
మహారాణిపేట (విశాఖ దక్షిణ): పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా 15న నిర్వహించనున్న విశాఖ గర్జనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు రాజధానులను సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు. ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకు గర్జనకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలుకుతోందన్నారు.
విశాఖ డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు జరుగుతాయన్నారు. సోమవారం విశాఖ మద్దిలపాలెంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలని చంద్రబాబు, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు సొంత ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ‘మీ వ్యాపారాలకు, నివాసానికి, పిల్లల చదువుల కోసం విశాఖ కావాలా? ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందకూడదా?’ అని నిలదీశారు.
► టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామనే భయం ఆ పార్టీ నాయకుల్లో కనబడుతోంది.
► 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం. వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర, విశాఖను అభివృద్ధి చేసింది దివంగత వైఎస్సార్ ఒక్కరే. విశాఖలో హెల్త్‌సిటీ, ఐటీ పార్క్, ఉత్తరాంధ్ర స్రుజల స్రవంతి, బీఆర్‌టీఎస్, విమ్స్, బీహెచ్‌ఈఎల్, ఫార్మా పరిశ్రమలను తెచ్చి ముందుచూపుతో నేటి యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment