆశతో పని చేస్తున్నాం.. ఇప్పుడు మా పరిస్థితేంటి?.. నెల రోజుల తర్వాత మా తలరాత ఎలా మారుతుంది??.. ఇవే ప్రశ్నలు వేలాది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలిచేస్తున్నాయి. భవిష్యత్తుపై బెంగటిల్లజేస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరి కొనసాగింపుపై ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జూన్ నెలాఖరు వరకు త్రిశంకు స్వర్గంలోకి నెట్టేయడమే ఈ పరిస్థితికి కారణం.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లయ్యింది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. రాష్ట్ర విభజన వారికి అశనిపాతంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. ప్రస్తుతానికి నెలరోజుల గడు వు ఇచ్చినప్పటికీ వారిని కొనసాగిండంపై మా త్రం మాట దాటవేశా రు. భవిష్యత్తు రాజ కీయ, స్వప్రయోజనాల ను ఆశించే ఇలా చేశార న్న సందేహాలకు బలం చేకూరుతోంది. వేలాది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈ వ్యవహారం కలవరపరుస్తోంది.
కొనసాగించమంటే మాట దాటేశారు...
రాష్ట్ర విభజన నేపథ్యంలో గవర్నర్ నర్సింహన్ నేతృత్వంలో ఉన్నతాధికారులు ఓ విధాన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇరురాష్ట్రాలకు విభజించారు. కానీ ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత వారి పరిస్థితి ఏమిటన్నది తేల లేదు. నిబంధనల ప్రకారం జూన్ 2లోగా తమను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు పాక్షికంగానే ఫలించాయి. జూన్ నెలాఖరు వరకు మాత్రమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆ మేరకు జూన్ 30 వరకే బడ్జెట్ కేటాయించారు. జూలైనుంచి వారి పరిస్థితి ఏమిటన్నది మాత్రం స్పష్టం చేయలేదు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చేతులు దులుపుకున్నారు.
జిల్లాలో 8వేలమంది
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. డీఆర్‌డీఏ, డ్వామాలలో దాదాపు 2,500 మంది, వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 500 మంది, రెవెన్యూ శాఖలో దాదాపు 150 మంది, ఆర్ అండ్ బి శాఖలో దాదాపు 150మందితోపాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ వీరు పని చేస్తున్నారు. కాగా జూన్ 30 వరకే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడం వీరంతా ఆందోళన చెందుతున్నారు.
దూరాలోచనతోనే...
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన కాకుండా జూన్ నెలాఖరు వరకు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించడం వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం తీసుకునేముందు టీడీపీ పెద్దలతో రాష్ట్ర ఉన్నతాధికారులు సంప్రదించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న టీడీపీ అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావించారు. టీడీపీ పెద్దలు ఏం చెప్పారో తెలీదు కానీ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జూన్ నెలాఖరు వరకే పొడిగింపునివ్వడం గమనార్హం. అంటే ఆ తరువాత తాము సూచించినవారికి, తమ అనుయాయులకు అవకాశాలు కల్పించేందుకే టీడీపీ పెద్దలు ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల కాంట్రాక్టులను రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అనంతరం తమ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి తమవారికి అవకాశాలు కల్పించుకోవాలన్న దూరాలోచనతోనే వ్యవహరించినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తమ రాజకీయ ప్రయోజనాలు, తమవారిని అందలం ఎక్కించాలన్న వ్యూహం జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. తమను కొనసాగిస్తారో... వేటు వేస్తారో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు.