క్రీస్తు నడయాడిన ముఖ్య ప్రదేశాలు...
1. బెత్లెహేమ్
ఇది క్రీస్తు పుట్టిన ఊరు. ‘హోలీల్యాండ్’గా, ‘బైబిల్‌ల్యాండ్’గా ప్రసిద్ధి పొందింది. ఇజ్రాయెల్‌లో ఉంది. ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటైన ఇజ్రాయెల్ ముస్లింలకు, యూదులకు కూడా పవిత్ర దేశమే. ఇది 1948లో స్వాతంత్య్రం పొందింది. అంతకు ముందు పాలస్తీనాలో అంతర్భాగంగా ఉండేది. బెత్లెహేమ్‌లో క్రీస్తు పుట్టిన ప్రదేశం పాలస్తీనా భూభాగంలో ఉంది. ఆ ప్రదేశంలో నిర్మించిన ‘చర్చ్ ఆఫ్ నేటివిటీ’ అత్యంత పురాతనమైన చర్చిలలో ఒకటి.
ఇక్కడే ఉన్న ‘సెయింట్ క్యాథరీన్ చర్చ్’లో ఏటా డిసెంబర్ 24 అర్ధరాత్రి జరిగే క్రిస్మస్ ఆరాధనను ప్రముఖ టీవీ చానళ్లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఇక్కడకు కొద్ది దూరంలోనే ‘షెపర్డ్స్ ఫీల్డ్’ ఉంది. క్రీస్తు జనన వార్తను దేవదూత గొర్రెల కాపరులకు వెల్లడించిన పవిత్ర స్థలం ఇదే.
2. నజరేత్
యేసు పుట్టిన తర్వాత తల్లి మరియ, తండ్రి యోసేపు బిడ్డను తీసుకుని ఈజిప్టు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్‌కు ఉత్తరాన ఉన్న ‘గలిలయ’ ప్రాంతం లోని తమ పూర్వీకుల ప్రాంతమైన నజరేత్‌కు చేరుకున్నారు. యేసు బాల్యం గడిచింది ఇక్కడే. నజరేత్‌లో యేసు తల్లి మరియ, తండ్రి యోసేపుల ఇళ్లు ఉన్నాయి.
3. కానా
నజరేత్‌కు చేరువలోనే కానా పట్టణం ఉంది. ఇక్కడే ‘గలిలయ’ సరస్సు ఉంది. ఇది జోర్డాన్ నదికి చెందిన జలాశయం. ఈ సరస్సు దగ్గరే యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. యేసు ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే సంచరించేవాడు. ఆయన శిష్యులు కూడా ఈ పరిసరాలకు చెందినవారే.
4. జోర్డాన్ నది
యేసు తన ముప్ఫయ్యవ ఏట జోర్డాన్ నదిలోనే బాప్టిజం పొందాడని, తర్వాత అక్కడి అరణ్యంలోనే నలభై రోజులు ఉపవాస దీక్ష చేశాడని చెబుతారు. అందుకే, చాలామంది జోర్డాను నదిలో బాప్టిజం తీసుకోవాలనుకుంటారు. ఈ నది కలిసే మృతసముద్రం ప్రపంచం లోనే అత్యంత లోతైనది. దీనిలోని నీరు చర్మరోగాలను నయం చేయగలదనే నమ్మకం కూడా ఉంది.
5. తక్బా
గలిలయ ప్రాంతం లోని కపెర్నామ్ వద్ద ఉంది‘తక్బా’. ఇది యేసుక్రీస్తు ఐదు రొట్టెలు, రెండు చేపలతో ఐదువేల మంది ఆకలి తీర్చిన స్థలంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడే ఉన్న ‘మౌంట్ టాబర్’ను క్రీస్తు పునరుత్థానం చెందిన ప్రదేశంగా చెబుతారు.
6. జెరికో
జెరికో పట్టణం పాలస్తీనాలో ఉంది. ఇది క్రీస్తు నడయాడిన ప్రదేశాల్లో ఒకటి. ఈ పట్టణంలోనే ఒక అంధునికి యేసు తన స్పర్శ ద్వారా చూపు నిచ్చినట్లు చెబుతారు. ఈ పట్టణాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పట్టణంగా భావిస్తారు. దాదాపు క్రీస్తుపూర్వం 10 వేల సంవత్సరాల కిందటే ఇక్కడ జనావాసాలు ఉన్నట్లు పురాతత్వ ఆధారాలు దొరికాయి.
7. జెరూసలెం
బెత్లెహేమ్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉందిది. ఇక్కడే యేసును శిలువ వేసిన గొల్గొతా కొండ, ఆయనను సమాధి చేసిన స్థలం ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రార్థన చేసిన ఒలీవల కొండ, శిష్యులతో కలసి ఆయన చివరి విందు ఆరగించిన మేడ గది, దావీదు సమాధి, రాచభటులు ఆయనను బంధించిన గెత్సెమనె తోట, మరియమ్మ సమాధి వంటి పలు పవిత్ర స్థలాలు జెరూసలెంలోనే ఉన్నాయి.
ఇక్కడ సొలొమోను రాజు నిర్మించిన ఆలయ ప్రహరీగోడ క్రైస్తవులకు, యూదులకు కూడా పవిత్ర స్థలం. దీనినే ‘ప్రలాపాల ప్రాకారం’ అంటారు. అక్కడ చేసే ప్రార్థనలను దేవుడు తప్పక ఆలకించి, అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.