ఇవ్వడంలోని ఆనందమే వేరు!
క్రిస్‌మస్ అంటే ఒకరికి ఇవ్వడంలో ఉండే సంతోషాలను అనుభవించడం. మరొకరికి సంతోషాలను పంచివ్వడంలో ఉండే ఆనందాన్ని పొందడం. నేను క్రిస్మస్ ద్వారా తెలుసుకున్నది... ఇవ్వడంలోని హాయిని అనుభూతి చెందడం. ఎందుకంటే... క్రిస్మస్ గురించి నాకు చిన్నప్పటి నుంచీ స్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. క్రిస్‌మస్ అనగానే మా ఉపప్రధాన అధ్యాపకులు సుందరం మాస్టారు, విక్టోరియా టీచర్, విమలమ్మగారు, ఇంకా మా నాన్న కొలీగ్ మోజెస్ గారు... ఇలా చాలామంది గుర్తుకొస్తారు.
ఆ పండుగ రోజున మా నాన్నగారు వాళ్లకు కేక్స్, ఫ్రూట్స్ పంపుతుండేవారు. అప్పటికి నా వయసు పదీ పన్నెండేళ్లు ఉండేది. ఆ తర్వాత నేను ఇంగ్లండ్ వెళ్లాక క్రిస్మస్ అంటే మళ్లీ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుండేది. ఇక క్రిస్మస్ సమయంలో మా ‘హృదయ ఫౌండేషన్’కు ఎన్నెన్నో విరాళాలు పంపుతుంటారు. మనకు ఉన్నదానిలో ఇతరులకు ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ల సంతోషాన్ని చూసి మనం పొందే ఆనందం ఎలా ఉంటుందో చిన్నప్పుడు తెలుసుకున్నాను నేను.
ఇలా హృదయ ఫౌండేషన్‌కు ఇవ్వడం ద్వారా ఇతరులూ అదే సంతోషాన్ని పొందుతున్నారనే విషయాన్ని ఇప్పుడు పెద్దయ్యాక సహానుభూతి వల్ల తెలుసుకోగలుగుతున్నాను. చిన్నప్పుడు వ్యక్తిగా ఇవ్వడంలోని ఆనందాన్ని తెలుసుకున్న నేను... పెద్దయ్యాక అదే విషయాన్ని డాక్టర్‌గా కూడా తెలుసుకున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే క్రిస్మస్ అంటే ‘ఇవ్వడం’.
- డా॥గోపీచంద్ మన్నం
కార్డియోథొరాసిక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్