శస్త్రచికిత్స గురించి వివరిస్తున్న డాక్టర్ లక్ష్మణస్వామి, చిత్రంలో గౌస్ మొహిద్దీన్
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా అందరికీ గుండె ఎడమవైపున ఉంటుంది. 20 వేల మందిలో ఒకరికి కుడివైపున ఉంటుంది. కానీ ఈయనకు మాత్రం పూర్తిగా ఛాతి మధ్యలో ఉంది. అది కూడా వంకర తిరిగి ఉండటంతో వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. ఇలాంటి వ్యక్తికి బైపాస్ సర్జరీ చేయడం ప్రపంచంలోనే రెండోదని వైద్యులు ప్రకటించారు. వివరాలను మంగళవారం కర్నూలులోని గౌరీగోపాల్ హాస్పిటల్‌లో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ పీఎన్‌ఎన్. లక్ష్మణస్వామి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘కడప నగరానికి చెందిన గౌస్ మొహిద్దీన్ (57) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
ఆయనకు రెండు నెలల నుంచి ఆయాసం ఎక్కువై ఇటీవల గుండెపోటు వచ్చింది. స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకోగా వైద్యపరీక్షలు చేసిన వైద్యులు బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని కర్నూలుకు రెఫర్ చేశారు. హాస్పిటల్‌లో చేరిన అతనికి 2డీ ఎకో, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించగా మీసో కార్డియా అనే పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కూడా ఉందని నిర్ధారించాం. ఈ సమస్య వల్ల అతని గుండె ఎడమ వైపునకు గాకుండా ఛాతి మధ్యలో ఉండటంతో పాటు వంకరగా తిరిగింది. ఇలాంటి గుండెలో బైపాస్ సర్జరీ ఇప్పటికి ఒకసారి మాత్రమే 2016లో హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఇలాంటి గుండెకు బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీని అనెస్తెటిస్ట్ డాక్టర్ భానుప్రకాష్‌తో కలిసి ఈ నెల 25వ తేదీన కర్నూలులో విజయవంతంగా నిర్వహించాం. ఇలాంటి బైపాస్ సర్జరీ ప్రపంచంలో రెండోది మాత్రమే. ప్రస్తుతం గౌస్ మొహిద్దీన్ కోలుకుంటున్నాడు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించాం. గౌరీగోపాల్ హాస్పిటల్‌లో 3వేల కార్డియోథొరాసిక్, వాస్కులర్ ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment