శత్రుచర్లకు థా‘ట్రాజ్‌డీ’!
శత్రుచర్లకు థా‘ట్రాజ్‌డీ’!
Published Tue, Mar 11 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM
శత్రుచర్లకు ఎప్పుడూ లేని అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కురుపాం నియోజకవర్గంలో మంచి పట్టు ఉండి, పార్వతీపురం నియోజకవర్గంలో ప్రభావం చూపగల నేత, సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న విజయరామరాజు ఇప్పుడు మూడురోడ్ల కూడలిలో నిలబడి ఎవరు పిలుస్తారా అని ఎదురుచూడవలసిన పరిస్థితి దాపురించింది. మేనల్లుడు వి.టి.జనార్దన్ థాట్రాజ్‌కు టిక్కెట్ ఇవ్వాలన్న షరతు ఆయనకు హర్డిల్‌గా మారింది. మరో వైపు చంద్రబాబు ఆహ్వానించినా ‘దేశం’లోకి ప్రవేశించకుండా ఆయన శత్రువులు ఎక్కడికక్కడ కందకాలు తవ్వుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్ సీపీలో బెర్త్ ఖాళీ లేకపోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పడరాని పాట్లు పడుతున్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రకరకాల ఆలోచనలతో టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ కూడా మేనల్లుడి రూపం లో ఆయనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. నిన్నటి వరకు అశోక్ వ్యతిరేకించగా, ఇప్పుడు శోభా హైమావతి మోకాలడ్డుతున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు పాతపట్నం టిక్కెట్, తన మేనల్లుడు వి.టి.జనార్దన్ థాట్రాజ్‌కు కురుపాం టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్‌కు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. పాతపట్నం టిక్కెట్ ఇస్తే అభ్యంతరం లేదు గానీ కురుపాం టిక్కెట్ ఇస్తే బాగుండదని అశోక్ కరాఖండిగా చెప్పేయడంతో శత్రుచర్ల రూటు మార్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే జిల్లా పరిషత్ ఎన్నికలు రానుండటంతో చైర్‌పర్సన్ పదవిపై కన్నేసి, పార్టీ గెలిస్తే ఆ పోస్టును థాట్రాజ్ కుటుంబీకులకు ఇవ్వాలని ఆప్షన్ పెట్టారు. ఆ మేరకు చంద్రబాబుతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే, ఇప్పుడా పోస్టుపై శోభా హైమావతి కన్ను పడింది. ‘ఎస్.కోట అసెంబ్లీ టిక్కెట్ అక్కర్లేదు. అరకు పార్లమెంట్ టిక్కెట్ కూడా నా కుమార్తెకు ఇవ్వొద్దు. జెడ్పీ చైర్‌పర్సన్ రేసులో నిలబెడితే చాలు’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు.
గతమంతా తూచ్ అనేసి, చైర్‌పర్సన్ రేసులో ఉంచితే అది పదివేలు అనే పరిస్థితికి శోభా హైమావతి వచ్చారు. ఆ మేరకు అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. తన కుమార్తెకు చైర్‌పర్సన్ పదవి ఇస్తే డీవీజీ శంకరరావుకు న్యాయం జరుగుతుందని, అరకు పార్లమెంట్‌కు పోటీ చేయడానికి అడ్డంకులు తొలగిపోతాయని వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈ క్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో సంప్రదింపులు చేసి, జిల్లాలోని మిగతా నాయకుల మద్దతు కూడగడుతున్నారు. రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవసరమైతే చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ వెళ్లాలని భావిస్తున్నారు.
శత్రుచర్లపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న అశోక్ కూడా శోభా హైమావతి డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నట్టు తెలిసింది.
పార్టీ కేడర్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాకుండా రాత్రికి రాత్రి వచ్చే నాయకుల డిమాండ్లకు ఎలా తలొగ్గుతారని నినదిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. ఏదో ఒక రకంగా శత్రుచర్లను చేర్చుకుందామనని సంప్రదింపులు చేస్తుంటే ఆటంకాలు ఎదురవుతున్నాయని అంతర్మధనం చెందుతున్నట్టు తెలిసింది.
శత్రుచర్ల చేరికపై ఆ పార్టీలో రోజుకో డ్రామా నడుస్తోంది. చంద్రబాబు ఆలోచనకు భిన్నంగా కేడర్ వ్యవహరిస్తోంది. మరి అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో, కేడర్ ఏ విధంగా స్వీకరిస్తుందో చూడాలి. ఏదైనా శత్రుచర్ల వ్యవహారం టీడీపీలో తలనొప్పిగా మారింది.
Advertisement
Advertisement