ప్రసారం సమాప్తం | Radio stations stop playing 'Baby, It's Cold Outside' | Sakshi
Sakshi News home page

ప్రసారం సమాప్తం

Published Mon, Dec 10 2018 1:35 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Radio stations stop playing 'Baby, It's Cold Outside' - Sakshi

టెక్నికలర్‌ ‘నెప్ట్యూన్స్‌ డాటర్‌’ (1949) చిత్రంలోని ‘బేబీ, ఇట్స్‌ కోల్డ్‌ అవుట్‌సైడ్‌’ సాంగ్‌లో.. ఎస్తర్‌ విలియమ్స్, రికార్డో మాంటల్‌బేన్‌;

ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? అది సాహిత్యం అయినా, సన్నివేశం అయినా.. ఇట్సే ‘రేపీ’. మీటూ ఉద్యమం పుణ్యమా అని కొత్తగా కలిగిన ఈ స్పృహతో యు.ఎస్‌. రేడియో స్టేషన్‌లు.. డెబ్బై నాలుగేళ్లుగా క్రిస్మస్‌ సీజన్‌లో తాము ప్రసారం చేస్తున్న ‘బేబీ, ఇట్స్‌ కోల్డ్‌ అవుట్‌సైడ్‌’ అనే ఆస్కార్‌ అవార్డు సాంగ్‌ను తమ ప్లే లిస్ట్‌లోంచి ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తున్నాయి.

కొన్ని పాటలు, కొన్ని పువ్వులు సీజన్‌ వచ్చేసిందని ముందే చెప్పేస్తాయి. యు.ఎస్‌. రేడియో స్టేషన్‌ల నుంచి ‘బేబీ, ఇట్స్‌ కోల్డ్‌ అవుట్‌సైడ్‌’ అనే హాలీడే సాంగ్‌ వినిపించిందంటే క్రిస్మస్‌ సీజన్‌ మొదలైనట్లే. అయితే ఈ ఏడాది క్రిస్మస్‌ సీజన్‌ మొదలైనా.. ఆ పాట ఏ రేడియో స్టేషన్‌ నుంచీ వినిపించడం లేదు! యు.ఎస్‌.ను చూసి కెనడా కూడా స్టాప్‌ చేసింది. ఇంకా మరికొన్ని దేశాల్లోని రేడియో స్టేషన్‌లు 1944 నాటి ఆ క్లాసిక్‌ డ్యూయట్‌ను ఈ ‘మీటూ’ టైమ్‌లో ప్లే చెయ్యకపోవడమే క్షేమకరమన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి.

బ్రాడ్‌వే (రంగస్థలి) ఆస్థాన గీత రచయిత ఫ్రాంక్‌ లోస్సర్‌ రాసిన ‘బేబీ, ఇట్స్‌ కోల్డ్‌ అవుట్‌సైడ్‌’ ను 1949 హాలీవుడ్‌ మూవీ ‘నెప్ట్యూన్స్‌ డాటర్‌’లోకి తీసుకున్నారు. సినిమాలో ఎస్తర్‌ విలియమ్స్, రికార్డో మాంటల్‌బేన్‌ మధ్య పాటను చిత్రీకరించారు. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’గా ఆస్కార్‌ అవార్డు’ కూడా పొందిన ఆ పాటకు ఇన్నేళ్లలో అనేక వెర్షన్‌లు వచ్చాయి. మొన్న మొన్న  ఆమెరికన్‌ గాయని లేడీ గాగా.. రివర్స్‌ వెర్షన్‌లో ఆ పాటను తీసుకున్నారు. అసలుపాటలో అతడు ఆమెను వెళ్లకుండా ఆపుతుంటే.. గాగా వీడియోలో ‘బేబీ, ఇట్స్‌ కోల్డ్‌ అవుట్‌సైడ్‌’ (బేబీ, బయట చలిగా ఉంది) అంటూ ఆమె అతడిని వెళ్లకుండా ఆపుతుంటుంది.
ఒరిజినల్‌ పాటను రాసినవారు కానీ, పాటకు యాక్ట్‌ చేసివారు గానీ ఇప్పుడు లేరు. పాటొక్కటే బతికి ఉంది. ఇప్పుడా పాట కూడా ‘మీటూ’ పెనుగాలులకు  రెపరెపలాడుతోంది.

‘మీటూ’కు, ఈ పాటను ఆపేయడానికి సంబంధం ఏంటి? ఏంటంటే.. పాటపై ఎప్పటి నుంచో బలహీనమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మీటూ ఉద్యమం చురుగ్గా ఉన్న ఈ టైమ్‌లో అవి బలమైన అభ్యంతరాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉండొచ్చని స్టేషన్‌ డైరెక్టర్‌ల అనుమానం. పాటలోని సాహిత్యం, పాట సన్నివేశం.. ‘స్త్రీపై అత్యాచారం జరుపుతున్నట్లుగా’ ఉన్నాయన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. ‘సాంగ్‌ కాదు.. ఇట్సే రేపీ’ అని అప్పట్లోనే ముఖం చిట్లించిన వారున్నారు.

పాట ‘కాల్‌ అండ్‌ రెస్పాన్స్‌’ స్టెయిల్‌లో సాగుతుంది. ఒకరు పాడుతుండగనే, దానికి లింక్‌గా రెండో వారు అందుకోవడం! ఎలాగంటే.. ‘లాయర్‌ సుహాసిని’ సినిమాలో సుహాసినికి, భానుచందర్‌కి మధ్య ఒక డ్యూయెట్‌ ఉంటుంది. ‘దివిని తిరుగు మెరుపు లలన’ అంటాడు అతడు. వెంటనే ‘సామజ వరగమనా’ అంటుంది ఆమె. ‘కరుణ కరిగి భువికి దిగిన’ అంటాడు అతడు. ‘సామజ వరగమనా..’ అంటుంది మళ్లీ ఆమె. పాటంతా అంతే.. ఆమె సామజ వరగమనా అనే మాటొక్కటే అంటుంటుంది. ఇలాంటిదే ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో శ్రీకాంత్, సంగీతల మధ్య డ్యూయెట్‌. ‘దొండపండు లాంటి పెదవే నీది’ అంటాడు శ్రీకాంత్‌. ‘అబద్ధం.. అంతా అబద్ధం’ అంటుంటుంది సంగీత. ‘కాల్‌ అండ్‌ రెస్పాన్స్‌’ ఫార్మాట్‌. ఇప్పుడీ క్రిస్మస్‌ సాంగ్‌లో.. ‘బేబీ, ఇట్స్‌ కోల్డ్‌ అవుట్‌సైడ్‌’ అని అంటుంటాడు అతడు, ‘నేను వెళ్తాను’ అని ఆమె ఎంత మొత్తుకుంటున్నా వదలకుండా.


‘ఐ రియల్లీ కాంట్‌ సే’ అని మొదలు పెడుతుంది ఆమె. వెంటనే అతడంటాడు ‘బేబీ ఇట్స్‌ కోల్డ్‌ ఔట్‌సైడ్‌’ అని. విషయం ఏంటంటే.. ఆ సాయంత్రం ఆమె అతడి గదిలో ఉంటుంది. ఇంటికి వెళ్లాలని లేస్తుంటుంది. అతడు లేవనివ్వడు! ఆమెతో ‘గడపాలని’ ఉంటుంది. అందుకే బయట చల్లగా ఉందనీ, ఆ టైమ్‌లో క్యాబ్‌లు దొరకవని, గడ్డకట్టుకుని పోతావనీ, న్యూమోనియా వచ్చి ఛస్తావనీ.. ఏదో ఒకటి చెప్పి అడ్డుకుంటుంటాడు. వెళ్లేందుకు ఆమె హ్యాట్‌ పెట్టుకుంటుంటే దాన్ని తీసేస్తూ ఉంటాడు. ‘వెళ్లనివ్వు ప్లీజ్‌..’ అని బతిమాలుకుంటుంటే.. కాలు, చెయ్యి అడ్డుపెడుతుంటాడు.

ఇదంతా పాటలా, మాటలా సాగుతుంటుంది కానీ.. సూక్ష్మంగా ఆలోచించేవారికి.. నిజమే, ‘రేపీ’లానే అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? ఇంకా.. అతడు ఆమెకు డ్రింక్‌ ఇస్తుంటాడు. ఆ డ్రింక్‌ గ్లాస్‌ అందుకుని ‘ఇందులో ఏం కలిపావు? అని అడుగుతుంది. మాట మార్చి ఏదో చెప్తాడు. ఇంకో చోట.. ‘నో.. నో.. నో..’ అంటుంది. వినకుండా.. ‘దగ్గరికి వస్తే ఏమైనా అనుకుంటావా’ అని ఒంటి మీద చెయ్యి వెయ్యబోతాడు. అతడు పట్టుకోబోవడం, అమె వదిలించుకోబోవడం.. ఇలా ఉంటుంది. ఇప్పటి అతిసున్నిత సమాజానికి సెక్సువల్‌ అసాల్టే అది. అందుకే యు.ఎస్‌. రేడియో స్టేషన్‌లు ‘ఇంతటితో ఈ పాట ప్రసారం సమాప్తం’ అంటున్నాయి.


రచయిత ఎంత మంచి ఉద్దేశంతోనైనా రాయొచ్చు. అందులో చెడు ఉద్దేశం ‘పాప్‌–అప్‌’  అయి (పైకి లేచి) కనిపిస్తే మాత్రం ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయిన వాళ్లని నిందించడానికి లేదు. పాటనైనా, పుస్తకాన్నైనా తీసుకెళ్లి పొయ్యిలో పడేయాల్సిందే. ఫ్రాంక్‌ లోస్సర్‌ మొదట ఈ పాటను తనను, తన భార్యను ఉద్దేశించి రాసుకున్నారు. స్టేజ్‌ షోలలో ఇద్దరూ కలిసి పాడేవారు.  ఆ పాటను ఎం.జి.ఎం. కొనుక్కుని సినిమాలో పెట్టుకుంది. పాటగా విన్నా, పాత్రలతో చూసినా ఆ యుగళగీతాన్ని  అప్పుడంతా ఇష్టపడ్డారు. వింటర్‌ థీమ్‌తో వచ్చింది కాబట్టి క్రమేణా అది ‘క్రిస్మస్‌ సాంగ్‌’ అయింది.
 

పాట రచయిత ఫ్రాంక్‌ లోస్సర్‌

మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement