8 నెలలుగా పస్తులు
పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుంది.. ప్రభుత్వ తీరు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తారని కొత్త సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. కొన్ని విభాగాల్లో తొలగిం చారు కూడా.. పాలకులు మాత్రం అబ్బే.. అదేం లేదంటూనే చేయాల్సిన పని చేసేస్తున్నారు. తాత్కాలిక సిబ్బందిని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నెలల తరబడి జీతాల బడ్జెట్ విడుదల చేయకుండా వారిని అవస్థలపాల్జేస్తున్నారు. రెవెన్యూ శాఖలోని భూసేకరణ విభాగం సిబ్బం ది గత ఎనిమిది నెలలుగా జీతాల్లేక అలమటిస్తున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ శాఖలో అత్యంత కీలకమైనది భూసేకరణ విభాగం. ఈ విభాగంలో సిబ్బంది కొరత ఉండటంతో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 67 మంది ఉద్యోగులను నియమించారు. తక్కువ జీతాలే అయినా గత కొన్నేళ్లుగా వీరు ఈ విభాగంలో సేవలందిస్తున్నారు. అయితే గత ఎనిమిది నెలలు గా వీరికి వేతనాలు అందడం లేదు. కారణమేమిటంటే బడ్జెట్ విడుదల కాలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. భూసేకరణ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నెలకు జీతాల బిల్లు రూ.6.03 లక్షలు. ఆ ప్రకారం ఎనిమిది నెలలకు సుమారు రూ.48 లక్షలు చెల్లించాల్సి ఉంది. గతంలో వీరికి మూడు నెలలకోసారి ప్రభుత్వం జీతాల బడ్జెట్ విడుదల చేసేది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా బడ్జెట్ విడుదల చేయలేదు. కొత్త ప్రభుత్వం కూడా ఈ విషయం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి రెవెన్యూ శాఖలో 160 మంది వరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరిలో కలెక్టరేట్, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న వారికి జీతాల సమస్య పెద్దగా లేదు. మూడు నెలలకోసారి బడ్జెట్ సర్దుబాటు చేస్తున్నారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంతోపాటు ఇతర ప్రాజెక్టుల భూసేకరణ విభాగాల్లో పని చేస్తున్న 67 మందికి చెందిన జీతాలు మాత్రం విడుదల కాకపోవడంతో వారి కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది. చిరుద్యోగులమైన తమకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే ఎలా బతకాలని ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు.
ఏజెన్సీల చేతివాటం
అసలే చిరుద్యోగాలు.. వచ్చే జీతమే తక్కువ.. అందులోనూ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు చిలక్కొట్టుడుకు పాల్పడుతుండటంతో జీతాలు అందుతున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఆవేదన చెందుతున్నారు. భూసేకరణ విభాగాల్లోని అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు అందక అవస్థలు పడుతుంటే.. జీతాలు అందుకుంటున్న మిగిలిన విభాగాల సిబ్బంది ఈ రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ.9వేల జీతం చెల్లించాలి. అయితే ఏజెన్సీల నిర్వాహకులు రూ.8,400 మాత్రమే చెల్లిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. వీటిని ఆయా ఏజెన్సీలే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వీరికి బడ్జెట్ విడుదల చేస్తుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు నాలుగు ఏజెన్సీలకు ఉంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను సరఫరా చేసినందుకు ప్రభుత్వం వీరికి వేరేగా కమీషన్ చెల్లిస్తుంది. అది కాకుండా కాంట్రాక్టర్లు ఒక్కో ఉద్యోగి జీతం నుంచి నెలకు రూ.600 మినహాయించుకుంటున్నారు. ఈ రకమైన దోపిడీని అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
డీఆర్వో వివరణ
వేతన బకాయిల గురించి జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) నూర్ బాషా ఖాసీం వద్ద ప్రస్తవించగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల బడ్జెట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. విడుదలైన తక్షణమే పూర్తి జీతం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.