Srikakulam Sm Puram Village History And Interesting Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

SR Puram Village History: కాలం దాచుకున్న కథ ఇది!

Published Sat, Jun 18 2022 11:27 AM | Last Updated on Sat, Jun 18 2022 2:31 PM

Special Story And History About Sm Puram Village Srikakulam - Sakshi

ఏనుగు దువ్వారాలుగా పిలిచే ద్వారం

ఎచ్చెర్ల క్యాంపస్‌: పేరు ఎస్‌ఎం పురం.. పూర్తి పేరు షేర్‌ మహమ్మద్‌ పురం. చూసేందుకు సాదాసీదా ఊరు. సగటు సిక్కోలు పల్లె. 16వ నంబర్‌ పాత జాతీయ రహదారి దాటి శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ మీదుగా పిల్లలవలస, ధర్మవరం రోడ్డుపై ఈ ఊరికి వస్తే చెరువు గట్టుపై కొన్ని శిథిల నిర్మాణాలు కనిపిస్తాయి. ఆ ఊరు, ఊరి పేరు, ఆ పేరు వెనుక తీరూతెన్నూ అన్నీ ఈ శిథిలాలే తమలో దాచుకున్నాయి. గోలుకొండ నవాబులకు శ్రీకాకుళానికి సంబంధమేమిటో, ముస్లిం పేరు ఈ ఊరికి ఎందుకు వచ్చిందో, అసలు ఈ నిర్మాణాలేమిటో అన్న కథలను కాలం దాచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

నాలుగు శతాబ్దాల వెనుక.. 
అప్పట్లో రాష్ట్రాలు లేవు. ఈ ప్రాంతాన్ని గుల్షనాబాద్‌గా పిలిచేవారు. రాచరికపు రోజులు. గోలుకొండ నవాబు వంశంలో చివరి చక్రవర్తి ఆలీ దూత షేర్‌ మమ్మద్‌ఖాన్‌ ప్రస్తుత షేర్‌మమ్మద్‌పురం (ఎస్‌ఎం పురం) కేంద్రంగా అప్పట్లో పాలన సాగించారు. ఆయన పేరునే ఈ గ్రామానికి పెట్టారు. షేర్‌మమ్మద్‌ ఖా న్, వీరి కుటుంబ సభ్యుల పాలన 1604 ప్రాంతంలో కొనసాగింది. పాలనా సౌలభ్యం కోసం ప్రస్తుత ఎస్‌ఎం పురం కేంద్రంగా అనేక నిర్మాణాలు చేపట్టారు. 

ఆనాటి నిర్మాణాలు పర్యావరణ పరిరక్షణ, ఏనుగులు, గుర్రాలు సంరక్షణ, తాగునీటి కల్పన వంటి అంశాల ఆధారంగా ఉంటాయి. వంద ఎకరాల వరకు విస్తీర్ణంలో పెద్ద చెరువును నిర్మించారు. ఈ చెరువు గట్టుపై ఏనుగులు, గుర్రాల సంరక్షణ కోసం భవనం నిర్మించారు. దీన్నే స్థానికులు ఏనుగుల దువ్వారం అని పిలుస్తుంటారు. ప్రవేశ ద్వారం, వెలుపుల రెండు వైపులా ఏనుగులు, గుర్రాలు కోసం ప్రత్యేకంగా షెడ్‌లా నిర్మాణం ఉంటుంది.

ఈ నిర్మాణానికి కొద్ది దూరంలో కోట ఉంటుంది. ఈ కోట విలాసంగా నిర్మించారు. ఇది అప్పటి పా లకుల నివాసం. ఈ నివాసం సమీపంలో వరుస గా ఏడు బావులు ఉంటాయి. మంచి నీటి కోసం, స్నానాల కోసం, గుర్రాలు, ఏనుగులకు నీటితో శుభ్రం చేసేందుకు, దుస్తులు ఉతికేందుకు, మృతి చెందిన ఏనుగులు, గుర్రాలు పూడ్చేందుకు ఇలా నిర్మాణాలు చేపట్టారు. బావులన్నీ రాతి కట్టడాలే. చెరువు పక్కన ఉండటం వల్ల నీరు ఎప్పుడూ ఉంటుంది. మరో పక్క చెరువు నీరు బావులకు తరలించేందుçకు చిన్న కాలువలు సైతం నిర్మించారు. కొన్న దశాబ్దాలు పాటు ఈ నిర్మాణాలు సాగాయి.  

ఇప్పుడన్నీ శిథిలాలే..  
ప్రస్తుతం ఏనుగు దువ్వారాలు, నివాస కోటలు శిథిలావస్థకు చేరుకున్నాయి. భవనాల ఆనవాళ్లు మాత్రం ఉన్నాయి. కోట సైతం ఇప్పటికీ  ఉంది. వీటి ద్వారాలు, నిర్మాణంలో ఇనుము, ఇతర లో హాలు తవ్వుకుపోవడం వల్ల రాతి కట్టడం మాత్ర మే ఉంది. ఏడు బావుల్లో ఐదు బావులు ఉన్నా యి. కొన్ని శిథిలావస్థకు చేరగా, కొన్న మరమ్మతు లు చేసి రైతులు వినియోగిస్తున్నారు. రైతులు పొ లాల మధ్యలో నిర్మాణాలు, బావులు ఉండటం, మరో పక్క ఆక్రమణలు గురికావటం వల్ల నిర్మాణాలు శిథిలమవుతున్నాయి. గత కొన్నేళ్ల వరకు ఈ బావుల్లో నీటిని తాగేవారు కూడా.

ప్రస్తుతం సీసీలతో నీరు పట్టుకువెళ్లటం వల్ల వినియోగం తగ్గింది. పర్యవేక్షణ లేకపోవటం, ఈ భూములు సైతం ఆక్రమణలకు గురికావటంతో చరిత్ర ఆనవాళ్లు కొన్నే మిగిలాయి. ఆనాటి పాలకుల పేర్లు సైతం స్థానికంగా కొన్ని గ్రామాలకు ఇంకా ఉన్నాయి. షేర్‌మహ్మద్‌పురం, ఫరీదుపేట, ఇబ్రహింబాద్, షేర్‌మమ్మద్‌పురం పేట, అఖాం ఖాన్‌పేట వంటి గ్రామాలు ఈ కోవకు చెందినవే.

షేర్‌ మహ్మద్‌ ఖాన్‌ మంచి పాలకుడు 
ఉత్తరాంధ్రలో గోలుకొండ నవాబుల పాలన కాలంలో వీరి ఆశయానికి విరుద్ధంగా పాలన సాగింది. ఆలయాలపై దాడులు, మత మార్పిడి వంటివి అప్పట్లో జరిగాయి. ఈ విషయం తెలిసిన నవాబులు సైన్యాధికారిని కఠినంగా శిక్షించారు. అనంతరం షేర్‌మహ్మద్‌ఖాన్‌కు పాలన బాధ్యతలు అప్పజెప్పా రు. ఆయన ఇప్పటి ఎస్‌ఎం పురం కేంద్రంగా పాలన సాగించాడు. వ్యవసాయం కోసం చెరువులు తవ్వించారు.

ప్రస్తుత ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు సైతం ఆయన పాలనలోకి వచ్చాయి. సైన్యాధిపతి చేసిన తప్పులు సైతం 1604 నుంచి సరిదిద్దటం ప్రారంభించాడు. మరో పక్క అప్పుడు తరచూ యుద్ధాలు వచ్చేవి. ఈ నేపథ్యంలో తమ రక్షణ కోసం నిర్మాణాలు చేపట్టేవారు. స్థానిక జమిందారులకు గ్రామాలు, ప్రాంతాలు దత్తత ఇచ్చి పాలన సాగించేవారు. పరిస్థితులకు అనుగుణంగా పన్నులు వసూలు చేసేవారు. 
– ప్రొఫెసర్‌ కొల్లూరు సూర్యనారాయణ, ఆంధ్రా విశ్వవిద్యాలయం చరిత్ర విశ్రాంత ఆచార్యులు, చరిత్ర పరిశోధకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement