నేను చూసిన క్రైస్తవత్వం... | I have seen Christianity! | Sakshi
Sakshi News home page

నేను చూసిన క్రైస్తవత్వం...

Published Sun, Dec 20 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:15 PM

నేను చూసిన క్రైస్తవత్వం...

నేను చూసిన క్రైస్తవత్వం...

ప్రపంచంలోని ప్రతి మతం పవిత్రమైనదే. అవి బోధించే అంశాలు మానవులకి ఉపయోగపడేవే. మతం పేరిట కొందరి ప్రవర్తనా తీరు వలన మతాన్నే ద్వేషించే పరిస్థితి ప్రపంచంలో ఉంది. ఒక్కో ‘మది’ది ఒక్కోతీరు. హిందూమతం దైవ భక్తికి పెద్దపీట వేసింది. దృష్టిని ప్రపంచం మీద కాక, పరమాత్మ మీద నిలిపి ఉంచాలని హిందూమతం బోధించే భక్తి మార్గం. క్రైస్తవ మతమేమో సాటివారికి సాయం చేయాలని బోధిస్తూ, త్యాగానికి, సేవకి పెద్ద ప్రాముఖ్యతని ఇచ్చింది. కొందరు క్రిస్టియన్‌‌సలోని త్యాగశీలులకి చెందిన ఉదంతాలు తెలుసుకుంటే నాకు ఒళ్లు పులకరిస్తుంది.
 
క్రీ.శ. 1202లో ఇటలీలోని అస్సీ అనే చిన్న ఊరిలో ఓ ధనవంతుడుండేవాడు. అతని ఇరవై ఏళ్ల కొడుకు ఫ్రాన్సిస్ తన మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి గంట మోగుతున్న చప్పుడు వినిపించింది. ఆరోజుల్లో కుష్టువ్యాధికి మందులేదు. వాళ్లని ఊళ్లోకి అనుమతించేవారు కాదు. ఊరికి దూరంగా కాలనీలో ఆ వ్యాధిగ్రస్తులు ఉండేవారు. ఒకవేళ వారు ఊళ్లోకి రావాల్సి వస్తే, ఊరి బయట ఉన్న గంట మోగించి వస్తారు. అప్పుడంతా తప్పుకుంటారు.
 
ఆ గంట విని ఆయన పక్కకి తప్పుకునేలోగా ఓ కుష్ఠు వ్యాధిగ్రస్థుడు అతనికి ఎదురు పడ్డాడు. వ్యాధితో శరీరం, మొహం వికారంగా అయిపోయి ఆ రోగిని ఎవరు చూసినా అసహ్యించు కుంటారు. ఐతే ఫ్రాన్సిస్‌కి ఆ రోగి పరిస్థితి చూడగానే హృదయం ద్రవించింది.  అతని దగ్గరకు వెళ్లి అతనిని చూడగానే రెండడుగులు వెనక్కి వేసినందుకు క్షమాపణ చెప్పి, తన జేబులోని డబ్బంతా ఇచ్చి, ఆ రోగిని ఆలింగనం చేసుకున్నాడు. అతని ఔదార్యానికి కళ్లల్లో నీళ్లు తిరిగిన ఆ రోగి... ‘‘మనిషి స్పర్శ ఎలా ఉంటుందో మరిచిపోయాను. నాకది మీరు గుర్తు చేశారు’’ అన్నాడు.
 
ఆ యువకుడే నేటికీ క్రిస్టియన్స్ అంతా కొలిచే మహాత్ముడు ‘సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీ’.
 మరో సంఘటన. అది జనవరి 1945. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. పోలెండ్‌లోని జడోర్‌జూ అనే చిన్ని గ్రామంలోని రైల్వేస్టేషన్‌లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. అక్కడ పొడుగు చారల ఖైదీ దుస్తులు ధరించిన పదమూడేళ్ల అమ్మాయి కూర్చుని ఉంది. సరైన భోజనం లేని అమె మరణానికి దగ్గరగా ఉంది. ‘‘ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?’’ క్రిస్టియన్ ఫాదర్ అయిన ఆ యువకుడు ఆమెను అడిగాడు.
 
‘‘నా పేరు ఎడిట్ జైరర్. నాలుగేళ్లుగా నాజీ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్స్ నుంచి తప్పించుకున్నాను. నా స్వగ్రామానికి వెళ్లి నా తల్లిదండ్రులను, సోదరినిని కలుసు కోవాలని బయలుదేరాను’’ చెప్పిందామె. అతను వెళ్లి బ్రెడ్, టీకప్పుతో వచ్చి వాటిని ఆమెకు ఇచ్చి ఆకలిని తీర్చాడు. క్రాకోకి వెళ్లే రైలు రాగానే ఆ యువకుడు బల హీనంగా ఉన్న ఆమెని ఎత్తుకుని, పెట్టెలోకి మోసుకెళ్లాడు. జంతువులను రవాణా చేసే ఆ పెట్టెలో ఆమెకి చలి నించి రక్షణగా తన ఒంటి మీది కోటుని కప్పాడు. భగవంతుని ఆశీస్సులు ఆమెకి లభించాలని ప్రార్థన చేస్తానని చెప్పాడు. తన దగ్గర ఉన్న డబ్బులు ఆమెకు ఇచ్చేశాడు. ‘‘మీ పేరు? ఆమె అడిగింది. ‘‘కరోల్ ఓటైలా’’ జవాబు చెప్పాడు.
 
1994లో ఇజ్రాయెల్‌లోని ఐఫా అనే ఊరిలో నివసిస్తున్న ఎడిట్ ఓ రోజు దిన పత్రిక చదువుతూంటే ‘కరోల్ ఓటైలా’ అనే పేరు కనిపించింది. ఆమె జీవితంలో మరిచిపోలేని పేరు అది. తనని కాపాడినది వారే అయితే అతన్ని ఓసారి కలుసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉందని ఓ ఉత్తరం రాసి పోస్టు చేసింది. అయితే ఉత్తరానికి కొద్ది జాప్యం తర్వాత జవాబు వచ్చింది. అది అందుకున్నాక ఎడిట్ 1995లో ఇజ్రాయిల్ నించి యూరప్‌కు వెళ్లినప్పుడు రోమ్‌లోని వాటికన్ సిటీ వెళ్లి పోప్ జాన్‌పాల్-2ని కలుసుకుంది.

త్యాగానికి ప్రతీక అయిన ఆ యువకుడే అత్యున్నత క్రిస్టియన్ మతాధికారి ‘పోప్’  అయ్యాడు. ఆ ఖైదీకి అతను సహాయం చేయడం నాజీ సైనికులు చూసి ఉంటే, అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేవారు. అలాగే ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నుంచి మత ప్రచారానికి ఓ ఫాదర్‌ని 1932లో పంజాబ్‌కి పంపించారు. అతని పేరు జాన్ లియోపోర్న్. జాన్ ఉత్తర పంజాబ్‌లోని ఓ గ్రామంలో తను నమ్మిన సిద్ధాంతాలని ప్రచారం చేయసాగాడు.

ఓ రోజు కొందరు గ్రామ పెద్దలు జాన్‌ని రచ్చబండ దగ్గరకి పిలిపించారు. అతనితో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. రచ్చబండ చుట్టూ మనుషులు అతనికి అడ్డుగా నిలబడి అక్కడినించి కదలనివ్వలేదు. గంట... పది గంటలు... రోజు... మూడు రోజులు అలా గడిచాయి. అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చారు తప్ప ఎవరూ భోజనం పెట్టలేదు. ఐదో రోజు అతను నీరసంతో వాలిపోయాడు. ఆరో రోజు గ్రామపెద్ద అతని తలని తన ఒళ్లో ఉంచుకుని, నిమ్మరసం తాగించి తర్వాత భోజనం పెట్టి చెప్పాడు.
 
‘‘మేమంతా మిమ్మల్ని ఇన్ని రోజులు పరీక్షించాం. ఆహారం ఇవ్వకుండా, కదలనివ్వకుండా చేసినందుకు మీరు మమ్మల్ని తిడతారని, ద్వేషిస్తారని ఎదురుచూశాం. అదే జరిగితే మిమ్మల్ని గ్రామం నించి బహిష్కరించాలనుకున్నాం. మీరు ఇన్ని రోజులు బోధించిన ‘క్షమ’ మీలో నిజంగా ఉందో లేదో ఇలా పరీక్షించినందుకు క్షమించండి. ఇప్పుడు మీ మతం గురించి, జీసస్ గురించి చెప్పండి.’’

ఒకటా? రెండా? ఇలాంటి ఎన్నో ఉదంతాలు చదివిన నాకు క్రిస్టియానిటీకి దగ్గరయ్యే కొన్ని అదృష్టాలు కలిగాయి. నా ప్రమేయం లేకుండానే క్రిస్టియన్స్‌కి, పవిత్రమైన కొన్ని ప్రదేశాలని నా విదేశీ పర్యటనల్లో సందర్శించడం జరిగింది.
 టర్కీలోని కుశదాసి ద్వీపానికి ఆగస్ట్ 2010లో వెళ్లాను. క్రీస్తును శిలువ వేశాక, ఆయన ప్రధాన శిష్యులలో ఒకరైన సెయింట్ జాన్ జెరూసలేం నించి ఈ కుశదాసి ద్వీపానికి వచ్చారు.

స్థానికుల కథనం ప్రకారం, రోమన్స్ తనని హింసించడం మొదలయ్యాక, జీసస్ తన శిష్యుడు సెయింట్ జాన్‌ని తన తల్లి మేరీ మాతని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లమని కోరారు. ఈ ద్వీపంలోని ఓ ఇంట్లో మేరీమాత తన ఆఖరి సంవత్సరాలు, తుదిశ్వాస వదిలేదాక గడిపింది. ఈ విషయం కుడా ప్రపంచానికి దైవికంగా తెలియడం విశేషం.
 
1774-1824 మధ్య జర్మనీలో జీవించిన క్రిస్టియన్ నన్ క్యాథరీనా ఎమెరిష్‌కి వర్జిన్ మేరీ చివరి దశలో జీవించిన కుశదాసి ద్వీపంలోని ఈ ఇంటి తాలూకు దర్శనాలు కలిగాయి. ఈ ఇల్లు సముద్రానికి ఎంత దూరంలో ఉన్నది, అక్కడ ఉన్న వృక్షజాతి, ఎన్నడూ జర్మనీ దేశాన్ని వదలని క్యాథరీనాకి కలలో కనిపించాయి. ఆమె అవన్నీ ఒక పుస్తకంలో రాసింది. కుశదాసికి 395 కిలోమీటర్ల దూరంలోని స్మిర్ణా (ఇజ్మిత్) అనే ఊరికి చెందిన లాజరస్ ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది. 1891లో అతను ఇక్కడికి వచ్చి, ఆ పుస్తకంలోని గుర్తుల ప్రకారం ఆ ఇంటి కోసం అన్వేషించాడు. ఈ ద్వీపంలోని ఓ మోనాస్ట్రీకి చెందిన శిథిలమైన చర్చ్‌ని కనుగొన్నాడు.

ఆ చర్చ్ మేరీ మాత తన చివరి దశలో నివసించిన ఇల్లుగా గుర్తించాడు. దీని పునాదులు క్రీస్తుశకం ఒకటో శతాబ్దానికి చెందినవని శాస్త్రజ్ఞులు నిర్ధారించాక, ఆ పునాదుల మీదే మళ్లీ ఇంటిని నిర్మించారు. వేల మంది పర్యాటకులు ఈ ఇంటిని సందర్శిస్తున్నారు.
 
మా బస్సులో ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, సెర్బియా, ఇంగ్లండ్, టర్కీ, గ్రీస్ మొదలైన దేశాలకి చెందినవారు కూడా ఉన్నారు. క్యూలో ఈ ఇంట్లోకి వెళ్తే, లోపల మేరీమాత విగ్రహం ఉంది. ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్‌ని ఫీలయ్యే గుణం నాలో నాకు తెలీకుండానే ఏర్పడింది. కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో, మరికొన్ని ప్రధాన ఆలయాల్లో నేను ఫీలైన వైబ్రేషన్స్‌ని ఇక్కడ స్పష్టంగా ఫీలయ్యాను. అలాంటి చోట్ల నాకు తెలియకుండానే కన్నీళ్లూ, ఆనందంతో కూడిన దుఃఖం కలుగుతాయి.

ఈ ఇంట్లో కూడా నాకు ఆ అనుభవం కలిగింది.
 క్రిస్టియన్స్‌లోని ఓ తెగవారు జీసస్‌ని కాక, మేరీమాతని కొలుస్తారు. ఓ ఆస్ట్రేలియన్ ఆలయం బయట నాతో చెప్పాడు. ‘‘మేరీ ఈజ్ ద ల్యాడర్ ఆఫ్ హెవెన్’’ (స్వర్గానికి మేరీ మాత నిచ్చెన). ఫర్ మదర్ మేరీ హాజ్ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్ ఇన్ టు దిస్ వరల్డ్ (ఎందుకంటే మేరీ మాత స్వర్గం నుంచి ఈ ప్రపంచంలోకి దిగి వచ్చింది) దట్స్‌వై హర్ మెన్ మైట్ ఎసెండ్ ఫ్రమ్ ద ఎర్త్ టు హెవెన్ (మేరీ మాత ద్వారా మనుషులు భూమి నుంచి స్వర్గానికి వెళ్లగలరు).
 
ఆగస్ట్ 2011లో పోలెండ్‌లోని క్రాకోని సందర్శించాను. మా గైడ్ అక్కడి ఓ చర్చిని చూపింది. పోప్ జాన్ పాల్-2 క్రిస్టియన్ ఫాదర్ అయిన కొత్తల్లో ఆ చర్చ్‌లోనే పనిచేసేవాడని చెప్పింది. ఆ సమయంలో ఆయన కరీల్ ఓ టైలా (మొదట్లో చెప్పిన ఉదంతంలోని వ్యక్తి) మాత్రమే.
 
పోప్ జాన్‌పాల్-2 నివసించిన ఇంటిని కూడా (హాస్టల్ లాంటిది) చూశాను. బేలూరులోని రామకృష్ణ పరమహంస నివసించిన గదిని చూసిన సంతోషం లాంటిది ఈ ఇంటిని చూస్తే కలిగింది. అలాగే క్రాకో నగరానికి దక్షిణాన గల ఓటైలా పుట్టిన వడోవైజ్ అనే ఊళ్లోని ఆయన ఇంటిని కూడా మా గైడ్ స్మార్తా చూపించింది. ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఆయన తిరిగిన నేలని బస్‌లోంచి చెప్పులు లేకుండా దిగి స్పర్శించాను. ఆది శంకరాచార్య పుట్టిన కాలడిని సందర్శిస్తే కలిగిన ఆనందం కలిగింది.

క్రాకోలో ఆయన చదివిన సెమినరీ (క్రిస్టియన్ మతాచార్యుల కాలేజ్)ని కూడా మా గైడ్ బస్సులోంచి చూపించింది. వడోవైజ్‌తో ఆయన్ని బాప్టైజ్ చేసిన చర్చిలో, ఆయన మరణానికి మునుపు వైద్యులు చిన్న సీసాల్లో తీసుకున్న రక్తాన్ని ఉంచారని గైడ్ చెప్పింది.
 
సెప్టెంబర్ 2014లోని సాలమాంకా నుంచి పోర్చుగల్‌లోని లిస్బన్‌కి బస్సులో వెళుతూ ఉన్నప్పుడు ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా (పోర్చుగీస్ భాషలో నోసా సెన్హోరాడి ఫాతిమా) క్షేత్రాన్ని చూశాను. 1916లో 9 ఏళ్ల లూషియ శాంటోస్, ఆ పాప కజిన్స్ జెసింటా మార్డో(6), ఫ్రాన్స్‌స్పో మార్డో(9)లకి బ్లెస్‌డ్ వర్జిన్ మేరీ దర్శనం లభించింది. గొర్రెలు కాచుకునే ఈ పిల్లలు ఫాతిమా అనే ఊరుకి సమీపంలోని అల్‌జేస్ ట్రీవ్ అనే గ్రామానికి చెందినవారు. గొర్రెలతో వెళితే మేరీమాత ఈ ముగ్గురికి దర్శనం ఇచ్చింది. ఆ పిల్లలకి చదువు రాదు. ఇంటికి వచ్చాక ఆ సంగతి పెద్దలకి చెబితే వాళ్లు కొట్టిపారేశారు.

ఆ తర్వాత అనేక సార్లు మేరీమాత దర్శనం వారికి లభించింది. ఓసారి నరకంలోని అగ్నిలో పాపపు ఆత్మలు కాలడం కూడా వారు చూశారు. ఇది చూసిన జెసింతా మనసులో గట్టి ముద్ర పడింది. పిల్లల వర్ణన ప్రకారం ఆమె చేతిలో రోజరీ (జపమాల) ఉండటంతో ఆమెకి ‘అవర్ లేడీ ఆఫ్ రోజరీ’ అనే పేరు, అవర్ లేడీ ఆఫ్ ద మోస్ట్ హోలీ రోజరీ అనే పేరు, ఫాతిమా గ్రామం దగ్గర జరగడంతో ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా’ అనే పేర్లు వచ్చాయి.

మేరీ పిల్లలకి చెప్పిన భవిష్యత్తులో రెండో ప్రపంచ యుద్ధం, మరికొన్ని దేశాల మధ్య యుద్ధాలు లాంటివి కూడా ఉన్నాయి. ఆమె దైవాన్ని ఎలా ప్రార్థించాలి, ఆరాధించాలి, త్యాగాలు ఎలా చేయాలి మొదలైనవి పిల్లలకి చెప్పింది. 13మే 1917న జెసింటా సూర్యుడుకన్నా కాంతివంతమైన మేరీమాత నుంచి అత్యంత శక్తివంతమైన కాంతికిరణాలు వెలువడుతుండగా చూసింది. ఆ విషయం తల్లికి చెబితే ఇరుగు, పొరుగు దాన్ని జోక్‌గా కొట్టేశారు.

తరువాత 13, జూన్‌లో, 13 జూలైలో కూడా పిల్లలకి మేరీమాత దర్శనం ఇచ్చి మూడు రహస్యాలని చెప్పింది. వీటిని త్రీ సీక్రెట్స్ ఆఫ్ ఫాతిమాగా పిలుస్తారు. (ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే అంశాలే). 1941కల్లా వీటిలోని రెండు నిజంగా జరగడంతో 1943లో బిషప్ మూడో రహస్యం చెప్పమంటే నిరాకరించింది.
 అది రాసిన కాగితాన్ని కవర్‌లో ఉంచి, సీల్ చేసి 1960 దాకా తెరవకూడదని కోరింది. 2000లో పోప్ జాన్ పాల్ ॥దీన్ని చదివి అధికారికంగా ప్రకటించగా దాన్ని కాన్సెక్రీషన్ ఆఫ్ రష్యా అని పిలుస్తారు. తర్వాత పెద్దలు కూడా దీన్ని నమ్మి 13 ఆగస్టు 1917న మదర్ మేరీ దర్శనం అవుతుందని అక్కడికి వెళ్లారు. కానీ కాలేదు.
 
ఫ్రాన్సిస్కో 1919లో జెసింటో మార్చి 1920లో చిన్నతనంలోనే మరణించారు. లుసింటా 13 ఫిబ్రవరి 2005న 97వ ఏట మరణించింది. పిల్లలు ఇద్దరి సమాధుల్ని, అవర్ లేడీ ఫాతిమాకి కట్టిన చర్చిని సందర్శించాను. సమీపంలో ఉన్న ఫౌంటెన్‌లోని నీరు పవిత్రమైనదని చెప్తారు. ఇది తాగితే వ్యాధులు పోతాయట! ఓ సీసాలో ఈ నీటిని తెచ్చి హెబ్సిబారాణి అనే క్రిస్టియన్ ఫ్రెండ్‌కి ఇచ్చాను. కాళ్లు పడిపోయిన వాళ్లు చర్చికి ముందే మోకాళ్ల మీద లోపలికి నడిచి వెళ్తే కాళ్లు బాగవుతాయని స్థానికులు చెప్పారు.

ఇక్కడ అనేక మంది మానసిక రోగులు కూడా కనిపించారు. వారికి కూడా స్వస్థత చేకూరుతుందట! 13 మే 1946న పోప్ పయాస్-2 ఇక్కడికి అవర్ లేడీ ఫాతిమా విగ్రహానికి కిరీటాన్ని అమర్చారు. ఎందుకో మేరీ మాత మరణించిందని చెప్పిన కుశదాసిలోని వైబ్రేషన్ నాకు ఈ చర్చిలో కలగలేదు.
 నేను చూసిన మరో క్రిస్టియన్ విశేషం - అక్టోబర్ 2015లో జర్మన్‌లోని లేడీ ముసా అరబిక్ భాషలో దీని ఆర్థం ‘వ్యాలీ ఆఫ్ మోజెస్ ’. జుడాయిజమ్‌లో, ఇస్లామ్‌లో, క్రిస్టియానిటీలో, బహాయిజమ్‌లో మోజెస్ ముఖ్యమైన ప్రవక్త. జర్మన్ రాజధాని అమ్మన్ నుంచి ప్రాచీన నగరం పెట్రాకి వెళ్లే దారిలో లేడీ మూసా దగ్గర  240 కిలోమీటర్ల దూరంలో బస్ ఆగింది.

మోజెస్ ప్రవక్త ఈ ఎడారి నుంచి వెళ్తూ దానిని అనుసరించేవారి దాహాన్ని తీర్చడానికి ఓ రాతిని కొడితే అది పగిలి నీరు వెలువడిందని బైబిల్ కథనం. ఆ రోజుల్లో పెట్రాని పాలించిన నబాటియన్స్ ఈ నీటి బుగ్గకి అనేక చిన్న కాలువలను తవ్వి పెట్రా నగరానికి దీన్ని తరలించారు. దీనికి గార్డియన్ ఆఫ్ పెట్రా, మోజెస్ వెల్, మోజెస్ వాటర్ స్ప్రింగ్, టోంచ్ ఆరన్ అని పేర్లు. మోజెస్ సోదరులైన అహరోను సమాధి ఈ ప్రాంతంలోనే ఉందని నమ్మకం. ఎక్కడుందో ఎవరికీ తెలియదు.

మోజెస్ వెంట ఉండే వారు ఈ ఎడారిలో తప్పిపోయామని పరమాత్మ నిజంగా ఉంటే తమకు నీరు ఇవ్వాలని కోరితే మోజెస్ దైవాన్ని ప్రార్థించి ఈ నీటి బుగ్గని సృష్టించాడని గైడ్ చెప్పింది. బైబిల్‌లో పేర్కొన్న ఈ ప్రదేశాన్ని 1931లో కనుగొన్నారు. పోప్ జాన్ పాల్-2 కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారు. మోజెస్ సమాధి కూడా ఇక్కడే ఎక్కడో కొండమీద ఉందట. కానీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఆయన జ్ఞాపకార్థం మౌంట్ నెబూ మీద ఉంచిన ఆ విగ్రహాన్ని కూడా దర్శించాను.

సమీపంలోని మదాబా అనే గ్రామంలోని పురాతన చర్చిలో ఓ పురాతన మొజాయిక్ మ్యాప్ ఉంది. ఆ రోజుల్లో జెరూసలేం భూమికి మధ్యలో ఉందని నమ్మేవారు. క్రీ.శ. 542కి చెందిన ఈ మ్యాప్‌లో మెడిటేరియన్ సీ, ఈస్ట్రన్ డిజర్‌‌ట్స, డెడ్‌సీ జెరికో, బెత్లెహేమ్, జోర్డన్, లెబనాన్ లాంటి క్రిస్టియన్ పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. మోజెస్ స్ప్రింగ్ నుంచి కూడా నీటిని పట్టి తెచ్చి కొందరు క్రిస్టియన్ మిత్రులకి ఇచ్చాను.
 
అవకాశం ఉంటే జెరూసలేం, బెత్లెహేమ్ దర్శించాలని, క్రీస్తు శిలువతో నడిచిన దారిలోని మట్టిని స్పృశించాలని నా ఆశ. అలాగే మెక్సికో సిటీ ప్రాంతం లోని టెపియాక్ కూడా చూడాలని ఉంది. అక్కడకు కూడా మేరీమాత గొర్రెలు కాచుకునే ఓ కుర్రాడికి దర్శనాన్ని ఇచ్చింది! 9 డిసెంబర్ 1531న గొర్రెలు కాచుకునే జువాన్ డియాగో అనే పదిహేనేళ్ల కుర్రాడికి చుట్టూ కాంతితో ఉన్న పదహారేళ్ల యువతి దర్శనమిచ్చి, చర్చిని కట్టమని స్థానిక భాషలో కోరింది.

అతను బిషప్‌కి ఈ విషయం చెపితే రుజువు కోరాడు. సాధారణ ప్రజలు ఉపయోగించే బట్ట (తిల్మా) మీద వర్జిన్ మేరీ ముఖం ప్రత్యక్షమైంది! నేటికీ ఆ బట్ట మీద మేరీ మాత బొమ్మని చూడొచ్చు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆ బట్ట ఈ పాటికి నశించిపోవాలి. అయినా అది చెక్కు చెదరకుండా ఉండడం అద్భుతం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
 
ప్రతి మతంలోనూ నేనున్నానని పరమాత్మ ఇలా గుర్తు చేస్తూనే ఉంటాడు. మనం చేయాల్సింది ఆయన బోధనలను పాటిస్తూ ఆయన్ని మరచిపోకపోవడం.
 
ఓ రోజు లండన్‌లోని అతి పెద్ద చర్చి సెయింట్ పాల్ క్యాథడ్రిల్‌లో ఓ పేదరాలు నేలమీద మోకాళ్ల మీద కూర్చొని దైవ ప్రార్థన చేస్తూ, పక్కన ఎవరో కూర్చోవడం గమనించింది. చూస్తే ఆవిడ బ్రిటిష్ రాణి విక్టోరియా! దాంతో వెంటనే ఆ పేదరాలు లేచి మరో చోటికి వెళ్లి కూర్చుని ప్రార్థించ సాగింది. విక్టోరియా మహారాణి కూడా లేచి ఆ పేదరాలి పక్కన, దైవ ప్రార్థనకి మోకాళ్ల మీద కూర్చొని ఆమె చెవిలో చెప్పింది.
 ‘‘నేను సింహాసనం మీద ఉన్నప్పుడే రాణిని. దేవుని సన్నిధిలో మనమంతా సమానమే. లేచి వెళ్లకు.’’
 ప్రతి మతం వారు గుర్తుంచుకోదగ్గ, ఆచరించదగ్గ గొప్ప విషయాన్ని ఆ మహారాణి అంత అందంగా చెప్పింది.
- మల్లాది వెంకటకృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement