రాజుకుంటున్న అగ్గి
సాక్షి ప్రతినిధి, విజయనగరం :
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కసి తీర్చుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండమని పరోక్షంగా హెచ్చరించారు. తనకిష్టం లేకపోయినా పార్టీలోకి వచ్చినందుకు పొమ్మనకుం డా పొగ పెడుతున్నారు.
ప్రాదేశిక అభ్యర్థుల బీ-ఫారాలను ఆయన వర్గీయులకు ఇవ్వకుండా ఝలక్ ఇచ్చారు. దీంతో శత్రుచర్లతో పాటు ఆయన వర్గీయులంతా కంగుతి న్నారు. తీవ్ర అవమానానికి గురయ్యామని పార్టీ పెద్దల వద్ద వాపోతున్నారు. తాడో పేడో తేల్చుకోవాలని అనుచరులంతా శత్రుచర్లను డిమాండ్ చేస్తున్నారు.
పార్టీలోకి రాకుండా శత్రుచర్లను నిలువరించకపోయినా తనతో పెట్టుకుంటే ఇంతేసంగతులని హెచ్చరిస్తూ అవమానాలను రుచిచూపిస్తున్నారు. మిగతా విషయాల్లో అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. తనతో పాటు థాట్రాజ్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టాలన్న డిమాండ్‌తో పార్టీలోకి వచ్చిన శత్రుచర్లకు అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
‘ఏరు దాటే వరకు ఏరు మల్లన్న ఒడ్డు దాటక బోడి మల్లన్న’ అన్న చందంగా పార్టీలో చేరేవరకు పాజిటివ్‌గా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో శత్రుచర్ల రాకపట్ల అయిష్టంగా ఉన్న అశోక్ ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు.
తొలుత జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణిని ప్రకటించి శత్రుచర్లకు ఝలక్ ఇచ్చారు. ఆ తర్వాత కురుపాం ఎమ్మెల్యే టిక్కెట్ నిమ్మక జయరాజ్‌కే ఇస్తున్నట్టు అధినేతతో భరోసా ఇప్పించి ‘రాజు’కుంటున్న అగ్గి పరోక్షంగా దెబ్బకొట్టారు.
దీంతో జనార్దన్ థాట్రాజ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ప్రాదేశిక ఎన్నికల్లో తమ బలం చూపించి, ఎమ్మెల్యే టిక్కెట్ తనకిచ్చేలా సత్తా చూపించాలన్న ఉద్దేశంతో శత్రుచర్ల ఆశీస్సులతో కురుపాం నియోజకవర్గం పరిధిలోని గరుగుబిల్లి, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో తమ వర్గీయులతో థాట్రాజ్ నామినేషన్ వేయించారు.
బీ-ఫారాలు తమకే వస్తాయన్న విశ్వాసంతో అభ్యర్థుల్ని బరిలోకి దించారు. అయితే నిమ్మక జయరాజ్ బరిలోకి దించిన అభ్యర్థులకే పార్టీ బీ-ఫారాలను జిల్లా నాయకత్వం అందజేసింది. దీని వెనుక అశోక్ హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో శత్రుచర్లను దెబ్బకొట్టడమే కాకుండా అవమానానికి గురి చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో శత్రుచర్ల వర్గీయులు ‘దేశం’ నాయకత్వంపై మండి పడుతున్నారు. ముందుగా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను కలిసి తమ గోడు వినిపించారు. తమకెవరికీ బీ-ఫారాలు ఇవ్వలేదని, పార్టీలోకి వస్తే ఇచ్చే గౌరవమిదేనా అని ప్రశ్నించినట్టు తెలిసింది.
అంతా విన్న జగదీష్ ఇందులో తన ప్రమేయం ఏమీలేదని, జయరాజ్‌తో మాట్లాడుతానని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు. అంతటితో ఆగకుండా ఏదో ఒకటి తేల్చాలని కోరుతూ శత్రుచర్లపై ఒత్తిడి చేస్తున్నారు.
పాతపట్నంలో ఉన్న శత్రుచర్ల వద్దకెళ్లి జరిగిన పరిణామాలు వివరించి, తాడోపేడో తేల్చుకోవాలన్న యోచనకొచ్చారు. ఈ నేపథ్యంలో శత్రుచర్ల ఏ రకంగా పావులు కదుపుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అధినేత దృష్టికి తీసుకెళ్లి తమ అనుచరులకు బీ-ఫారాలను సాధిస్తారో లేదంటే బరిలో ఉన్న అభ్యర్థుల్ని రెబెల్‌గా ఉసిగొల్పుతారో చూడాలి.