శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కొత్తగా 20 ఇసుక రీచుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఇసుక నిల్వలు తరిగిపోవడంతో ఇప్పుడున్న దాదాపు అన్ని రీచ్‌లు నిలిచిపోయాయి. ఇసుక కొరత ఏర్పడటంతో ప్రభుత్వం కొత్త రీచ్‌లపై దృష్టి పెట్టింది, ఈ మేరకు జిల్లా ఇసుక కమిటీ, డీఆర్‌డీఏ ఆధికారులు నాగావళి, వంశధార పరీవాహక ప్రాంతాల్లో 9 మండలాల పరిధిలో కొత్త రీచులకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మంగళవారం ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో కొత్త రీచుల ప్రారంభానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రీచుల ద్వారా 12,89,850 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి వస్తుందని అంచనా.
పరిశీలనలో మరికొన్ని
కొత్తగా మంజూరైన 20 రీచులతోపాటు మరికొన్ని రీచుల ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళ ం నియోజకవర్గంలో మరిన్ని రీచ్‌ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గార మండలంలో రీచ్‌లు అసరమని, ఆ ప్రాంతంవారు దూరప్రాంతాల నుంచి ఇసుక తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందన్న ఫిర్యాదులు అందాయి. ఆ మండలంలో రీచ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆధికారులు గుర్తించారు. కళింగపట్నం, గార, ఆరంగిపేట, బూరవల్లి, పూసర్లపాడు, శాలిహుండం, వమరవల్లిలతోపాటు శ్రీకాకుళం మండలంలో కిల్లిపాలెం, కళ్లేపల్లి ప్రాంతాలు, ఎల్.ఎన్.పేట మండలంలో సొంటిపేట, దబ్బపాడు ప్రాంతాల్లో రీచుల ఏర్పాటుకు ప్రభుత్వానికి అనుమతి కోరనున్నట్లు తెలిసింది.
ఇసుక బళ్ల వారికి ఊరట!
టైరు బళ్లతో ఇసుక రవాణాను నిషేధించడం, అదే వృత్తిగా చేసుకున్నవారికి ఇబ్బందిగా పరిణమించింది. ఆ మేరకు టైరు బళ్లకు అనుమతి ఇవ్వాలన్న ప్రజాప్రతినిధుల విన్నపాలతో ఆ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆంక్షలతో తాము ఉపాధి కోల్పోయామని బళ్ల కార్మికులు పలుమార్లు అధికారులకు విన్నవించుకోగా, వారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాకుళంతోపాటు మరికొన్ని జిల్లాల్లో ఇదే సమస్య ఉంది. దీంతో ఇసుక రవాణాకు సంబంధించిన 94, 95 జీవోలను పరిశీలించి నాటుబళ్లతో ఇసుక రవాణాకు వెసులుబాటు కల్పించే అవకాశముందని తెలుస్తోంది. జిల్లాలో సుమారు 250 నాటుబళ్లు ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిని మూడు నాలుగు గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇసుక రవాణాకు అనుమతించాలని భావిస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
కొత్త రీచులు ఇవే..
మండలం రీచులు
ఆమదాలవలస ముద్దాడపేట, అక్కివరం, దూసి, తోటాడ
జలుమూరు శ్రీముఖలింగం, పర్లాం, దుంపాక
నరసన్నపేట మడపాం, గోపాలపెంట, పోతయ్యవలస,
చిన్నాలవలస, బచ్చిపేట
పోలాకి మబగాం
రేగిడి కందిస
పాలకొండ అన్నవరం
ఎచ్చెర్ల బొంతలకోడూరు, ముద్దాడపేట
పొందూరు బొడ్డేపల్లి, సింగూరు
శ్రీకాకుళం హయాతీనగరం, బట్టేరు
20 కొత్త ఇసుక రీచులు
Published Wed, Mar 4 2015 2:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement