రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం ప్రభుత్వం ఆమోదించడంపై ఉత్తరాంధ్రలోని సమైక్యవాదులు శుక్రవారం మండిపట్టారు. ప్రభుత్వ
నిర్ణయానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో సమైక్యవాదులు జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. అలాగే విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో వైద్యులు ఔట్ పేషెంట్ విభాగంలో సేవలను బంద్ చేశారు. అనారోగ్యం పాలై రోగులు ఎవరైన మరణిస్తే ప్రభుత్వానిదే బాధ్యత అని వైద్యులు హెచ్చరించారు. నగరంలోని ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. దాంతో నగరంలోని రోడ్డులన్ని నిర్మానుష్యంగా మారాయి. గాజువాక ప్రాంతంలో సమైక్యవాదులు రోడ్డును దిగ్బంధించారు. దాంతో కొల్కత్తా - చెన్నై జాతీయ రహాదారిపై వాహనాలు బారులు తీరాయి.
అలాగే కేంద్ర నిర్ణయంపై సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహాంగా ఉన్న నేపథ్యంలో విజయనగరంలోని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయనగరం లోక్సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ తన పదవికి రాజీనామా చేయాలని నిన్న ఉదయం సమైక్యవాదులు, ఉపాధ్యాయులు ఆమె నివాసం ముందు నిన్న ఉదయం ఆందోళనకు దిగారు. ఆ సమయంలో పోలీసులకు, ఉపాధ్యాయులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో తోపులాట జరిగింది. ఆ సమయంలో ఉపాధ్యాయుడు తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో బొత్స ఇంటి వద్ద భద్రతను పెంచారు.
అంతేకాకుండా చీపురపల్లి - శ్రీకాకుళంతోపాటు ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దుల్లోని జాతీయ రహాదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆరబిందో ఫార్మసీకి చెందిన బస్సుపై ఈ రోజు ఉదయం సమైక్యవాదులు రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలకొట్టారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో సమైక్యవాదులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. శ్రీకాకుళంలోని పాతపట్నంలో అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కార్యాలయాన్ని సమైక్యవాదులు శుక్రవారం ఉదయం ముట్టడించారు. శత్రుచర్ల తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం శత్రుచర్ల కార్యాలయానికి తాళాలు వేసి సమైక్యవాదులు పరారయ్యారు.