అశోక్ ఇలాకాలో పొరుగు నేతల పెత్తనం
Published Wed, Apr 9 2014 2:32 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా టీడీపీ వ్యవహారాల్లో పక్క జిల్లాల నేతలు వేలు పెడుతున్నారు. అశోక్‌ను డామినేట్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన బలహీనతో, పట్టించుకోని మనస్థత్వమో, అధిష్టానం వద్ద పట్టు తగ్గిందో తెలియదు గాని పొరుగు జిల్లా నేతల ఆధిపత్యం పెరుగుతోంది. ఆయనతోనైతే రాజకీయాలు చేయలేమని అధినేత చంద్రబాబు కూడా అశోక్‌కు చెప్పకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఊహించుకోవడం తప్ప ఆయన వల్ల పార్టీకి వచ్చే ప్రయోజనమేదీ లేదని అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో చక్రం తిప్పలేకపోతున్నారని గ్రహించి ప్రతి విషయంలోనూ పొరుగు జిల్లా నేతలపైనే చంద్రబాబు ఆధారపడుతున్నారు. కిమిడి కళా వెంకటరావు, ఎంవీఎస్ మూర్తి, యనమల రామకృష్ణుడు తదితరుల సూచన, సలహాలతోనే విజయనగరం జిల్లా రాజకీయాలను చంద్రబాబు నెరుపుతున్నారు. మధ్యలో నారాయణ...నారాయణ అంటూ ఓ విద్యా సంస్థ అధినేత కూడా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. పార్టీ సభలు, ఎన్నికల ఖర్చు అంతా ఆయనే చూసుకుంటున్నారు. ఆ మధ్య విజయనగరంలో జరిగిన ప్రజాగర్జన సభకు మొత్తం ఖర్చు అంతా ఆయనే భరించినట్టు తెలిసింది. ఈ విధంగా అశోక్ గజపతిరాజుకు తెలియకుండానే పార్టీ నిర్ణయాలు, కార్యకలాపాలు జరిగిపోతున్నాయి.
ఆచరణలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోవడం అశోక్ వంతు అవుతోంది. మీసాల గీత, శత్రుచర్ల విజయరామరాజు, వి.టి.జనార్దన్ థాట్రాజ్ తదితరుల చేరికల విషయంలో ఇదే జరిగింది. అలాగే జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం విషయంలో కూడా తనకు తెలియకుండా నిర్ణయం జరిగిపోయింది. కాకపోతే, చేరికల విషయంలో అడ్డుకోలేక పోయినా జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం విషయాన్ని అడ్డుకోగలిగారు. తాను అనుకున్న శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణి పేరును ప్రకటించగలిగారు. ఈ విషయంలో అధిష్టానం వెనక్కి తగ్గినా పొత్తుల విషయంలో మాత్రం అశోక్‌ను పట్టించుకోలేదు. ఆయనకు మాటమాత్రంగా కూడా చెప్పకుండా గజపతినగరం అసెంబ్లీ, అరకు పార్లమెంటును బీజేపీకి కేటాయించేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తెలిసిన తర్వాత అశోక్ గగ్గోలు పెడుతున్నారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ విధంగా తనకు తెలియకుండా జరిగిపోతున్న వ్యవహారాలపై మండి పడుతున్నా పక్క జిల్లా నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తలదూర్చుతునే ఉన్నారు.
తాజాగా ఎస్‌కోట విషయంలో జోక్యం
శృంగవరపుకోట అసెంబ్లీ టిక్కెట్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి కాకుండా వేరే వారికి ఇప్పించేలా విశాఖ జిల్లా నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తి, నాయకుల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా విశాఖ పార్లమెంట్‌పై ప్రభావం పడుతుందన్న కారణాన్ని అధిష్టానానికి చూపిస్తున్నారు. ఆమె స్థానంలో లక్కవరపుకోట మండలానికి చెందిన రంధి మార్కండేయులను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే బయోడేటాను అధిష్టానానికి పంపించారు. ఎన్నికల్లో లలితకుమారి పెద్దమొత్తంలో ఖర్చుపెట్టలేరని, అప్పులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని, ఇటీవల ఓ వ్యక్తి లలితకుమారి ఇంటికొచ్చి తీసుకున్న అప్పును చెల్లిస్తారా లేదా అని నిలదీశారని, విలేకర్ల దృష్టికి కూడా వెళ్లిందన్న సమాచారాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో కోళ్ల లలితకుమారికి ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదురవుతోంది. అయితే, జరుగుతున్న పరిణామాలను అశోక్ గజపతిరాజు దృష్టికి లలిత కుమారి తీసుకొచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయన అప్రమత్తమై పక్క జిల్లా నేతల పెత్తనాన్ని గ్రహించి, కోళ్లకు అండగా ఉండేందుకు భరోసా ఇచ్చినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలో పొరుగు జిల్లా నేతల యత్నాలను తిప్పికొడతారో లేదో చూడాలి. మొత్తానికి అశోక్ వ్యవహార శైలీని తేలికగా తీసుకుని పక్క జిల్లా నేతలు మాత్రం విజయనగరం టీడీపీని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
Advertisement
Advertisement