ఆందోళనలో టీడీపీ మాజీ మంత్రి వర్గం
►వాడుకుని వదిలేస్తున్నారని
► టీడీపీపై అసంతృప్తి
►జెడ్పీ చైర్‌పర్సన్‌తో
►ముప్పు తప్పదన్న భావన
► వ్యూహాత్మకంగా
► దెబ్బతీస్తున్నారన్న అనుమానం
జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఇవ్వలేదని కొందరు, చెప్పిన పనులు చేయడం లేదని మరికొందరు, తమకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఇంకొంతమంది నేతలు ఆవేదనలో ఉన్నారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వర్గీయుల పరిస్థితి ఇప్పుడిలాగే ఉంది. తమ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందేమోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. వ్యూహాత్మకంగా తమను దెబ్బ తీస్తున్నారని ఆసంతృప్తి చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అటు శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, ఇటు జిల్లాలో కురుపాం నియోజకవర్గాలకు తమకంటూ ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన శత్రుచర్ల విజయరామరాజు వర్గీయులు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో శత్రుచర్ల విజయరామరాజు, వి.టి.జనార్దన్ థాట్రాజ్ ఓటమి పాలైనప్పటికీ పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించడానికి తమ బలమే కారణమని చెబుతున్నారు. అయితే తమకు గుర్తింపు ఉండటం లేదని బాధపడుతున్నారు.
బాహాటంగా చెప్పకపోయినా.... తమకు జరుగుతున్న అన్యాయాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నారు. పొరుగు జిల్లాలోని పాతపట్నం సంగతి పక్కనపెడితే కురుపాం నియోజకవర్గంలోనూ శత్రుచర్ల వర్గీయులు ఉనికి చాటుకోలేకపోతున్నారు. తమ నేతకు వస్తుందనుకున్న ఎమ్మెల్సీ రాకపోగా... జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి నియోజకవర్గంలో పెత్తనం చేస్తుండడం వల్లే తమను ఎవరూ పట్టించుకోవడం లేదని విజయరామరాజు వర్గీయులు భావిస్తున్నారు. పార్టీ పరంగా జగదీష్ పెత్తనం చేస్తుండగా, అభివృద్ధి పనుల విషయంలో జెడ్పీ చైర్‌పర్సన్ హవా సాగుతోందని అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్ పరంగా జగదీష్‌తో ఇబ్బంది ఉండకపోయినా జెడ్పీ చైర్‌పర్సన్‌తో మాత్రం తప్పనిసరిగా ముప్పు ఉంటుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తమ పరిస్థితి ఏంటని వారు అంతర్మధనం చెందుతున్నారు. ఎస్టీ రిజర్వుడు కోటాలో కురుపాం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామన్న వ్యూహాత్మక ఎత్తుగడతోనే జెడ్పీ చైర్‌పర్సన్ పావులు కదుపుతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో ప్రారంభమైంది. క్రమేపి ఎదిగేందుకు, నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు జెడ్పీ చైర్‌పర్సన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలో తమ వర్గాన్ని దెబ్బతీస్తున్నారన్న అనుమానంతో శత్రుచర్ల వర్గీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా చెప్పిన పనులు చేయడం లేదని, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ను సైతం ఖరారు చేయడం లేదని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో శత్రుచర్ల కేడర్ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది.