క్రీస్తును చూసిన పరమహంస | Sri Ramakrishna Paramahamsa seen's Jesus Christ | Sakshi
Sakshi News home page

క్రీస్తును చూసిన పరమహంస

Published Sun, Dec 20 2015 1:01 AM | Last Updated on Fri, Nov 9 2018 6:23 PM

క్రీస్తును చూసిన పరమహంస - Sakshi

క్రీస్తును చూసిన పరమహంస

దేవుడొక్కడే! సత్యం ఒక్కటే! కానీ, అక్కడకు చేరుకోవడానికి అనేక మార్గాలు. ‘ప్రపంచంలో మతాలెన్నో మార్గాలన్ని!’ అని శ్రీరామకృష్ణ పరమహంస అన్నది అందుకే. ఆయన అన్ని రకాల మార్గాలలో ఆధ్యాత్మిక సాధన చేశారు. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, జైన, సిక్కు మత సంప్రదాయాలన్నిటి పట్ల విశ్వాసం చూపారు. ఆ క్రమంలో ఆయన జరిపిన క్రైస్తవ మత సాధన చాలా ప్రత్యేకమైనది. సంవత్సరం, సమయం, సందర్భంతో సహా శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు రికార్డు చేసి, రాసిన జీవితచరిత్రలో ఆ సంఘటన నమోదైంది. ఆ అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి పూర్వాపరాలలోకి వెళితే...
 
అప్పటికే, తంత్రశాస్త్రాలు నిర్దేశించిన 64 సాధనలు, వైష్ణవ సంప్రదాయంలోని శాంత - దాస్యాది పంచభావాల ఆధారంగా భక్తిసాధనలు, మహమ్మదీయ మత సాధన - ఇలా అన్నిటినీ శ్రీరామకృష్ణులు అనుష్ఠించారు. 1873 మే 25న సాక్షాత్తూ శారదాదేవినే అమ్మవారిగా భావిస్తూ జరిపిన షోడశీ పూజతో ఆయన సాధన వ్రతం పూర్తి అయింది. షోడశీ పూజ జరిగిన ఏడాది తరువాత 1874లో... శ్రీరామకృష్ణుల్లో మరో సాధనామార్గం ద్వారా దైవాన్ని దర్శించుకోవాలనే ఆకాంక్ష కలిగింది.

అప్పటికి, ఆయనకు శంభుచరణ్ మల్లిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపించేవాడు. అలా ఆయనకు ఏసుక్రీస్తు పావన జీవితం, క్రీస్తు స్థాపించిన మతం గురించి తెలిసింది. క్రైస్తవ సంప్రదాయ మార్గంలో సాధనలు చేయాలనే కోరిక ఆయన మనస్సులో మెదిలింది.
 
దక్షిణేశ్వరంలోని కాళికాలయానికి దక్షిణ దిక్కులో యదుమల్లిక్ ఉద్యానగృహం ఉంది. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు అక్కడ వ్యాహ్యాళికి వెళుతుండేవారు. యదుమల్లిక్‌కూ, అతని తల్లికీ శ్రీరామకృష్ణులంటే చాలా భక్తి. కాబట్టి, వాళ్ళు ఉద్యానగృహంలో లేని సమయంలో కూడా శ్రీరామకృష్ణులు అక్కడికి వెళితే, సిబ్బంది తలుపులు తెరిచి, అక్కడ కూర్చొని విశ్రమించమని కోరేవారు. ఆ గదిలో గోడలకు చక్కని చిత్రపటాలు ఉండేవి. తల్లి ఒడిలో ఉన్న బాలక్రీస్తు చిత్రపటం అందులో ఒకటి. ఒకరోజు శ్రీరామకృష్ణులు ఆ గదిలో కూర్చొని, ఆ పటాన్నే తదేక దృష్టితో చూడసాగారు.

ఏసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చిత్రం సజీవమై, దివ్యకాంతితో ప్రకాశించసాగింది. పటంలోని ఆ తల్లి, బాల ఏసు దేహాల నుంచి కాంతిపుంజాలు వెలువడ్డాయి. అవి శ్రీరామకృష్ణుల హృదయంలో ప్రవేశించాయి. అంతే! ఆయన మానసిక భావనలన్నీ పరివర్తన చెందాయి. జన్మసిద్ధమైన హైందవ సంస్కారాలన్నీ మారుమూల ఒదిగిపోయాయి. పూర్తిగా భిన్నమైన సంస్కారాలు ఉదయించాయి. తనను తాను నియంత్రించుకోవడానికి శతవిధాల ప్రయత్నించారు.

‘అమ్మా! నాలో ఏ వింత మార్పులు తీసుకువస్తున్నావు?’ అంటూ జగజ్జననిని హృదయపూర్వకంగా ఆయన ప్రార్థించారు.
 కానీ, ఉపయోగం లేకపోయింది. ఏసుక్రీస్తు పట్ల, క్రైస్తవ సంప్రదాయం పట్ల భక్తి విశ్వాసాలు శ్రీరామకృష్ణుల హృదయంలో పాతుకున్నాయి. క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఏసుక్రీస్తు మూర్తి ఎదుట ఫాదిరీలు ధూపదీపాదులు అర్పించిన దృశ్యాలు ఆయనకు దర్శనమయ్యాయి.
 
తరువాత శ్రీరామకృష్ణులు కాళికాలయానికి తిరిగి వచ్చారు. మనసులోని ఆ భావాలు, కదలాడిన దృశ్యాల చింతనలో లీనమైపోయారు. కాళికాలయానికి వెళ్ళి, జగజ్జననిని దర్శించుకోవాలనే విషయం కూడా మర్చిపోయారు. అలా మూడు రోజుల పాటు ఆ భావతరంగాలు ఆయన మనస్సును ఆక్రమించేశాయి.
 
అది మూడో రోజు... చీకటి పడింది. శ్రీరామకృష్ణులు ‘పంచవటి’ గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అప్పుడు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఉజ్జ్వలమైన గౌరవర్ణుడైన అద్భుత దివ్య మానవుడు ఒకరు తదేకదృష్టితో ఆయనను చూస్తూ, ఆయన వైపు రాసాగారు. ఆ వ్యక్తి విదేశీయుడనీ, విజాతీయుడనీ చూసిన క్షణంలోనే శ్రీరామకృష్ణులకు అర్థమైంది. ఆతని కళ్ళు విశాలంగా ఉన్నాయి. ఆతని ముఖారవిందానికి వింత శోభను సంతరిస్తున్నాయి.

ఆతని ముక్కు ఒకింత చప్పిడిగా ఉంది. కానీ, ఆతని అందానికి అదేమీ కొరత కాలేదు. ఆతని ముఖంలో అద్భుతమైన దివ్య భావప్రకటన తొణికిసలాడుతోంది. అదంతా చూసి, శ్రీరామకృష్ణులు ‘ఇతనెవరా?’ అని అబ్బురపడ్డారు. ఆ దివ్యమూర్తి దగ్గరకు వచ్చాడు. ఆ క్షణంలో శ్రీరామకృష్ణుల హృదయం లోలోపల నుంచి ‘‘ఏసుప్రభువు! దుఃఖయాతనల నుంచి జీవులను ఉద్ధరించడానికి ఎవరు తన హృదయ రక్తాన్ని సమర్పించారో... ఆ ఏసుప్రభువు!’’ అన్న మాటలు వెలువడ్డాయి.
 
అంతర్వాణి అలా పలుకుతూ ఉన్న సమయంలో ఏసుక్రీస్తు, శ్రీరామకృష్ణులను ఆలింగనం చేసుకున్నాడు. ఆయన దేహంలో లీనమైపోయాడు. వెంటనే శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులై, బాహ్యచైతన్యాన్ని కోల్పోయారు. అలా శ్రీరామకృష్ణులు సాక్షాత్తూ ఏసుక్రీస్తు దర్శనం పొందారు.
 
కనిపించిన రూపమే...!
ఇది జరిగిన చాలాకాలం తరువాత ఒకరోజు స్వామి శారదానంద సహా పలువురు ప్రత్యక్ష శిష్యులతో శ్రీరామకృష్ణులు ఏసుక్రీస్తు ప్రస్తావన తెచ్చారు. ‘‘నాయనలారా! మీరు బైబిల్ చదివారు కదా! ఏసుక్రీస్తు భౌతిక లక్షణాల గురించి దానిలో ఏం రాసి ఉంది? ఆయన ఎలా కనిపించేవాడు?’’ అని అడిగారు. దానికి శిష్యులు, బైబిల్‌లో ఎక్కడా ఆయన భౌతిక వర్ణన తాము చూడలేదనీ, కానీ యూదుడుగా జన్మించడం వల్ల క్రీస్తు మేనిఛాయ ఉజ్జ్వల గౌరవర్ణంలో ఉంటుందనీ, విశాలనేత్రాలు, చిలుక లాంటి కొక్కెపు ముక్కు ఉండడం ఖాయమనీ జవాబిచ్చారు.

కానీ, శ్రీరామకృష్ణులు మాత్రం ‘‘ఆయన ముక్కు ఒకింత చప్పిడిదై ఉండడం చూశాను. ఆయనను ఎందుకలా చూశానో తెలియడం లేదు’’ అన్నారు. విచిత్రం ఏమిటంటే, భావసమాధిలో శ్రీరామకృష్ణులు చూసిన స్వరూపం, ఏసుక్రీస్తు వాస్తవమూర్తితో సరిపోలింది. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం ఏసుక్రీస్తు శరీర నిర్మాణం గురించి మూడు విభిన్న వర్ణనలు ఉన్నాయనీ, ఆయన ముక్కు ఒకింత చప్పిడిగా ఉండేదనే వర్ణన వాటిలో ఒకటి ఉందనీ శ్రీరామకృష్ణుల శిష్యులు తెలుసుకొని అబ్బురపడ్డారు. శ్రీరామకృష్ణులకు దర్శనమైంది స్వయంగా క్రీస్తే అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
 
ఇవాళ్టికీ రామకృష్ణ మఠంలో... క్రిస్మస్!
దేశవిదేశాల్లో వ్యాపించిన శ్రీరామకృష్ణ మఠాలన్నిటిలో, బుద్ధ భగవానుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీచైతన్య, శ్రీశంకరుల జన్మదినోత్సవాలు ప్రతి ఏటా చేస్తారు. అది శ్రీరామకృష్ణ మఠ సంప్రదాయం. విశేషం ఏమిటంటే, శ్రీరామకృష్ణుల క్రైస్తవ ఆధ్యాత్మిక సాధన, పైన చెప్పిన సంఘటనను పురస్కరించుకొని - క్రిస్మస్ సందర్భంగా ‘క్రిస్మస్ ఈవ్’ (డిసెంబర్ 24) నాడు ఏసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని కూడా మఠంలో శ్రద్ధాభక్తులతో చేస్తారు.

ముఖ్యంగా మఠ కేంద్రస్థానమైన కోల్‌కతాలోని బేలూరు రామకృష్ణ మఠంలో క్రీస్తు పూజ, బైబిల్ పారాయణ, భక్తి సంగీత గానం మొదలైనవి జరుపుతారు. రామకృష్ణ మఠం, మిషన్ సెంటర్లలో జరిపే పండుగల్లో హైందవేతర ఉత్సవం ఇదొక్కటే! ఇప్పటికీ ఈ సంప్రదాయం అవిచ్ఛిన్నంగా సాగుతోంది.
- రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement