సమరం సంబరమైన వేళ...
‘దేవతల గానం వినడానికైనా ఆ రాత్రి తుపాకులు మౌనం వహిస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ డిసెంబర్ 7, 1914న నాటి పోప్ పదిహేనో బెనడిక్ట్ ఒక సందేశం పంపారు. ఇంతకీ ఆ రాత్రి ఏదీ అంటే, క్రిస్మస్ రాత్రి. యుద్ధం పేరుతో ఈ పుడమి గతంలో ఎన్నడూ లేనంతగా నెత్తుటిలో తడిసి ముద్దవుతున్న కాలంలో పోప్ ఈ సందేశం పంపారు. అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమై ఐదు మాసాలు గడిచిపోయింది. రోజూ వేల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇంగ్లండ్, బ్రిటిష్ వలస రాజ్యాలు, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, సెర్బియా ఒకవైపు మిత్రపక్షాల పేరుతోనూ; జర్మనీ, ఆస్ట్రియా, జపాన్, టర్కీ వంటి దేశాలు అగ్రరాజ్యాల కూటమి పేరుతోనూ ఘోర యుద్ధం చేశాయి.
ఈ యుద్ధం ఆ సంవ త్సరం క్రిస్మస్ నాటికి పూర్తయిపోతుందని అంతా ఆశించారు. కానీ ‘ఈ భూగోళం మీద మనిషి మిగులుతాడా?’ అన్నంత బీభత్సంగా మారి, ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. చివరికి 15 లక్షల ప్రాణా లను బలి తీసుకుని ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. మధ్యయుగాలకు మించిన అంధత్వంతో సాగిన ఈ సమరానికి కొద్దిగా అయినా విరామం కల్పించాలని పోప్ ప్రయత్నించడం ఒక అద్భుతం.
కానీ పోప్ పిలుపునకు బ్రిటిష్ యుద్ధమంత్రి లార్డ్ కిష్నర్, ఆ దేశ సర్వసైన్యాధ్యక్షుడు సర్ జాన్ ఫ్రెంచ్, ఇంగ్లండ్ రాజు ఐదో జార్జి, జర్మనీ నియంత విల్‌హెల్మ్, ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్, రష్యా చక్రవర్తి రెండో నికోలస్-ఎవరూ స్పందించలేదు. కానీ, ఒకరినొకరు ఘోరంగా చంపుకుంటున్న రెండు శిబిరాల సైనికులూ కలసిపోయి యుద్ధభూమిలో క్రిస్మస్ పండుగ జరుపు కున్నారు. ‘అక్కడ ఆ రాత్రి జరిగినదాన్ని తెర మీద చూస్తే అదో అభూత కల్పన అని నేను కూడా అనుకునేవాడిని’ అంటాడు కెప్టెన్ ఎడ్వర్డ్ హూల్సే (ఇంగ్లండ్ సెకెండ్ స్కాట్స్‌కు చెందిన సైనికాధికారి). హూల్సే ఆ గాథకు ప్రత్యక్ష సాక్షి. నిజంగా అదొక కథలా, స్వప్నంలా అనిపిస్తుంది.
మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభ మైన తరువాత జరిగిన తొలి క్రిస్మస్ పండుగలో దాదాపు లక్షమంది సైనికులు పాల్గొన్నారని అంచనా(తరువాత వైరి శిబిరాల మధ్య ఇలాంటి ‘అవాంఛనీయ సంఘటనలు’ చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు). బెల్జియం, ఫ్రాన్స్ దేశాల సరిహద్దులలో ఫ్లాండర్స్ అనే చోట, ఫ్రీలింఘీన్ అండ్ హూప్‌లైన్స్ సెక్టర్‌లో శత్రుదేశాల సైనికుల మధ్య జరిగిన వేడుక చరిత్రలో ఎంతో ఖ్యాతి గాంచింది.
ఏది ఏమైనా ఫ్రాన్స్‌ను స్వాధీనం చేసుకోవా లన్న నిర్ణయంతో జర్మనీ సేనలు ఆ దేశ సరి హద్దులకు నలభై మైళ్ల దూరంలోనే కాపు వేసి ఉండిపోయాయి. దానితో ట్రెంచ్‌లు (కందకాలు) అవసరమైనాయి. ఫ్రాన్స్ వైపు మిత్రరాజ్యాల సేనల కందకాలు, బెల్జియం సరిహద్దులలో అక్షరాజ్యాల సేనలు మాటు వేసి ఉన్నాయి. నిత్యం వేకువనే మొదలయ్యేది కవ్వింపు చర్య. ఏదో ఒకవైపు నుంచి కాల్పులు మొద లయ్యేవి. కొన్నిగంటల సేపు సాగి, ఆగేవి. స్నైపర్ గన్నులు, గ్రెనేడ్లు, ట్యాంకులు పేలుళ్లతో ఆ ప్రాంతం పొగతో నిండేది.
డిసెంబర్ 23 రాత్రి జర్మన్ సేనలు మాటు వేసి ఉన్న కందకం గోడ (పేరాపెట్ వాల్) మీద ఏవో చిన్న చిన్న దిమ్మలు కనిపించాయి. అవేవో కొత్తరకం మందుగుండు అనుకున్నారు ఇంగ్లిష్ సైన్యం. త్రికోణాకారంలో, అడుగు ఎత్తు ఉన్న ఆ దిమ్మల మీద వెలుగులు నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. నిజానికి అవి క్రిస్మస్ చెట్లు. ఆ వెలుగులు చిన్న చిన్న కొవ్వొత్తులు. కానీ అప్పటికి క్రిస్మస్ చెట్టు సంప్రదాయం ఇంగ్లండ్ సామాన్య జనానికి చేరువ కాకపోవడంతో ఆ దేశ సైన్యంలో అలాంటి అపోహ తలెత్తింది.
అయితే రెండు శిబిరాల సైన్యం మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలన్న కోరిక బలంగా ఉంది. అప్పుడే బ్రిటిష్ యువ రాణి నుంచి, కుటుంబాల నుంచి క్రిస్మస్ కానుకలు వెల్లువెత్తడం మొదలైంది. సైనికాధికారుల మాట ఎలా ఉన్నా సరిగ్గా మూడు రోజుల ముందు జర్మనీకి చెందిన లెఫ్టినెంట్ జోహెన్నెస్ నిమానీ హూల్సే వంటి కింది స్థాయి అధికారులతో రహస్య చర్చలు మొదలుపెట్టాడు. అంటే జర్మనీ వైపు నుంచి ఈ ప్రయత్నం ఆరంభమైంది.
క్రిస్మస్ రోజున తాము పై అధికారుల కోసం తుపాకులు పేల్చడం కంటే, ప్రభువును భక్తితో ప్రార్థించడానికే ప్రాధాన్యం ఇస్తామని వారు కరాఖండీగా చెప్పేశారు. అంతా కొంత మెత్తబడ్డారు. కానీ ఇలాంటిదేదో జరుగుతుందన్న అనుమానం మిలటరీ పెద్దలలో రానే వచ్చింది. శత్రుపక్షంతో చేతులు కలపడం వంటి పని చేయవద్దని, అదే జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు కూడా వచ్చేశాయి.
పోప్ క్రిస్మస్ రాత్రి తుపాకులు పేల కుండా ఉంటే చాలునని కోరుకున్నారు. కానీ, 24 వేకువ నుంచే మందుగుండు మూగబోయింది. అయినా ఎవరి అను మానాలు వారివి. 25వ తేదీ వేకువన, గడగడలాడించే చలిలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచులో ‘నో మ్యాన్స్‌ల్యాండ్’కు అవతల జర్మన్ భాషలో ‘సిల్లేనాట్.. హి వజ్ నాట్...’ అంటూ కీర్తన లీలగా వినిపించింది. ఆ పాట విన్న కందకాలలోని ఇంగ్లిష్ సైనికులకు తమ దేశంలో పాడుకునే ఒక గీతం బాణీ గుర్తుకు వచ్చింది - ‘సెలైంట్ నైట్...’ అన్న గీతమే అది. క్రిస్మస్ రోజు వేకువన పాడే పాట.
శాంటాక్లాజ్ వేషధారి అయిన ఒక జర్మన్ సైనికుడు ఇంగ్లిష్ వాళ్ల కందకం దగ్గరకు వచ్చి, ముళ్ల కంచె వెనక నుంచి గట్టిగా ‘మెర్రీ క్రిస్మస్’ అని అరిచాడు. ఒక్కొక్కరే లేచి, నోమ్యాన్స్ ల్యాండ్ లోకి వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
మనిషిలో చచ్చిపోయిందనుకున్న మానవత్వం క్రిస్మస్ పేరుతో అయినా అందరికీ గుర్తుకు వచ్చినందుకు మురిసి పోయారు. బద్ధశత్రువులు ఆలింగనం చేసుకున్నారు. పెద్ద మంట వేసి దాని చుట్టూ తిరుగుతూ సైనిక వాద్యాలు మోగించారు. నాటి ప్రఖ్యాత ప్యారిస్ ఒపేరా గాయకుడు విక్టర్ గ్రానరీ ఒడలు మరచి పాడాడు. అంతా కలసి చుట్టూ ఉన్న రెండు పక్షాల సేనల శవాలనూ సేకరించి తెచ్చి ఉమ్మడిగా అంత్యక్రియలు చేశారు. శిరస్త్రాణాలు, పొగాకు, కత్తులు, కోటు గుండీలు వంటివి కానుకలుగా ఇచ్చి పుచ్చుకున్నారు.
తరువాత రెండు పక్షాల నుంచి ఎంపిక చేసిన క్రీడాకారులతో ఆ యుద్ధభూమిలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ చరిత్రలోనే ఓ అద్భుతం. చిత్రంగా ఇందులో ఇంగ్లండ్ నెగ్గింది. ఆ కొద్ది గంటలలో జరిగిన వింతలూ విశేషాలూ ఎన్నో! నిజానికి యుద్ధంలో ఉన్న సైనికుడు నిబంధనను అతిక్రమిస్తే దారుణమైన శిక్షను ఎదుర్కోవాలి. శత్రువుతో చేయి కలిపితే కాల్చి చంపేవారు. అయినా తెగించి ఇరు పక్షాల సైనికులూ ఈ సాహసానికి ఒడిగట్టారు. అందుకే ఇదొక చారిత్రక అద్భుతం.
- డా॥గోపరాజు నారాయణరావు