ఇజ్రాయెల్ దేశంలోని ఎరికో పట్టణంలో జక్కయ్య అనే ధనికుడు ఉన్నాడు. పన్ను వసూళ్ల అధికారిగా తన ధనాన్ని రెట్టింపు చేసుకున్నాడనే కోపంతో ‘పాపి’ అనే ముద్ర కూడా అతనికి వేశారు స్థానికంగా ఉన్న యాజకులు, పరిసయ్యలు. ఆ రోజు తన పట్టణానికి యేసుప్రభువు వస్తున్నాడని విన్న జక్కయ్య ఆనంద తరంగమయ్యాడు. ఎందుకంటే యేసు గురించి అతడు ఎన్నో అద్భుతాలు విని ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రం ఉదయించిందని, దేవదూతలు గాన ప్రతిగానాలతో ఆయన జననాన్ని ప్రజలందరికీ మహా సంతోషకరమైన వర్తమానంగా ప్రకటించారని విన్నాడు. ఆయన తన యవ్వన ప్రారంభం నుండే గొప్పæఆచరణీయ విషయాలు బోధించడమేగాక, ప్రజల వ్యాధి బాధల్ని నయం చేస్తున్నాడని, దురాత్ములను గద్దించి, ఆయా వ్యక్తుల్ని విడుదల చేస్తున్నాడని, చనిపోయిన వాళ్లకు సైతం పునరుజ్జీవం చేస్తున్నాడని, గాలిని, తుఫానులను, సముద్రాన్ని గద్దించి, నిమ్మళపరిచి, ప్రకృతిని శాసించాడనీ.. ఇలాంటి ఎన్నో సంగతులు విన్నప్పుడు జక్కయ్య గుండె వణికింది. అప్పటినుండి యేసును చూడాలనే కోరిక రోజురోజుకు ఎక్కువవుతుండగా, ఆ రోజు వాళ్ల ఊరికే ఆయన వస్తున్నాడని విని, ఆయన రాబోయే బాటకు పరుగుపెట్టాడు. తనేమో పొట్టివాడు. క్రీస్తుప్రభువు చుట్టూ పెద్ద జన సందోహముంటుంది. ఆయన్ని ఎలా చూడగలడు? ఆ బాట పక్కనే ఓ చెట్టును చూశాడు.
వెంటనే చెట్టెక్కి, ఆయన్ని చూడగలిగిన చోటులో కూర్చున్నాడు. తన ధనం అధికార హోదా, వయసు.. ఏవీ అడ్డురాలేదు. అంతలోనే పెద్ద జన సమూహం వచ్చేసింది. జక్కయ్య లేచి నిలబడి, ఆందోళనగా క్రీస్తు కోసం వెదుకుతున్నాడు. చెట్టుకింది నుండి ఎవరో తనని పిలుస్తున్నారు. ‘‘జక్కయ్యా, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను’’ అని వినిపించింది. ‘ఆయనే యేసయ్య’ అని ఎవరో అన్నారు. గడగడలాడుతూ బిరబిరా చెట్టు దిగాడు జక్కయ్య. ప్రశాంతమైన, వాత్సల్యపూరితమైన ఆయన మోము చూశాడు. కళ్లలో కదలాడుతున్న కరుణను చూశాడు. అంతే! యేసయ్య పాదాజీపై పడ్డాడు. ‘‘ప్రభూ! నా ఆస్తిలో సగం పేదలకిస్తాను, నేనెవరి వద్ద అన్యాయంగా తీసుకున్నానో, వాళ్లకు అంతకు నాలుగింతలు ఇచ్చేస్తాను. నా తప్పులన్నింటినీ మన్నించండి స్వామీ’’ అంటూ ప్రభువు పాదాలను కన్నీటితో కడిగాడు. ఆ పూట తన ఇంటిలో పెద్ద విందు చేశాడు జక్కయ్య. ‘‘ఈయన పాపులతో కలిసి తింటున్నాడు’’ అన్న పరిసయ్యలకు ప్రభువిచ్చిన జవాబు.. ‘రోగికే కదా వైద్యుడు కావాలి, నశించిన దానిని వెదికి, రక్షించేందుకే నేను వచ్చాను’ అని!
– ఝాన్సీ కేవీకుమారి
Comments
Please login to add a commentAdd a comment