డిసెంబర్ నెల అంటే టక్కున గుర్తొచ్చేది క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు ఈ పండుగను తమదైన శైలిలో అంగరంగవైభవంగా పండుగను జరుపుకుంటారు. దాదాపు డిసెంబర్ నెల మొత్తం చర్చిలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ వేడుకలు కొంత ప్రత్యేకమేనని చెప్పొచ్చు. ఎందుకంటే కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన చర్చిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నగరం నలుమూలలనుంచి ప్రజలు ఇక్కడకు చేరుకుని ప్రార్థనలు నిర్వహిస్తారు.
ఆంగ్లేయుల ప్రార్థనల కోసం..
నిజాం పాలకులు బ్రిటిషర్లకు అప్పగించిన సికింద్రాబాద్‌ను ఆంగ్లేయులు మిలిటరీ స్థావరంతో (కంటోన్మెంట్) పాటు హైదరాబాద్‌కు సమాంతర నగరంగా తీర్చిదిద్దారు. ఓ వైపు మిలిటరీ శిక్షణ కేంద్రాలు, మిలిటరీ ఆంక్షల నడుమ వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, సామాన్యుల జనావాసాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే బ్రిటిష్ పాలకులు తాము ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నగరమంతటా చర్చిల నిర్మాణం ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న వందకుపైగా చర్చిలలో కొన్ని వందేళ్లకుపైగా చరిత్ర కలిగినవి ఉన్నాయి.
సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ చర్చి
ఈ చర్చి సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రముఖమైన చర్చి. 1813లో నిర్మితమైన ఈ చర్చి జంటనగరాల్లోనే అత్యంత పురాతనమైంది. లాన్సర్స్ లైన్‌లోని బ్రిటిష్ కుటుంబాలు ప్రార్థన చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 1998లో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అవార్డును దక్కించుకుంది. 111 ఏళ్ల నాటి ‘పైప్ ఆర్గాన్’ నేటికీ వినియోగంలో ఉండటం దీని ప్రత్యేకత. చర్చి ప్రారంభించిన మొదట్లో ఆంగ్లేయులే మాత్రమే వెళ్లేవారు. కానీ ప్రస్తుతం నగరంలోని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు
సెయింట్ మేరీస్ చర్చి
నగరంలోని అత్యంత ప్రముఖమైన చర్చిగా సెయింట్ మేరీస్ చర్చి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ చర్చిని గోతిక్ శైలిలో నిర్మించారు. అత్యంత పురాతనమైన రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఐరిష్ క్యాథలిక్స్‌తో కలిసి ఫాదర్ డేనియల్ మర్ఫీ 1840లో ఈ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా, 1850లో పూర్తయింది. 1886 వరకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ప్రధాన చర్చి (క్యాథెడ్రల్)గా కొనసాగింది. చాలాకాలం ఆర్చ్ డయోసిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన చర్చిగా కొనసాగింది. రోమన్ క్యాథలిక్ చర్చిలలో ప్రముఖమైన వాటికి దక్కే ‘బాసిలికా’ గుర్తింపును ఈ చర్చికి 2008లో ఇచ్చారు. ‘బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అసెంప్షన్’గా కూడా వ్యవహరిస్తారు. కన్య మేరీ యేసు క్రీస్తును చేతుల్లో పట్టుకున్న దృష్యం భావోద్వేగ పూరితంగా ఉంటుంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
సెయింట్ థామస్ ఎస్‌పీజీ చర్చి
సికింద్రాబాద్‌లోని పురాతన చర్చిలలో అత్యంత ముఖ్యమైన చర్చ. ఒకటి. ఈ చర్చికి సంబంధించిన స్థలాల్లో చాలావరకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్థలం ఒకప్పుడు ఈ చర్చి ఆధ్వర్యంలోనిదే. 1852లో నిర్మితమైంది.
సెంటినరీ బాప్టిస్ట్ చర్చి
ఈ చర్చి సికింద్రాబాద్‌లో అత్యంత ప్రాముఖ్యమైన చర్చి. బాప్టిస్ట్ చర్చిగా రెవరెండ్ డబ్ల్యూ.డబ్ల్యూ. క్యాంప్‌బెల్ ఆధ్వర్యంలో 1875లో ఏర్పాటైంది. 1975లో పునర్నిర్మాణం చేపట్టగా 1991లో పూర్తయింది. ఈ చర్చి ఆధ్వర్యంలో జంటనగరాల్లోని 35 చర్చిలు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖ చర్చిలలో చాలా ముఖ్యమైనది.
ఆల్ సెయింట్స్ చర్చి
చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 1860లో తిరుమలగిరిలో నిర్మితమైన ఈ చర్చి నిర్వహణ ఆర్మీ ఆధ్వర్యంలోనే ఉండేది. స్వాతంత్య్రానంతరం ఆంగ్లికన్, ప్రొటెస్టెంట్‌ల సమ్మేళనంతో ఏర్పాటైన ‘చర్చి ఆఫ్ సౌత్ ఇండియా’ (సీఎస్‌ఐ) పరిధిలోకి వచ్చింది. క్వీన్ ఎలిజిబెత్– 2 భర్త ఫిలిప్‌తో పాటు 1983లో నగరాన్ని సందర్శించారు. వారి 36వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ చర్చిలోనే జరుపుకొన్నారు. ప్రతి వారం ఇంగ్లీష్, తమిళ భాషలలో నిర్వాహకులు తమ సేవలను అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు.
హోలీ ట్రినిటీ చర్చి
ఈ చర్చి సికింద్రాబాద్‌లో అత్యంత ప్రసిద్డి గాంచిన చర్చి. చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్‌ఐ) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ చర్చి విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించారు. 1847లో అప్పటి బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా తన సొంత డబ్బులతో బొల్లారంలో నిర్మించారు. ఈ చర్చిని క్వీన్ చర్చిగా పిలుస్తారు. క్రిస్మస్ వేడుకలకు ప్రజలు పెద్ద యెత్తున పాల్గొంటారు.
గారిసన్ వెస్లీ చర్చి
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఈ చర్చి ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1853లో నిర్మాణం ప్రారంభించగా, 1883 నుంచి వినియోగంలోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబాలు మాత్రమే ఈ చర్చిలో ప్రార్థనలు చేసేవారు. క్రిస్‌మస్, గుడ్‌ఫ్రైడ్‌డే వేడుకలు ఈ చర్చిలో ఘనంగా నిర్వహిస్తారు.
మిలీనియం మెథడిస్ట్ చర్చి
ఈ చర్చి సరోజిని దేవి రోడ్, సికింద్రాబాద్‌లోని చాలా ముఖ్యమైన చర్చి. మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన మిషనరీస్ ఆధ్వర్యంలో 1882లో నిర్మితమైంది. మెథడిస్ట్ చర్చిగా ప్రారంభమైన ఈ చర్చిని 2001లో పునర్నిర్మించాక మిలినియం మెథడిస్ట్ చర్చిగా నామకరణం చేశారు. ఈ చర్చిలో పెద్ద యెత్తున ప్రజలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు.
సెయింట్ జోసెఫ్ చర్చి
ఇది నగరంలోని అత్యంత ప్రముఖమైన చర్చి. అబిడ్స్‌లోని ఈ చర్చిలో ప్రార్థనలు చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. ప్రజలు పెద్ద సంఖ్యలో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. సంవత్సరం పొడువున పర్యాటకులు ఈ చర్చిని సందర్శిస్తుంటారు.
సెయింట్ జార్జ్ చర్చి-కింగ్ కోఠి హైదరాబాద్-
ఇది చాలా పురాతనమైన చర్చి, హైదరాబాద్ వారసత్వ సంపదలో ఈ చర్చికి చోటు కల్పించారు. చర్చ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో ఈ చర్చి కొనసాగుతుంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
గ్రాండ్ క్రిస్మస్ కార్నివాల్
నగరంలో క్రిస్మస్ వేడుకలలో కార్నివాల్ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో సంగీతం, ఆహారం & షాపింగ్ సదుపాయం కల్పిస్తారు. లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, క్రిస్మస్ కరోల్స్, మీట్ అండ్ గ్రీట్ శాంతా క్లాజ్ వంటి కార్యకలాపాలతో ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి. ఓపెన్ మైక్, రాప్ ఛాలెంజ్, హిప్ హాప్ ఛాలెంజ్, కాస్ ప్లే పోటీలు, డ్రాయింగ్ పోటీలు, ఫ్యాన్సీ దుస్తులు, లిటిల్ శాంటా పోటీలు యువత ఉత్సాహంగా పాల్గొంటారు. వైవిధ్యమైన ఆటలతో కుటుంబాలకు వినోదం లభిస్తుంది.
డిసెంబర్ 15 న ప్రారంభమైన కరోల్స్ ఆదివారం వివిధ చర్చిలలో ముగిసింది. క్రిస్మస్ రోజున మెథడిస్ట్ చర్చిలో పేదలు, వితంతువులకు ప్రత్యేక బహుమతులు, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తారు. క్రిస్మస్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం 15కోట్లు విడుదల చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఈ నిధులను కేటాయించింది. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాలకు నిధులు పంపిణి జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు.
- రవికాంత్ (వెబ్ డెస్క్)
Comments
Please login to add a commentAdd a comment