డబ్బులు తీసుకుని టికెట్లు
ఇప్పించారంటున్న స్వపక్ష నాయకులు
అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు లక్ష్యంగా తిరుగుబాటు బావుటా
రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరికలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘అచ్చెన్నకు మాపై ఎందుకంత కక్ష’.. అంటూ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వందలాది ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అచ్చెన్న, కూన రవికుమార్ కుట్ర వల్లే నాకు టికెట్ రాలేదు. ఎంపీకై నా ఇక్కడి ఓట్లు అక్కర్లేదా..’ అంటూ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తల ముందు బాధనంతా వెళ్లగక్కారు. బాబాయ్, అబ్బాయ్‌ల ఆధిపత్య ధోరణిపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. పార్టీలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్న కింజరాపు కుటుంబంపై స్వపక్ష నాయకులంతా గుర్రుగా ఉన్నారు.
శ్రీకాకుళంలో కావాలనే..
శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ ఫ్యామిలీని తొక్కాలని కింజరాపు ఫ్యామిలీ మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది. తమ చెప్పు చేతుల్లో ఉండే నాయకుడు తప్ప తమ ను ప్రశ్నించే నాయకుడు ఉండకూదని గుండ అప్ప లసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులను సమ యం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే గొండు శంకర్‌ను రంగంలోకి దించి ఉసిగొల్పారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. చెప్పాలంటే గుండ ఫ్యామిలీపై గొండు శంకర్‌ను ఎక్కు పెట్టారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టగ ల శంకర్‌తో నానా హడావుడి చేయించారు. గొండు శంకర్‌కే తప్ప గుండ ఫ్యామిలీకి ఏమీ లేదన్నట్టుగా అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేశారు. చివరికొచ్చేసరికి టికెట్ విషయంలో పైరవీలు చేశారు. ప్రస్తుతం టీడీపీ అంతా డబ్బు మయమైపోయింది.
ఎవరెక్కువ ఇస్తే వాళ్లకే టిక్కెట్ అంటూ లాబీయింగ్‌కు పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో ఒక వైపు డబ్బు, మరోవైపు కింజరాపు ఫ్యామిలీ ఒత్తిడి వెరసి గుండ ఫ్యామిలీకి టిక్కెట్ దక్కకుండా చేసింది. ఇదంతా బహిరంగ రహస్యమే. డబ్బుతోనే టిక్కెట్ సాధించుకున్నానని, మీకు అది చేతకాలేదని గొండు శంకర్ అందరి దగ్గర అంటున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు రూ.10కోట్లు, లోకేష్‌కు రూ.10కోట్లు, అచ్చెన్నాయుడికి ఇన్ని కోట్లు, రామ్మోహన్‌నాయుడికి ఇన్ని కోట్లు, కూన రవికుమార్‌కు ఇన్ని కోట్లు ఇచ్చానని టిక్కెట్ సాధించిన వ్యక్తే చెబుతున్నాడని మీడియా ముందు టీడీపీ నాయకులు ఆరోపించ డం గమనార్హం. దీన్ని బట్టి టిక్కెట్ల కేటాయింపులో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది.
డబ్బుకు రుచి మరిగారు..
పాతపట్నంలోనూ దాదాపు అదే పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ కూడా మామిడి గోవిందరావు ఆఫర్‌కు తలొగ్గి తనకు అచ్చెన్నాయుడు దెబ్బకొట్టారని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీని నమ్ముకుని టిక్కెట్ కోసం ప్రయత్నించగా, సైలెంట్‌గా కింజరాపు ఫ్యామిలీ దెబ్బకొట్టిందని కలమట వెంకటరమణ ఆవేదన చెందుతున్నారు.
అంతా వారే చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా డబ్బులకు అమ్ముడు పోయిందని, ప్లాట్ల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసిన మామిడి గోవిందరావును అభ్యర్థిగా పెట్టారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమైపోయిందని, నాయకులు ఏ విధంగా అమ్ముడు పోయారనేది స్పష్టమవుతుందని టీడీపీని నమ్ముకుని మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకులు ఓపెన్ అవుతున్నారు. మామిడి గోవిందరావు ఇచ్చిన డబ్బులకు రుచిమరిగి నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టేశారని భంగ పడిన నాయకులంతా ఆరోపిస్తున్నారు. సీనియర్ ఉంటే ఎదురు తిరుగుతారని, జూనియర్‌ను పెట్టుకుంటే చెప్పినట్టు నడుచుకుంటారని, తమ మాట జవదాటరనే ఉద్దేశంతో కలమటకు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని చెబుతున్నారు.
కళా.. చివరికిలా..
జిల్లాలో మరో సీనియర్ నేత కళా వెంకటరావు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తమకు సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారన్న కారణంతో ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే ప్రయత్నం చేశారు. అదును చూసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెట్టేలా పావులు కదిపారు. ఎచ్చెర్లకు ప్రాతిని ధ్యం వహిస్తే తమకు అడ్డు తగులు తారని, ఈ జిల్లాలోనే లేకుండా చేస్తే పనైపోతుందని భావించి కళా వెంకటరావుకు పొత్తు సెగ పెట్టారు. కుడితి లో పడ్డ ఎలుకలా ప్రస్తుతం కళా గిలగిల కొట్టుకుంటున్నారు. కింజరాపు ఫ్యామిలీ కుట్రలను ఛేదించలేక చతికిలపడ్డారు. చివరికి చీపురుపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించి పార్టీ చేతులు దులుపుకుంది.
ఎన్నికల్లో మూల్యం తప్పదు
కింజరాపు ఫ్యామిలీ కుట్రలకు బలైన నాయకులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను టార్గెట్ చేసి రాజకీయంగా తొక్కేసిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుకు బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారికి బదులివ్వాల్సిందేనని, రేపు ఎలా ఓట్లు పడతాయో చూస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి పశువు చేస్తారా? అని ఆగ్రహంతో రగిలిపోయి ఉన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు అంటేనే ఒంటి కాలితో లేస్తున్నారు. మమ్మల్ని దెబ్బకొట్టినోళ్లకు తమ దెబ్బ ఏంటో చూపిస్తామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment