మోసం, దగా, కుట్ర చంద్రబాబు పేటెంట్: బొత్స | Botsa Satyanarayana Slams Chandrababu Naidu Over Uttarandhra Development, Details Inside - Sakshi
Sakshi News home page

Botsa Satyanarayana: మోసం, దగా, కుట్ర చంద్రబాబు పేటెంట్

Published Thu, Apr 18 2024 12:36 PM | Last Updated on Thu, Apr 18 2024 4:09 PM

botsa satyanarayana slams chandrababu over uttarandhra development - Sakshi

ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయబోమని బీజేపీతో చెప్పించగలరా..?

ఉత్తరాంధ్రపై మీకు ప్రేముంటే విశాఖను పరిపాలనా రాజధానిగా ఆమోదించండి

విశాఖలోనే ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రమాణస్వీకారం చేయనున్నారు

జగన్‌ అధికారంలోకి వచ్చాక 18,200 టీచర్లను రిక్రూట్‌ చేశాం

నాసిరకం మద్యం అని బాబుకు ఎలా తెలుసు?

పైశాచికానందంలో రామోజీరావు, రాధాకృష్ణలు 

జగన్‌పై, ప్రభుత్వంపై రోజుకో రోతరాతలా..?

చంద్రబాబు అధికారం కోసం మీరింతగా బరితెగిస్తారా..?

 మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించాం. కొన్ని కారణాలతో ఆలస్యమైంది. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

చెప్పిన మాటమీద నిలబడటం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారు. విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి. చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు’ అని బొత్స అన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏమన్నారంటే..

విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  మాట తప్పని మనిషని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట చెబితే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దానిని నెరవేర్చాలనే మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి బిడ్డగా ఆయన నైజం అది. అలాంటి  నేపథ్యంలోనే కిందటి సారి విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ఓ మాట చెప్పారు. దేవుడి దయతో రాష్ట్ర ప్రజల సహకారంతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం. 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్టణంలోనే చేస్తాను. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌గా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ అన్ని మౌలికసదుపాయాలను కల్పించి ఒక హబ్‌గా తయారు చేస్తానంటూ మాట ఇచ్చారు. అప్పట్లో ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ విశాఖపట్టణంలో పెట్టుబడులకు ఓ భరోసా కల్పించారు. 

- విశాఖ ఇన్వెస్టర్ల మీటింగ్‌లో తాను ఏమైతే మాట ఇచ్చారో.. దానికి నూటికి నూరుశాతం జగన్‌గారు కట్టుబడి ఉన్నారు. అధికారంలోకి రాగానే తాను ఇక్కడికే తన పరిపాలన తెస్తానన్నారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా సంస్థలు రోజుకో విధంగా విషం చిమ్మాయి. లేనిపోని గాలికబుర్లు, అభూతకల్పనలతో ఆయనపై దుమ్మత్తిపోస్తున్నప్పటికీ.. తన మాటపై తాను ధృఢంగా నిలబడి ఉన్నారు. రేపటి ఎన్నికల్లో గెలవగానే ఇక్కడ్నే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే విశాఖ అగ్రగామిగా నిలబడుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంత మణిహారంగా డిస్నీ ఆఫ్ విశాఖపట్టణం మారనున్నదని చెప్పడానికి మేం గర్విస్తున్నాం. ఇవ్వన్నీ మరోమారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉంది. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌ నెలకొల్పుతారు. అందులో పెద్ద సందేహమేదీలేదు. ఆయన చెప్పినట్లు.. డిస్నీ ఆఫ్‌ విశాఖకు ఇక్కడున్న సహజ వనరులు, సీకోస్ట్, పోర్టులు, ఏయిర్‌పోర్టు, హైవే కనెక్టివిటీ తదితర సదుపాయాలన్నీ అనుకూలించనున్నాయి. బెంగుళూరు, ముంబై, చెన్నై తరహాలో విశాఖ పట్టణాన్ని కూడా తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కనుకే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ దిశగా ముందుకెళ్లే కృతనిశ్చయంతో మేమున్నాం. 

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం
కిందటేడాదిన విశాఖకు సుమారు 40 కిలోమీటర్ల దూరమున్న భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్‌మోహన్‌రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. పనులు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఏజెన్సీలకు బిడ్స్‌ అప్పగించడం కూడా జరిగింది. ఇవన్నీ పూర్తిచేసుకుని 6 మిలియన్ల పాసింజర్ల ప్రయాణ రాకపోకలకు విమనాశ్రయాన్ని మొదటి దశలో సిద్ధం చేస్తున్నామనేది అందరికీ తెలిసిన విషయమే. దానికి కనెక్టివిటీ చేస్తూ గాజువాక నుంచి భోగాపురం వరకు మెట్రో ట్రైన్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ తయారు చేసి త్వరలోనే దాన్ని పూర్తిచేయనున్నాం. వీటన్నిటి పట్ల మా జగన్‌ గారి కృతనిశ్చయంతో ఉన్నారని మరోమారు గుర్తుచేస్తున్నాను. ఇది మా ప్రభుత్వ తాలూకూ ఆలోచన, ప్రణాళికగా చెబుతున్నాను. 

వేగంగా పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల పనులు
అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఇక్కడ ఫిష్షింగ్‌ ల్యాండింగ్‌ సెంటర్‌లు, ఫిష్షింగ్‌ హార్బర్‌లు, శ్రీకాకుళంలో మరో పోర్టు కావాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. దీనివలన మత్స్యసంపదను పెంచుకుని పెట్టుబడులను ఆకర్షిస్తూ వాణిజ్య అవసరాలను తీర్చుకునే వెసులు ఉంటుందన్నది ప్రజల ఆలోచన. వీటిపై గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. అదే శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూలపేటలో సుమారు రూ. 430 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ పనులు జరుగుతోన్నాయి. విశాఖ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఒక ఫిష్షింగ్‌ హార్బర్‌ను కూడా నిర్మిస్తున్నారు. వీటితో పాటు అక్కడ సమీప ప్రాంతాల్లో మరో 10 ఫిష్షింగ్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి పనులు కూడా ప్రారంభించారు. మేం చెప్పేవన్నీ మాటలతో చెప్పి ఊరుకున్నవి కావు.. పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి.

చంద్రబాబులా సెల్ఫ్ డబ్బా కొట్టుకోం
ఆనాడు ఐటీ రంగాన్ని విశాఖపట్టణం తెచ్చేందుకు దివంగత మహానేత శ్రీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు కృషి చేశారు. అప్పట్లోనే కొన్ని టవర్ల ఏర్పాటుకు ఆయన శ్రీకారం చుడితే.. ఇవాళ ఇక్కడ ఇన్ఫోసిస్‌ డెటా సెంటర్‌ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను జగన్‌మోహన్‌రెడ్డి గారు తెచ్చారు. అంతేకాకుండా ఇక్కడ దాదాపు రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ కూడా ఏర్పాటు కానుంది. మేము చంద్రబాబు మాదిరిగా చేయని పనులకూ డబ్బాలు కొట్టుకునే రకాలం కాదు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేన్నట్టు చెప్పుకుని పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు లాంటి తత్త్వం మాది కాదు. మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు చేసేదే చెబుతారు. చెప్పిందే చేసి చూపుతారు. అదే ఆయన ప్రత్యేకత నైజం. 

పైశాచికానందంలో రామోజీ, రాధాకృష్ణలు
ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు కలిసి చంద్రబాబు కోసం ఓ పైశాచిక క్రీడకు తెరలేపారు. ఆ మేరకు జగన్‌మోహన్‌రెడ్డి గారి పైన, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై రోజుకో పైశాచిక వార్తలు రాసి.. వికృతానందం పొందుతున్నారు. వాళ్లకు మా మీద నెగిటివ్‌ వార్తలు రాయడమే పైశాచికానందం అంట. దీనివల్ల చివరకు వాళ్లు సాధించేదేముంది..? ఆ రెండు పత్రికల్లో వాళ్లు రాసే విషయాల్లో ఒక్కటంటే ఒక్క పర్సంటేజీ నిజాలు కనిపించడం లేదు. 

పేరెంట్స్‌ మీటింగ్‌కు రాజకీయం అంటగడతారా..?
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఇవాళ ఎలాంటి వార్తలొస్తున్నాయంటే, ఉదాహరణకు నేను మంత్రిగా పర్యవేక్షించే శాఖనే తీసుకుందాం. విద్యా శాఖపై ఇవాళ కూడా మూడు వార్తలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌ మీటింగ్స్‌ కూడా పెట్టకూడదంట. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగా చదివి పరీక్షలు రాస్తే.. మార్కులు బాగా రావాలని కోరు కుంటారు. ఆయా విషయాలపై చదువు చెప్పిన ఉపాధ్యాయులతోనూ మాట్లాడాలని కోరుకోవడం సహజమే. అలాంటి సందర్భాల్లో పెట్టే పేరెంట్స్‌ మీటింగ్‌నూ రాజకీయాలకు ముడిపెట్టి వార్తలెలా రాస్తారు..? ప్రభుత్వ స్కూళ్లల్లో జరిగే పేరెంట్స్‌ కమిటీ మీటింగ్‌లకు రాజకీయ నేతలుగా మేం అక్కడికెళ్లి పబ్లిసిటీ చేస్తామా..? విద్యార్థికి చదువు చెప్పిన టీచర్, విద్యార్థి తల్లిదండ్రులు కూర్చొని అతని చదువు పరిస్థితిపై మాట్లాడుకునే వాతావరణం అది. దానికి రాజకీయం రంగు పులమడం దేనికి..? మీడియా సంస్థలుగా ఆ రెండు పత్రికలు ఈ వ్యవస్థను ఏం చేద్దామనుకుంటున్నాయి..? మీరు చేసేది చాలా తప్పుకదా..?  

18,200 మంది టీచర్లను రిక్రూట్‌ చేశాం..
స్థానికంగా కూటమి అభ్యర్థి ఒకరు విద్యాసంస్థ నడుపుతున్నాడంట. ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లకు రంగులేయడం కాదు. టీచర్లకు ట్రైనింగ్‌ ఇచ్చి అప్పాయింట్‌మెంట్‌లు ఇవ్వాలంటున్నాడు. గత ఐదేళ్ల కాలంలో మా ప్రభుత్వం ఏం చేసిందో ఆయనకేం తెలుసు..? ఇంగ్లీషు మీడియం విద్యాబోధనపై టీచర్లకు ట్రైనింగ్‌ ఇప్పించాం. ఎప్పటికప్పుడు వాళ్లను మోటివేట్‌ చేస్తూ లెర్నింగ్‌ స్కిల్స్‌ ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ విషయాలన్నింటిపై టీచర్లను అడిగితే చెబుతారు కదా..? మా ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జగన్‌ గారు 18,200 మంది టీచర్లను రిక్రూట్‌ చేసుకుని అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చాం. ఇవన్నీ తెలియక ఎవరంటే వారు మైండ్‌లేని మాటలు మాట్లాడటం మంచిదికాదు. 

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి అనుకూలమా..? వ్యతిరేకమా..?
ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి సంబంధించి జగన్‌ గారు ఇప్పటికే అనేక ప్రణాళికలు అమల్లోకి తెచ్చి పూర్తిచేస్తున్నారు. రేపు అధికారంలోకి రాగానే విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌గా తీర్చిదిద్దబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఉత్తరాంధ్రలో అనేక ఐటీ తదితర పరిశ్రమలు, పోర్టులు, హార్బర్లు, ఏయిర్‌పోర్టులు కూడా వచ్చాయి. మరి, కూటమి వీటన్నింటికీ అనుకూలమా..? వ్యతిరేకమా..? దీనిపై సమాధానం చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేసుకుని ఓట్లు అడగాలని డిమాండ్‌ చే స్తున్నాం. 

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయబోమని బీజేపీతో చెప్పించగలరా..?
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడో మా విధానం చెప్పింది. దీనిపై మేము ఒక లెటర్‌ ఇచ్చి ఊరుకున్నామని కూడా ఆ రెండు పత్రికలు రాశాయి. అంటే, గతంలో జరిగిన విషయాలపై బుర్ర ఉండాల్నా.. లేదా..? జగన్‌మోహన్‌రెడ్డి గారు ఢిల్లీలో ప్రధాని మోదీగారిని కలిసినప్పుడు.. అదే మోదీ గారు విశాఖకు వచ్చినప్పుడు కూడా స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై మా విధానాన్ని స్పష్టంగా వివరించారు. అదే విధానంపైనే ఇప్పటికీ మేం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే పోరాడుతున్నాం. మరి, ఈ అంశంపై కూటమి సమాధానం ఏంటి..? చంద్రబాబు కొత్తగా కూటమిలో చేరిన సందర్భంగా .. ఆ కూటమితో స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పించమనండి. బీజేపీ పెద్దల నోటివెంట ప్రైవేటీకరణ చేయబోమని చెబితే అందరం వింటాం కదా..? 

ప్రశ్నలకు సమాధానాలిస్తూ..

నాసిరకం మద్యం అని బాబుకు ఎలా తెలుసు?                                                    
జగన్‌ గారు మ్యానిఫెస్టోలో దశలవారీగా మద్యం నిషేధిస్తామన్నారు. అదే విధానాన్ని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇవాళ ఎక్కడ చూసినా.. మద్యం ధరలపై చంద్రబాబు చెబుతున్నారు. ప్రజల నిత్యావసరాలు, మత్తు కోసం తాగే మద్యం ఒకటేనా..? ధరల పెంపుతో మద్యం వినియోగాన్ని తగ్గించాలనేది మా ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వ్యవస్థను నడిపిస్తున్నాం. అందులో తప్పేముంది..? ఇక, మద్యం నాణ్యత గురించి కూడా ఆయన చెబుతున్నాడు. అది నాసిరకపు మద్యం అని చంద్రబాబు తాగి చూశాడా..? ఆయనకు మద్యం తాగే అలవాటు లేదనుకుంటాను. మరి, ఆయనేదో మద్యం తాగడంలో ఎక్స్‌పర్ట్‌గా మాట్లాడుతాడే..?  లేదంటే, ఏబీఎన్‌ లిక్కర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లో పరీక్షించారా..? మీకు చేతనైన లేబొరేటరీకి పంపి అందులో ఉండాల్సిన ఏబీసీడీలు ఉన్నాయో.. లేవో తెలుసుకోండి. అంతేగానీ, వ్యసనపరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని రాజకీయం నడుపుదామని అనుకోవడం ప్రతిపక్షాలకు మంచిది కాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement