చంద్రబాబు ఝలక్!
చంద్రబాబు ఝలక్!
Published Fri, Mar 14 2014 1:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా టీడీపీపై ఆధిపత్యం తమదేనని భావిస్తున్న కింజరాపు కుటుంబానికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. కింజరాపు శిబిరం ఎంతగా వద్దని చెబుతున్నా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించేశారు. అదీ కింజరాపు కుటుంబానికి కనీస సమాచారం ఇవ్వకుండానే.! ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలని భావిస్తున్న రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడులకు ఈ పరిణామం షాకిచ్చిం ది. తాజా పరిస్థితి వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. జిల్లా టీడీపీపై కింజరాపు వర్గం కోల్పోతున్న పట్టుకు.. కళా వెంకట్రావుకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలుస్తున్న తాజా పరిణామం కథా కమామిషు ఇలా ఉంది..
అమ్మో.. శత్రుచర్లా!.. వద్దే వద్దు
పాతపట్నం ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశిస్తున్న శత్రుచర్లను పార్టీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనను కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నలు ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాజికవర్గ సమీకరణల దృష్ట్యా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పాతపట్నానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. శత్రుచర్ల రాకవల్ల పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు తమకు వ్యతిరేకమవుతాయని కింజరాపు కుటుంబం ఆందోళన చెందుతోంది. ప్రధానంగా కాపు సామాజికవర్గాన్ని దాదాపు దూరం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే రామ్మోహన్, అచ్చెన్నలు శత్రుచర్ల రాకను ఏమాత్రం అంగీకరించడం లేదు. మరోవైపు తమ రాజకీయ ప్రత్యర్థి కళా వెంకట్రావుతో శత్రుచర్ల సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటం వారి ఆందోళనను తీవ్రం చేస్తోంది. దీనిపై తమ వ్యతిరేకతను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు కూడా. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
కింజరాపు శిబిరానికి సమాచారం లేకుండానే..
చివరికి.. కింజరాపు కుటుంబం భయపడినంతా అయింది. శత్రుచర్ల చేరికకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో టీడీపీలో చేరనున్నారు. కానీ ఈ విషయమై కింజరాపు శిబిరానికి కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌లకు పార్టీ ఈ విషయాన్ని చెప్పనే లేదు. అంతేకాదు జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీకి కూడా కనీసం సమాచారం అందించకపోవడం చర్చనీయాం శంగా మారింది. కింజరాపు కుటుంబానికి బాబ్జీ సన్నిహితుడు కావడం గమనార్హం. అంటే కింజరాపు వర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా శత్రుచర్లను చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామంతో కింజరాపు శిబిరం పూర్తిగా నిసృ్పహకు గురైంది. జిల్లా పార్టీపై తమ ఆధిపత్యం కొనసాగదని స్పష్టం కావడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ స్థానంపై కూడా ఆశలు వదులు కోవాల్సిందేనా అని కలవరపడుతోంది.
Advertisement
Advertisement