కరోనా కాదు ఇప్పుడొచ్చిన కష్టం..
మనిషికి మనిషి దూరం అవడం!
కరోనా ఉన్నా.. లేకున్నా..
‘లెప్పర్’లకు ఇది ఎప్పుడూ ఉండే కష్టమే.
వాళ్లనెవ్వరూ దగ్గరికి రానివ్వరు.
మనుషుల మధ్యకు చేరనివ్వరు.
ఇప్పుడింకా కష్టం అయింది బతుకు.
చెయ్యి చాచడానికైనా మనిషుంటేనా!
ఉన్నాను.. అని వచ్చారు ఇన్నయ్య.
కళ్లు మెరిశాయి. నవ్వు విరిసింది.
అయినవాళ్లు ఎందరున్నా, అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎవరూ లేనివాళ్లంగా మిగిలిపోవలసి ఉంటుంది. కరోనా వచ్చి ఇప్పుడంటే మనుషులకు మనుషులు దూరం అవుతున్నారు. ‘సెయింట్ ఆంటోని లెప్పర్ కాలనీ’ లోని యాభై మూడు కుటుంబాల వాళ్లు ఏనాడో సొంతవాళ్లకు దూరమై ఏకాకులుగా బతుకులీడుస్తున్నారు. ‘లెప్రసీ’ వారిని వేరు చేసింది. ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలో, వేటపాలెం మండలంలోని రామన్నపేటలో ఉంది ఈ కాలనీ. నెల్లూరు క్యాథలిక్ డైకోసిస్ ఈ కుటుంబాలకు నీడను ఇస్తుంటే.. వాళ్లతోనే కలిసి ఉంటున్న గుంటూరు ఇన్నయ్య.. అన్నమూ నీళ్లు ఇస్తున్నారు! ఒంట్లో బాగోలేనివాళ్లకు మందులు కూడా. ఇన్నయ్య.. రెవరెండ్ ఫాదర్ ఇన్నయ్యగా అందరికీ తెలుసు. లెప్పర్ కుటుంబాలకైతే ఆయన మానవతామూర్తే.
గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ముట్లూరు గ్రామం ఇన్నయ్యది. చిన్నప్పుడే బాప్టిజం తీసుకున్నారు. పెద్దయ్యాక వ్యాధిగ్రస్తుల్ని గుండెల్లోకి తీసుకున్నారు. కొన్నేళ్లు ఇటలీలో ఉన్నారు. అక్కడి భాషల్ని, బాధల్ని ఇక్కడికి మోసుకొచ్చారు. ‘‘బాధ (పెయిన్) విశ్వవ్యాప్త భాష. చెప్పకుండానే అర్థమైపోతుంది’’ అంటారు ఇన్నయ్య. కరోనా వచ్చాక.. లెప్పర్ కాలనీలో ప్రతి ఒక్కరి యోగక్షేమాలను కనుక్కుంటున్నారు ఆయన. వాళ్ల భోజనానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ‘‘వీళ్లకు సేవ చేయడం ఓ గౌరవం’’ అంటారు ఇన్నయ్య. ‘‘కష్టాలకు ఎవ్వరూ అతీతులు కాదు. కూడూ, గూడు, వనరులు, ‘నా’ అనేవాళ్లు లేని వారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వారికి చేదోడుగా ఉండడం మనుషులుగా మనందరి విధి’’ అని ఆయన అంటున్నారు.
‘‘టౌన్‌లో (చీరాల, వేటపాలెం) పరిస్థితులు బాగుంటే మాలో కొందరం ఏదో విధంగా బయటకు వెళ్లి మాకు కావాల్సిన సరకులో, డబ్బులో తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏది చేసినా మా ఫాదర్ చేయాల్సిందే. ఎలా తిప్పలు పడుతున్నారో, ఎలా చేస్తున్నారో వేళకు మాకింత తిండిపెడుతున్నారు మహానుభావుడు’’ అంటున్నారు కాలనీలో ఉండే కోటమ్మ, దుర్గయ్య, ఏసోబు తదితరులు.. ఇన్నయ్య గురించి. రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. రైళ్లలో భిక్షమెత్తే వాళ్లు మొదలు వీధుల్లో తోపుడుబండ్లపై తిరుగుతూ అర్థించే వారు, అనా«థలు, అభాగ్యులు, కుటుంబ సభ్యులు వదిలేసిన వారు... ఇలా ఎందరెందరో ఉన్న ఈ ప్రాంగణానికి ఇప్పుడీ కరోనా కాలంలో ఇన్నయ్యే అన్నీ అయ్యారు.
– ఎ. అమరయ్య, సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment