కాంట్రాక్ట్ ఉద్యోగులు.. ఇంటికే!
శ్రీకాకుళం కలెక్టరేట్: ఎన్నికల హామీని తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపేయాలని నిర్ణయించింది. అరకొర జీతాలే అయినా ఏళ్ల తరపడి ఈ ఉద్యోగాలనే నమ్ముకున్న జిల్లాలోని వేలాది ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతమే. ఒక్కో ప్రభుత్వ శాఖలో ఉన్న ఈ తరహా ఉద్యోగలను తొలగించేందుకు ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా జీవోలు సిద్ధం చేస్తోంది, ఇప్పటికే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది, క్షేత్ర సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లను, వ్యవసాయశాఖలో గ్రామస్థాయిలో పనిచేస్తున్న ఆదర్శ రైతులను తొలగిస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల హామీలకు భిన్నంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు జరుగుతున్న యత్నాలపై ఆ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే..
ఇంతవరకు మౌఖిక ఆదేశాలతోనే సరిపెట్టిన ప్రభుత్వం శుక్రవారం మరో అడుగు ముందుకేసింది. గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న వివిధ స్థాయిల ఉద్యోగులను తొలగిస్తూ జీవో విడుదల చేసింది. ఈ జీవో జిల్లా ఉన్నతాధికారులకు చేరినా దాన్ని బయట పెట్టవద్దని ఆదేశాలు ఉండటంతో ఆ శాఖ ఆధికారులు నోరు మెదపడం లేదు, జిల్లా గృహనిర్మాణ శాఖలో ప్రస్తుతం 97 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. గత ఏడేళ్లుగా ఈ ఉద్యోగాలనే నమ్ముకొని జీవిస్తున్న వీరంతా జూలై నుంచి రోడ్డున పడనున్నారు. ఇదే తరహాలో వైద్య ఆరోగ్య శాఖ, రిమ్స్, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన, వాటి అనుబంధ విభాగాలు, 108, 104, ఆరోగ్యశ్రీ, విద్యాశాఖ, సం క్షేమం తదితర శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించనున్నారు. అం దరినీ ఒకేసారి తొలగిస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతోసమ యం, సందర్భం చూసుకొని, దశల వారీగా జీవోలు విడుదల చేయనున్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 6500 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరి కుటుంబాల్లో ఇప్పటికే ఆందోళన నెలకొంది. అరకొర జీతాలు లభిస్తున్నా ఎప్పటికైనా పర్మినెంట్ చేస్తారన్న ఆశతో ఏళ్ల తరబడి ఈ ఉద్యోగాలు చేస్తున్నామని, ఇప్పుడు అవి కూడా లేకుండా చేస్తే రోడ్డున పడతామని ఉద్యోగుల కు టుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెం చింది. ప్రస్తుత రెగ్యులర్ ఉద్యోగులకు ఇది ఉపయుక్తమే అయినా.. దీని వల్ల కొత్త నియామకాలు నిలిచిపోవడం, ఉన్న వారికి పదోన్నతులు లభించకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. దీనికితోడు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నందున వారి స్థానంలో ప్రస్తుత ఉద్యోగుల చేత పని చేయించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.