సిలువే కొలమానం
- జస్టిన్ హాల్‌కాంబ్, ఆధ్యాత్మిక ప్రవచకులు
నేడు గుడ్ ఫ్రైడే
దేవుడు చనిపోయిన రోజు ‘మంచి రోజు’ ఎలా అవుతుంది? మనిషి చనిపోతేనే అది విషాదం కదా, అటువంటిది దేవుని కుమారుడు చనిపోతే ఇంకెంత విషాదం! అలా మనం విషాదంలో మునిగిపోయిన రోజును గుడ్‌ఫ్రైడే అంటారేం? పైగా అది ఎలాంటి మరణం! యేసుక్రీస్తు కాళ్లలో చేతుల్లో మేకులు దిగ్గొట్టి, గాలిలో సిలువపై నిలబెట్టి, డొక్కల్లో బరిసెతో పొడిచి... భగవంతుడా, ఇలాంటి మరణం ఏ నరకంలోనైనా ఉంటుందా? ఎంత రక్తం! ఎంత యాతన! మనసు విలవిలలాడిపోతుంది.
క్రీస్తు మనకోసం మరణించాడని, మానవాళి దోషాలను, పాపాలను సిలువపై ఎగసి చిమ్మిన తన రక్తంతో ప్రక్షాళన చేశాడని, అందుకోసం ఆయన తన ప్రాణాలనే త్యాగం చేశాడని.. తెలిసి, హృదయం మరింత విలపిస్తుంది. ‘‘తిరిగి జీవించడానికే ఆయన మరణించాడు కాబట్టి మానవాళికది గుడ్‌ఫ్రైడే’’ అనే మాటతో మనసు ఊరట చెందదు. ఎందుకంటే - మూడవరోజు పునరుత్థానం పొందినంత తేలిగ్గా ఆయన మరణం సంభవించలేదు. మరణానికి ముందు సిలువపై క్రీస్తు పడిన ‘కారుణ్య యాతన’ను, ఆ త్యాగాన్ని ‘సిలువ’తో తప్ప దేనితోనూ కొలవలేము.
క్రీస్తు మరణించి, తిరిగి లేచిన నాటి నుంచి క్రైైస్తవులు సిలువను ధరించడాన్ని తమ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్య భాగంగా స్వీకరించారు. ఇక ఆయన పునరుత్థానం యావత్ సృష్టిలోనే ఒక నిర్ణయాత్మకమైన మలుపు. అందుకే గుడ్‌ఫ్రైడే, ఈస్టర్... రెండూ క్రైస్తవులకు వేడుకలయ్యాయి. మానవాళి పాపాలకు పరిహారంగా క్రీస్తు తన ప్రాణాలను త్యాగం చేయడాన్ని, వారికోసం స్వచ్ఛందంగా ఆయన సిలువనెక్కి మరణించడాన్ని గుడ్‌ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. గుడ్ ఫ్రైడే తర్వాతి ఆదివారం... ‘ఈస్టర్’ మహోజ్వలమైన ఉత్సవం. ఆ రోజున క్రీస్తు మరణాన్ని జయించాడు. ఆయనలో విశ్వాసం ఉంచిన వారందరికీ పాపవిముక్తి, పునరుత్థానం ఉంటాయనేందుకు ఈస్టర్...ఒక సంకేతం.
అయితే క్రీస్తు మరణించిన రోజును ‘బ్యాడ్ ఫ్రైడే’ అని కాకుండా ‘గుడ్ ఫ్రైడే’ అని ఎందుకు అనవలసి వచ్చింది? కొన్ని క్రిస్టియన్ సంప్రదాయాలలో అలా కూడా ఉంటుంది. ఉదాహరణకు జర్మనీలో గుడ్‌ఫ్రైడేని ‘కార్‌ఫైటాగ్’ (Karfreitag) అంటారు. దీనర్థం ‘బాధాకరమైన శుక్రవారం’ అని. మరి ఇంగ్లిష్‌లో ఇలా ఉంటుందేమిటి Good అని. దీనిపై భిన్నవాదన కూడా ఉంది. అది Good కాదనీ, God అనీ కొందరు అంటారు. అంటే God's Friday అని. ఈ God కాలక్రమంలో Good అయి ఉంటుందని ఒక భావన. సూక్ష్మంగా గమనిస్తే Good అనేదే సరైనదేమో అనిపిస్తుంది. మానవాళి పాపాలను ప్రక్షాళన చేయడం కోసం క్రీస్తు మరణించడం ద్వారా మానవులకు ఒక శుభ శుక్రవారం సంప్రాప్తించినట్లు అర్థం చేసుకోవాలి. అయితే ఇది అర్థం కావాలంటే మొదట మానవ జీవితంలోని పాపభూయిష్టతను అర్థం చేసుకోవాలి. అప్పుడు గుడ్ ఫ్రైడే అనడంలోని అంతరార్థం బోధపడుతుంది.
క్రీస్తు రక్తంతో పాపప్రక్షాళన జరిగిన రోజు గుడ్ ఫ్రైడే. క్రీస్తు పునరుత్థానంతో సంబరం అంబరాన్ని అంటిన రోజు ఈస్టర్. నైతికవర్తన, శాంతి ఒకదానినొకటి ముద్దాడిన సందర్భాలు కూడా గుడ్ ఫ్రైడే, ఈస్టర్‌లే. ఇక ఈ బాధ, సంతోషం; దేవుడి క్షమ కలగలిసిన దానికి సంకేతమే సిలువ. అటువంటి సిలువపై గుడ్ ఫ్రైడే రోజునే క్రీస్తు మన కోసం మరణించి, తిరిగి మనకోసమే లేచారు. పాపుల పట్ల దేవుని ఆగ్రహం, దైవకుమారుని కరుణ కలగలసిందే సిలువ. అందుకే గుడ్ ఫ్రైడే చీకటి వంటి విషాదాన్ని, వెలుగునివ్వబోయే సంతోషాన్ని కలిగి ఉంటుంది.
సిలువపై క్రీస్తు మరణం... దేవుని ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనం. రక్తం ఓడుతున్న శరీరంతో క్రీస్తు తలవాల్చడమన్నది... ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అనే దైవ సంకేతంతప్ప మరొకటి కాదు.
- బిల్లీ గ్రాహం, ఎవాంజలిస్ట్
జీవితం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది, అజరామరమైనదీ అని క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవుడు సూచించాడు.
- రెవ. డా. చార్లెస్ క్రోవ్,
ఏసుక్రీస్తు చివరి ఏడు మాటలు
తన తండ్రి యెహోవాతో
1.తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. (లూకా 23:34)
సిలువపై తన పక్కన ఉన్న నేరస్థులతో
2.నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండుదువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. (లూకా 23:43)
తల్లి మరియతో, శిష్యుడు యోహానుతో
3.అమ్మా, ఇదిగో నీ కుమారుడు (యోహానును చూపిస్తూ) ఇదిగో, నీ తల్లి (మరియను చూపిస్తూ) (యోహాను 19:26-27)
తండ్రి యెహోవాతో
4.ఎలోయీ ఎలోయీ సబక్తానీ (నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి) మత్తయి (27:46) మార్కు (15:34)
చివరి ఘడియలు సమీపిస్తున్నప్పుడు
5.నేను దప్పిగొనుచున్నాను. (యోహాను 19:28)
6.ఇక సమాప్తమయినది (యోహాను 19:30)
చిట్ట చివరిగా
7. తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను (లూకా 23:46)