రాగాల అతిథులూ... రారండీ! | ''New Life Assemblies of God'' Church | Sakshi
Sakshi News home page

రాగాల అతిథులూ... రారండీ!

Published Sat, Dec 19 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 2:15 PM

రాగాల అతిథులూ... రారండీ!

రాగాల అతిథులూ... రారండీ!

దేవుడు తనను తల్లిగా స్వీకరించనున్నాడనే సంతోషాన్ని సోదరితో పంచుకోవడానికి మేరీమాత ఒక పాటను ఎంచుకుందట. అయితే ముందే సోదరి సంగీతంతో మేరీమాతకు స్వాగతం పలికింది. ఇలా యేసు జన్మదిన సంబరాలకు, ఆట పాటల సందడికి ఉన్న అనుబంధం ఆ కథల్లో అడుగడుగునా ప్రస్ఫుటిస్తుంది. అందుకు తగ్గట్టే క్రిస్మస్ సమయంలో నివాసాలన్నీ సంగీత నిలయాలుగా మారతాయి. ప్రార్థనా మందిరాలన్నీ పాటల వేదికలవుతాయి. క్రీస్తు రాక గురించి సమాచారాన్ని దేవదూతల ద్వారా తెలుసుకున్న మూగ జీవాలు ఆనందంతో వీధుల్లో తిరుగుతూ అందరికీ ఈ విషయాన్ని రాగాలు తీస్తూ తెలియజేశాయట.

ఈ కథను ఆధారం చేసుకుని ఆవిర్భవించినవే క్యారల్స్ సంబరాలు. డిసెంబరు రెండో వారం గడిచినప్పటి నుంచి క్రిస్మస్ అయ్యేవరకూ ఇవి కొనసాగుతాయి.
 
రాగాల రాత్రి...
ప్రతి చర్చిలోనివారూ బృందాలుగా ఏర్పడతారు. రాత్రి అయ్యాక విశ్వాసుల ఇళ్లకు వెళతారు. పాటలు పాడుతూ క్రీస్తు ఘనతను కొనియాడతారు. క్రిస్మస్ శుభ వార్త చెప్పడం, పాటలు పాడడం, కుటుంబీకుల క్షేమం గురించి ప్రార్థించడం, బైబిల్ ఇచ్చి వెళ్లడం... క్యారల్స్ బృందం చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఇది కేవలం మతపరమైన చర్యగానే చూడటం లేదు కొందరు. ‘‘ఇది మతపరమైన వేడుకగా పరిమితం చేయం. మా చర్చ్ మెంబర్స్ కాని వారి ఇళ్లకూ వెళతాం.

ఒకింట్లో ఉన్న ప్పుడు పొరుగింటివాళ్లు అడిగితే వారిం టికి కూడా వెళతాం’’ అని ఒక క్యారల్ గ్రూప్ సభ్యురాలైన అమూల్య షెరాన్ చెప్పారు. ఒక్కో ఇంట్లో  15 నిమిషాలకు మించి గడపరు. రోజులో 10 నుంచి15 ఇళ్ల వరకూ చుట్టేస్తారు. అలా ఈ కార్యక్రమం తెల్లవారుఝామున 5 గంటల వరకూ కొనసాగుతుంది.
 
అందరూ బంధువులే...
అందర్నీ అను‘రాగ’ంతో పలకరించే  క్యారల్స్ సంప్రదాయం... పండుగ అంటే సంతోషాన్ని పంచుకోవడమేననే గొప్ప సందేశాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణ కారణంగా కొందరు స్వచ్ఛంద బృందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బృందాల్లో విద్యార్థులు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్... ఇలా విభిన్న రంగాలకు చెందినవారు సభ్యులుగా మారుతున్నారు.

సింగర్స్, గిటారిస్ట్‌లు, కీబోర్డ్ ప్లేయర్స్, కాంగో ప్లేయర్స్... ఇలా విభిన్న రకాల ఇన్‌స్ట్రుమెంట్స్‌ను పలికించ గల నేర్పు ఉన్నవారు తమ టాలెంట్‌ను చూపించడానికి కూడా ఇదో అద్భుతమైన అవకాశంగా మారుతోంది. కులమతాలకు అతీతంగా సంగీతాభిమానులను, నలుగురితో కలిసి వేడుకలను ఆస్వాదించే వారిని ఆకట్టుకుంటోంది. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో కేరల్స్ గ్రూప్‌లలో సభ్యులవుతున్నారు. కొన్నిసార్లు ఈ కేరల్ గ్రూప్ సభ్యుల సంఖ్య ఎక్కువై తిరగడానికి మినీ బస్సులు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది.
 
‘న్యూలైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్’ చర్చి తరపున కేర్‌సెల్ గ్రూప్స్ అని  వ్యవహరిస్తాం. ప్యారడైజ్ కేర్‌సెల్. అల్వాల్ కేర్‌సెల్... అలా ఇవి లొకేషన్ వైజ్ డివైడ్ అవుతాయి. మా గ్రూప్‌లో 20 మంది ఉన్నాం. నేను 2012 నుంచి క్యారల్ గ్రూప్‌తో వెళుతున్నా. చలిలో అలా వెళ్లడం, కొత్త వ్యక్తుల్ని కలవడం, సంప్రదాయ వినోదాలను పంచడం, అందరి బాగు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించడం... ఇవన్నీ గొప్ప ఫీలింగ్. కొంతమంది టీ, కాఫీ, బిస్కెట్స్ మాతో షేర్ చేసుకుంటారు’’ అంటూ చెప్పారు అమూల్య షెరాన్.
 - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement