సఖ్యతకు తరుణం | Special Story On Christmas Celebration | Sakshi
Sakshi News home page

సఖ్యతకు తరుణం

Published Wed, Dec 25 2019 12:33 AM | Last Updated on Wed, Dec 25 2019 2:40 PM

Special Story On Christmas Celebration - Sakshi

తెగిపోయిన అనుబంధాల్ని ఈ ‘క్రిస్మస్‌’ రోజు పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువులతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలంటే తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్‌!!  

దేవుడు తన అద్వితీయ కుమారుడైన, తనకు మానవ రూపమైన యేసుక్రీస్తు సారథ్యంలో నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించ తలపెట్టిన ‘దైవిక రాజ్యం’ ఆవిష్కరణకు అలనాటి యూదా దేశం (నేటి ఇజ్రాయేలు దేశంలోని దక్షిణ భూభాగం) లోని బేత్లెహేము వేదికగా రంగమంతా సిద్ధమయ్యింది. అంతటి మహత్తరమైన పరిణామానికి రెండువేల ఏళ్ల క్రితం, యూదయ అనే ఒక ఎడారి ప్రాంతాన్ని, తరుచు  క్షామాలకు లోనయ్యే అక్కడి బెత్లేహేము అనే పేద గ్రామాన్ని, యేసుక్రీస్తుకు ఇహలోకపు తల్లిదండ్రులుగా యూదా వంశీయుడైన యోసేపు, లెవీ వంశీయురాలైన మరియ అనే నిరుపేదలను, యేసు ఆవిర్భావ సువార్త ప్రచారకులుగా బేత్లెహేముకే చెందిన కొందరు నిరుపేద గొర్రెల కాపరులను, దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా ఏర్పర్చుకున్నాడు.

పెను విషాదమేమిటంటే, పుడమినేలేందుకు వచ్చిన పరలోకపు రాజైన యేసుకు ఎక్కడ చూసినా పేదరికం, దారిద్య్రమే తాండవించే యూదయ దేశపు బెత్లేహేములో, అక్కడి సత్రంలోనైనా కనీసం కాసింత చోటు దొరకలేదు. అందువల్ల అక్కడి పశువుల కొట్టంలోనే ప్రభువు జన్మించాడు, పశువులు దాణా తాగేందుకు వాడే ఒక పశువుల తొట్టి ఆయనకు మెత్తటి పూలపాన్పుగా పనికొచ్చింది.   మునుపటి రాజ్యానికి భిన్నంగా.. నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరాశ్రయులే ప్రధాన పౌరులుగా ఏర్పాటుచేయ తలపెట్టిన దైవిక రాజ్యాన్ని.. ఇలా పేదరికంలోనే దేవుడు నిర్మించ తలపెట్టాడు. దైవిక రాజ్యస్థాపన కోసం యేసుక్రీస్తు ప్రధాన సైన్యాధికారిగా, పేదలు, బలహీనులే ఆయనకు విధేయులైన సైన్యంగా గత రెండువేల ఏళ్లుగా సాగుతున్న సమరంలో రక్తపుటేరులు కాదు.. ప్రేమ, క్షమాపణ  అనే జీవనదులు పొంగి పారుతున్నాయి.

చరిత్రలో దుర్నీతి, దౌర్జన్యం, దుష్టన్యాయమే ఇతివృత్తంగా సాగి నిరుపేదల దోపిడీ కి పెద్దపీట వేసిన సామ్రాజ్యాలకు ప్రత్యామ్నాయంగా ప్రభువు తన  దైవిక రాజ్య స్థాపన కోసం ‘్రౖకైస్తవాన్ని’ తన సాత్విక ఆయుధంగా ఎంచుకున్నాడు. క్రీస్తు సారథ్యంలోని ‘క్రైస్తవం’ దేవుని రాజ్యానికి ప్రతీక. అందువల్ల అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి, ఆడంబరాలకు, ధనాపేక్షకు అతీతంగా క్రీస్తును పోలి జీవించే వారే క్రైస్తవం లో పౌరులు. మరి దీనికంతటికీ భిన్నంగా బోధిస్తూ, జీవిస్తూ ఉన్నవాళ్లు ఎవరు? యేసుప్రభువు పరిభాషలో చెప్పాలంటే, వాళ్లు గోధుమల మధ్య ‘శత్రువు’ కుట్రతో పెరుగుతున్న ‘గురుగులు’ (మత్తయి 13:27)!! శత్రువులు రెండు రకాలు. ఎదురుగా నిలబడి మనతో యుద్ధం చేసే శత్రువు ఒకరైతే, దొంగచాటు దెబ్బలతో మనిషిని పడగొట్టే శత్రువు మరొకరు.

చెట్లతో కిక్కిరిసి ఉన్న కీకారణ్యంలో నడిచే బాటసారులను, వేటగాళ్లను కింద గడ్డిలో దాక్కొని అకస్మాత్తుగా మడిమె మీద కాటేసి చంపే విషసర్పం లాంటి వాడు ‘సైతాను’ అని పిలిచే ఈ శత్రువు. గోధుమల మధ్య గురుగులు విత్తే అలవాటున్న శత్రువు.. కుటుంబాల్లో, చర్చిల్లో, చివరికి క్రైస్తవ సమాజంలో, మానవ సంబంధాల్ని కలుషితం చేసి చిచ్చు పెట్టడంలో దిట్ట. అందుకే ఈ ‘క్రిస్మస్‌’ లో తెగిపోయిన అనుబంధాల్ని పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట  పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువు లతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలాంటి తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్‌!!  
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement