నాయుడు బాబు నిమ్మక ద్రోహం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో శత్రుచర్ల చేరిక విషయంలో జరుగుతున్న హైడ్రామాకు తెరపడే సమయం ఆసన్నమయ్యింది.చంద్రబాబు కోటరీ నాయకుడైన కంభంపాటి రామ్మోహనరావు ద్వారా శత్రుచర్ల చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తనకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ, మేనల్లుడు జనార్దన్ థాట్రాజ్‌కు కురుపాం అసెంబ్లీ టిక్కెట్ వచ్చేలా దాదాపుగా ఆయనకు ఆమోదం దొరికినట్లు తెలిసింది. పాతపట్నం నియోజకవర్గానికి సరైన అభ్యర్థి లేరన్న కారణంతో శత్రుచర్లను తీసుకోవడమే కాకుండా ఆయన కోరిన మేరకు కురుపాం టిక్కెట్ కేటాయించేందుకు బాబు సిద్ధమైనట్టు సమాచారం. ఈమేరకు మంగళవారం రాత్రి వరకు సంప్రదింపులు జరిగినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే పాపం నిమ్మక జయరాజ్ పరిస్థితి ఏమి టంటూ పార్టీ కేడర్ అగమ్యగోచరంగా ఉన్నారు.
చెల్లుబాటు కాని అశోక్ మాటలు
పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మాట చెల్లుబాటు కావడం లేదు. ఆయనకు ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. పార్టీ అవసరాల దృష్ట్యా పోటీ చేయాల్సిందేనన్న అధినేత ఆదేశాలు కాదనలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అశోక్ అంతగా ఆసక్తి చూపని మీసాల గీతను పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ఎప్పటికప్పుడు చంద్రబాబు తీసుకుంటున్న మింగుడు పడని నిర్ణయాలతో అశోక్ కాస్త ఆవేదనకు లోనవుతున్నా అధికారమే లక్ష్యంగా ఉండడంతో బయటపడలేకపోతున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టిక్కెట్ ఇచ్చినా శత్రుచర్లకు ఇచ్చినా అభ్యంతర లేదని, కురుపాం టిక్కెట్‌ను ఎట్టి పరిస్థితుల్లో థాట్రాజ్‌కు ఇవ్వొద్దని అశోక్ వ్యతిరేకించినా చంద్రబాబు వినిపించుకోవడం లేదని తెలిసింది.
ఎవరెన్ని చెప్పినా అనవసరమని, పాతపట్నం కోసం కురుపాం టిక్కెట్‌ను త్యాగం చేయాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కురుపాం టిక్కెట్‌పైనే కాకుండా పార్వతీపురం మున్సిపాల్టీపై కూడా శత్రుచర్ల కన్నేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఆ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ద్వారపురెడ్డి జగదీష్‌కు షాక్ ఇచ్చే యత్నం జరుగుతోంది. పార్వతీపురంలో ఓ కౌన్సిలర్ స్థానం నుంచి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ నర్సింహా ప్రియ థాట్రాజ్‌ను బరిలో దించాలని యోచిస్తున్నారు. అదే జరిగితే అటు కురుపాం నియోజకవర్గంలోనూ, ఇటు పార్వతీపురం మున్సిపాల్టీలో టీడీపీ రాజకీయం రసకందాయంలో పడనుంది. ఈ నేపథ్యంలో పౌరుషానికి పోయి అశోక్ తన ఉద్వేగాన్ని బయట పెడితే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.