ద్వారపురెడ్డిపై శత్రుచర్ల ఫిర్యాదు
ద్వారపురెడ్డిపై శత్రుచర్ల ఫిర్యాదు
Published Wed, Feb 8 2017 4:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
30మందితో కలిసి నేరుగా సీఎంతో భేటీ
అక్రమాలకు పాల్పడుతున్నారని జగదీష్‌పై అభియోగం
పనిలో పనిగా ఎమ్మెల్సీ పదవిని కోరిన శత్రుచర్ల
టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. కురుపాం నియోజకవర్గంలో ద్వారపురెడ్డి, శత్రుచర్ల వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. తన రాజకీయ గురువుకు జగదీష్ సవాల్ విసురుతుండగా, శిష్యుడికి చెక్ పెట్టాలని శత్రుచర్ల పావులు కదుపుతున్నారు. అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు 30మందితో వెళ్లి చంద్రబాబునాయుడికి నేరుగా ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా శత్రుచర్ల కోరారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కురుపాం నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తొలినుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదే రకంగా అవకాశాలు కలిసొచ్చాయి. తిరుగులేని నేతగా చక్రం తిప్పారు. కానీ, కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు దూకుడు పెంచారు. పార్టీలో పట్టు కోసం తనదైన శైలిలో పావులు కదిపారు. టీడీపీలో బలమైన వర్గంగా తయారయ్యారు. ఇది ద్వారపురెడ్డికి రుచించలేదు. శత్రుచర్ల పెత్తనానికి చెక్ పెట్టాలని వ్యూహం పన్నినా... శత్రుచర్ల సీనియారిటీ ముందు అవి పారలేదు. అనుకున్నట్టుగానే నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోçస్టును శత్రుచర్ల దక్కించుకున్నారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ద్వారపురెడ్డి సైతం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు, జెడ్పీటీసీ దత్తి కామేశ్వరి, మరికొంతమంది గరుగుబిల్లి నాయకులతో శత్రుచర్లను ఢీకొడుతున్నారు.
కత్తులు దూసుకుంటున్న వైరీ వర్గాలు
రోజురోజుకు వీరి మధ్య అంతర్గత పోరు ఎక్కువవుతోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం ఇళ్లు, పింఛన్లు ఇతరత్రా సంక్షేమ పథకాలన్నీ శత్రుచర్ల చెప్పినట్టే జరుగుతున్నాయి. జగదీష్ వర్గం దీన్ని జీర్ణించుకోలేకపోయింది. లబ్ధిదారుల ఎంపికలో శత్రుచర్ల వర్గం చేసిన అక్రమాలను బయటపెట్టే పనిలో నిమగ్నమయ్యింది. ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టారు. దానికి కౌంటర్‌గా శత్రుచర్ల వర్గీయులు కూడా గతంలో జగదీష్ వర్గం చేసిన అక్రమాలను వెలికి తీశారు. మొత్తానికి వీరి మధ్య విభేదాలు అక్రమాల గుట్టు రట్టు చేసింది.
సీఎంకు శత్రుచర్ల ఫిర్యాదు
శత్రుచర్ల ఒక అడుగు ముందుకేసి ద్వారపురెడ్డిపై నేరుగా సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. మంగళవారం అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు 30మందితో కలిసి వెళ్లి జగదీష్ తీరు బాగోలేదని... అక్రమాలకు పాల్పడుతున్నారని... నియోజకవర్గంలో పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని... ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది.
తనతోపాటు వచ్చిన వారందరి చేత సీఎం సమక్షంలో జగదీష్‌పై విమర్శలు, ఆరోపణలు చేసినట్టు సమాచారం. అయితే జగదీష్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఎమ్మెల్సీ కోరిన శత్రుచర్ల
ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో తనకు పోటీ చేసే అవకాశం ఉండదని, ఎమ్మెల్సీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, పార్టీ పట్టు సాధించాలంటే ఎమ్మెల్సీ పదవి తనకివ్వాలని సీఎం చంద్రబాబునాయుడ్ని శత్రుచర్ల విజయరామరాజు కోరినట్టు తెలిసింది. దీనికి సీఎం చంద్రబాబు ఎలా స్పందించారో తెలియదు గాని శత్రుచర్ల వర్గీయుల్లో మాత్రం ఆ ధీమా కన్పించలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
Advertisement
Advertisement