మతం మనోవైశాల్యాన్ని కోరుతుంది!
మనుషులకు హితమైనదే మతం. బహుశా ఏ మతం చెప్పినా ఇదే చెబుతుంది. ‘మన విషయంలో జరగకూడదని మనం కోరుకునేది మనం ఇతరులకు చేయకూడదని బైబిల్ చెబుతుంది. ‘తనకు అప్రియమైనది పరులకు చేయకూడద’ని మహాభారతం చెబుతుంది. సంక్రాంతి పండగ వచ్చే ముందుగా వాకిళ్లలో ముగ్గులు పెడతాం. అలాగే క్రిస్మస్ వచ్చే ముందుగా నక్షత్రాన్ని గుమ్మం ముందు అలంకరిస్తారు. గడప దగ్గర పెట్టే ముగ్గు వాకిట్లోనే పైన కనిపిస్తుంటుంది.
సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ‘నా సోదరీ సోదరులారా’ అని సంబోధించారట. ఇక నొప్పి, బాధ నుంచి విముక్తం చేసే ఉదాత్తమైన నర్స్ బాధ్యతలు నిర్వహించేవాళ్లను మనం సిస్టర్స్ అంటాం. కట్లు కట్టి గాయాలను నయం చేసే పురుషులను బ్రదర్స్ అంటాం. మరి ఇక మతాల బోధనల్లో తేడా ఎక్కడుంది? మనం సంకుచితంగా వ్యాఖ్యానించినప్పుడే మతం పరిధి కుంచించుకుపోతుంది. కానీ వాస్తవానికి మతం అనేది విశాలత్వాన్ని, మనోవైశాల్యాన్ని కోరుతుంది.
అందుకే నా ఉద్దేశంలో మానవాళికి మేలు చేసేదే మతం. ఈ దృష్టితో చూస్తే క్రిస్మస్ కేవలం ఒక మతానికి చెందిన పర్వదినం కాదు. అది సర్వమానవాళికీ పండగ. మా చికిత్సా సేవారంగంలో ఉన్న మహిళలు ప్రధానంగా నిర్వహించుకునే పర్వదినం ఇది.
- డా॥మోహనవంశీ
సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్