విజయరామరాజుకు చెక్ పడినట్టేనా?
►టీడీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే కలమట
►జిల్లా పార్టీలో అప్పుడే లుకలుకలు
►మమేకం కాలేమంటున్న క్యాడర్
►ఆగ్రహం చెందుతున్న నేతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరించనున్నట్టు మంగళవారం ప్రకటించడంపై టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నియోజకవర్గ ప్రజల కోరడంతోనే చంద్రబాబుకు మద్ధతు ప్రకటిస్తున్నట్టు కలమట చెప్పిన మరుక్షణం నుంచే జిల్లా టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. తొలినుంచీ పార్టీని నమ్ముకున్న వారిని కాదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత కలమటను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ ప్రశ్నించడం మొదలెట్టారు.
10యేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండడం, వంశధార నిర్వాసితుల ఇబ్బందులు, కరకట్టల నిర్మాణం, తాగు, సాగు నీటిసమస్యలపై తనను నమ్మిన ప్రజలకు న్యాయం చేయలేకపోయానని, పార్టీ వీడుతున్నట్టు సంకేతాలు ఇచ్చిన కలమట భవిష్యత్తులో తమకు ఏ విధంగా సహకరించగలరని మెళియాపుట్టి వాసులు అటు టీడీపీ ఇటు కలమట వర్గీయుల్నీ ప్రశ్నించినట్టు తెలిసింది.
నమ్మి ఓటేసిన ప్రజలు ఇప్పుడు పార్టీని వీడితే అంగీకరిస్తారా అని కూడా అడుగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీకి మద్ధతిస్తున్నట్టు చెబుతున్న కలమట..ఇప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏం అభివృద్ధి చేసిందని, రైల్వే, కేంద్ర బడ్జెట్‌లో ఏం కేటాయింపులు తెప్పించారని, రాష్ట్రాభివృద్ధి కాంక్షతో ప్రత్యేక హోదా కూడా తెప్పించలేని చంద్రబాబుతో భవిష్యత్తులో ఎలా అంటకాగుతారని కలమటను ప్రశ్నించేందుకు ఆ ప్రాంత ప్రజలు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
శత్రుచర్లకు చెక్ చెప్పినట్టేనా?
టీడీపీ పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజుకు చెక్ పెట్టేందుకే కలమటను పార్టీలోకి ఆహ్వానించినట్టు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. రాజు రాకను తొలినుంచీ అడ్డుకుంటున్న జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల అక్కడి పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుర్తుచేస్తున్నారు. కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి ప్రాంతాల్లో జరుగుతున్న పనులకు సైతం రాజుకు ఆహ్వానం పంపించకపోవడం, ఎంపీ, మంత్రి కూడా అంతా తామై వ్యవహరించడం తెలిసిందే.
ఇప్పుడు కలమటను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న విజయరామరాజుకు పూర్తిస్థాయిలో చెక్ పడిందనే టీడీపీలోని మరో వర్గం చెబుతోంది. చాన్నాళ్ల నుంచి తాము పార్టీలో ఉంటే..పార్టీని వీడి వెళ్లిన వ్యక్తిని ఎలా దగ్గరకు చేర్చుకుంటారని జిల్లా మంత్రికి కార్యకర్తలు అప్పుడే ఫోన్లు చేస్తున్నట్టు తెలిసింది. పాతపట్నం నియోజకవర్గంలో తాము కొత్తవ్యక్తితో మమేకం కాలేమని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే మెళియాపుట్టి మండల నేతలు పూర్తిస్థాయిలో కలమటను వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం తమకు లేదని చెప్పేస్తున్నారు.
ఒత్తిడి తెచ్చారా? ఒప్పుకున్నారా?
తమ ప్రాంతం కొన్నాళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందని, 10గ్రామాల్లో భూములన్నీ ఇసుక మేటలు వేసి వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయని చెబుతున్న కలమటకు ఆ విషయం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని స్థానిక టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకు లోనై పార్టీకి దగ్గరవుతున్నారంటున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిల్ని కూడా పరిగణలోకి తీసుకుని టీడీపీ అధిష్టానం నిధులు మంజూరు చేస్తుండడంతో భవిష్యత్తులో ఏదో ఆశించే పార్టీలోకి వస్తున్నట్టు కలమట సంకేతాలు పంపిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.
భూములు, నగదు, అభివృద్ధి పనుల్లో వాటాలు, రానున్న కాలంలో హోదా ఆశించే ఆయన వస్తున్నారన్న విషయాన్ని అంగీకరించకుండా పార్టీ బలోపేతం అవుతుందని జిల్లా మంత్రి చెబుతుండడాన్ని తప్పుబడుతున్నారు. టీడీపీకి సహకరిస్తానని కలమట చెబుతుండడం వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయో అందరికీ తెలుసునని, కలమట స్వయంగా పార్టీకి ఆకర్షితులు కానట్టేనని చెబుతున్నారు. రాష్ట్రం రెండు ముక్కలైన తరువాత లోటు బడ్జెట్‌లో ఉన్న ప్రభుత్వం, నిలువనీడ లేనప్పటికీ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కలమట చెప్పడం వెనుక ఆయన ఎలాంటి ప్రలోభాలకు గురై పార్టీకి మద్ధతివ్వాల్సి వచ్చిందో చెప్పాలని ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు.