New Covid Variant Omicron: Intresting Facts And Story About New Corona Virus Omicron Variant In Telugu - Sakshi
Sakshi News home page

Omicron Variant: ‘ఒమిక్రాన్‌’ వేరియెంట్‌ కథాకమామిషూ

Published Sun, Nov 28 2021 9:15 PM | Last Updated on Tue, Nov 30 2021 5:14 AM

Intresting Facts And Story About New Corona Virus Omicron Variant - Sakshi

New Covid Variant Omicron: కొంతకాలం పాటు సద్దుమణిగినట్లు అనిపించినా ప్రస్తుతం కరోనా వైరస్‌ ఓ కొత్త  వేరియెంట్‌ ‘ఒమిక్రాన్‌’ రూపంతో మళ్లీ ప్రపంచం ముందుకు వచ్చింది. దాంతో ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్న ప్రజలంతా మళ్లీ బెంబేలెత్తడం మొదలుపెట్టారు. అసలీ ‘ఒమిక్రాన్‌’ అనే వేరియెంట్‌ ఏమిటి? దాని కథాకమామిషూ, ఇతర వివరాలను సమగ్రంగా తెలుసుకుందాం. 

హాంగ్‌కాంగ్‌లో క్వారంటైన్‌ కోసమే ఉద్దేశించిన ఓ హోటల్‌లో ఒక  రూమ్‌లోని ఓ వ్యక్తికి కొత్త వేరియెంట్‌ ‘ఒమిక్రాన్‌’ వచ్చి ఉంది. ఆయన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవాడు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో... ఎదుటి రూమ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా నుంచి రాని వ్యక్తికి కూడా (ఒమిక్రాన్‌ను తెలుసుకునేందుకు జన్యుసంబంధింత) పరీక్ష చేయించారు. ఆశ్చర్యం!... ఎదుటి రూమ్‌ వ్యక్తికీ ‘ఒమిక్రాన్‌’!! ఈ ఇద్దరు వ్యక్తులు కూడా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నవారే. ఇక్కడో విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ వ్యక్తి దగ్గర్నుంచి ఎదుటి గదిలో ఉన్న వ్యక్తికి కూడా ‘డెల్టా’ వేరియెంట్‌ కన్నా  అత్యంత వేగంగా వ్యాపించడంప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనపరుస్తోంది. 

ఆమె ఒక 30 ఏళ్ల మహిళ. బెల్జియం నుంచి ఈజిప్ట్‌కి  వెళ్ళింది. ఆమె కరోనా వ్యాక్సిన్‌ ను తీసుకోలేదు. వెనక్కి బెల్జియం తిరిగి వచ్చిన తర్వాత ఆవిడకి పరీక్ష చేసినప్పుడు ఆమెకి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉందని తేలింది. అసలు దక్షిణాఫ్రికాకు గాని అక్కడికి దగ్గరలోని దేశాలకు గాని వెళ్లని ఈమెకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఏ విధంగా వచ్చింది అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

కరోనా వైరస్‌కి కొత్త కొత్త వేరియంట్లు రావడం సహజమే అన్నది తెలిసిందే. అయితే ఇలా కొత్త వేరియంట్లు వస్తున్నప్పుడు వాటి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ‘ఒమిక్రాన్‌ వేరియంట్‌’ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలూ, ప్రభుత్వాలూ హడలిపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా ప్రకటించింది. బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాతే డెల్టాను ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా పేర్కొన్నారు.

కానీ... ఒమిక్రాన్‌ విషయంలో మాత్రం కేవలం వంద మందికి సోకగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేరియంట్‌ విస్తృతంగా ఉన్న సౌత్‌ ఆఫ్రికా నుంచి విమానాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ మనదేశం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాని మోదీ సైతం ఈ వైరస్‌ విషయంలో అప్రమత్తంగానూ, సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంత వేగంగా ప్రపంచ దేశాలన్నీ ప్రతిస్పందించడానికి కారణాలేమిటో చూద్దాం. ఓ కొత్త వేరియంట్‌ రావాలి అంటే వైరస్‌లో కొన్ని జన్యు ఉత్పరివర్తనాలు కలగాలి.

ఆ జన్యు ఉత్పరివర్తనాలు ఒక మేరకు మించి జరిగినప్పుడు అది అంతకుముందున్న వేరియంట్‌ కంటే పూర్తిగా భిన్నమైనదని శాస్త్రవేత్తలు భావించినప్పుడు... దాన్ని ‘కొత్త వేరియంట్‌’గా పిలుస్తారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్‌ ఒమిక్రాన్‌. కరోనాకి  సంబంధించిన వేరియంట్లలో ఉత్పరివర్తనాల విషయంలో ఇది రారాజు లాంటిది.  ఇప్పటి వరకు 50కి పైగా కొత్త జన్యు ఉత్పరివర్తనాలు ఈ వేరియంట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు.

అంతేకాకుండా వీటిలో సుమారుగా 32 ఉత్పరివర్తనాలు... ఒక్క దాని స్పైక్‌ ప్రోటీన్‌లోనే  ఉండటాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో కూడా ఫ్యూరీన్‌ క్లీవేజ్‌ సైట్‌ అనే భాగంలో మూడు ఉత్పరివర్తనాలు ఉండటం గమనించారు. ఇందువల్ల ఈ వైరస్‌కి యాంటీబాడీస్‌ను బైపాస్‌ చేసుకునే లక్షణం వస్తుందనేది శాస్త్రవేత్తల అంచనా. ఎందుకంటే కరోనా వైరస్‌ మానవ శరీరంలో ప్రవేశించాలంటే దాని స్పైక్‌ ప్రోటీన్‌ను... మన కణజాలంలోకి చొప్పించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని స్పైక్‌ ప్రోటీన్‌ని శాస్త్రవేత్తలందరూ ఒక టార్గెట్‌ గా భావించారు.

యాంటీబాడీస్‌ తయారుచేయడానికీ, వ్యాక్సిన్‌లను రూపొందించడానికీ, మందుల తయారీకీ  శాస్త్రవేత్తలు స్పైక్‌ ప్రోటీన్‌ని ఒక లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు...  ఎప్పుడైతే స్పైక్‌ ప్రోటీన్లో ఎక్కువగా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయో అప్పుడు అనేక రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా కరోనా వైరస్‌ మన శరీర కణాలలోకి చొచ్చుకుపోయే విషయంలో ఇంకా వేగవంతమయ్యే  అవకాశం ఉంటుంది. రెండవది... మనం తయారుచేసుకున్న వాక్సిన్లను మన శరీరంలోకి ప్రవేశపెట్టాక... అక్కడ అవి ఉత్పత్తి చేసే యాంటీబాడీస్‌... ఈ వైరస్‌ని గుర్తించలేకపోవచ్చు. మూడవది... మనం తయారుచేసుకున్న యాంటీవైరల్‌ మందులు ఈ వేరియంట్‌ పైన పని చేయకపోవచ్చు. నాలుగోది... మనం తయారుచేసుకున్న సింథటిక్‌ యాంటీబాడీస్‌ ఈ వైరస్‌ని ప్రభావితం చేయలేకపోవచ్చు. ఈ కారణాలను బట్టి ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌కి కొన్ని ‘సూపర్‌ పవర్స్‌’ ఉన్నాయని చెప్పుకోవచ్చు.ఏదైనా ఒకదాన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా గుర్తించాలంటే ఈ కింద చెప్పిన మూడింట్లో ఏదో ఒక విషయంలో అది మిగతా వేరియంట్ల కన్నా భిన్నంగా ఉండాలి.

వీటిలో మొదటిదీ, ముఖ్యమైనదీ... ఎక్కువ వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యం. రెండోది... ఎక్కువమందిని ప్రాణాపాయానికి గురిచేసే అవకాశం. మూడోది... ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్స్‌... అలాగే సహజంగా ఇన్ఫెక్షన్‌ తర్వాత దేహంలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను సమర్థంగా ఎదుర్కొని రోగుల మీద దాడి చేయగలిగే సామర్థ్యం. ఒమిక్రాన్‌ విషయంలో... పైన పేర్కొన్న ఏ ఒక్క దానిలోనూ అది ప్రమాదకరమైన అంశమని పూర్తిగా రుజువు కాలేదు. అయితే ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందనడానికి కొన్ని ఆధారాలున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్, ఎంతో వేగంగా వ్యాప్తి చెందగలదని మనం అనుకుంటున్న డెల్టా వైరస్‌ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండోది... ఈ వైరస్‌ సౌత్‌ ఆఫ్రికా నుంచి హాంకాంగ్‌ కి చేరుకున్న తర్వాత అక్కడ క్వారంటైన్‌లో ఉన్న ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చాలా తేలికగా సోకింది. బెల్జియం, ఇజ్రాయిల్‌ మొదలైన దేశాలకు కూడా ఈ వేరియంట్‌ ఇప్పటికే పాకటం విశేషం.

మొట్టమొదటగా ఈ వేరియంట్‌ని బోట్స్‌వానా, దక్షిణాఫ్రికాలలో గుర్తించారు. అక్కడ్నుంచి ఇది హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌ కు పాకింది. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ ఇప్పటికే విస్తరించి ఉండే అవకాశం లేకపోలేదు. ఈ వైరస్‌ని ముందుగా బి.1.1.529 అని పిలిచారు. డబ్ల్యూహెచ్‌ఓ దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా గుర్తించగానే దీనికి గ్రీక్‌ ఆల్ఫాబెట్‌ లో 15వ  అక్షరమైన ‘ఒమిక్రాన్‌’  అనే పేరు పెట్టారు. 

ఇప్పటికైతే ఆందోళన వద్దు... 
ఒమిక్రాన్‌ విషయంలో ఇప్పటికి భయపడాల్సిన అవసరమైతే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు మనకున్న వ్యాక్సిన్స్‌ దీనికి వ్యతిరేకంగా కొంతమేరకైనా ఖచ్చితంగా పని చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్న కరోనా వైరస్‌ మందులు కూడా కొంతమేరకు ఈ వేరియంట్‌పై పనిచేసే అవకాశం ఉంది. ఈ వేరియంట్‌ ప్రాణాపాయం అధికంగా కలిగించగలదని చెప్పడానికి ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలూ లేవు. మనం ఇప్పటి వరకు పాటిస్తూ వచ్చిన కోవిడ్‌ జాగ్రత్తలు (కోవిడ్‌ అప్రాప్రియేట్‌ బిహేవియర్‌) ఈ వేరియంట్‌ను సమర్థంగా కట్టడి చేయగలవు. ముఖ్యంగా ఇది మనం ధరించే మాస్కును దాటి లోనికి ప్రవేశించే అవకాశమైతే పెద్దగా కనిపించడం లేదు. 

అప్రమత్తత  అత్యవసరం... 
పూర్తిగా భయపడాల్సిన అవసరం లేనప్పటికీ ఒమిక్రాన్‌ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఇది మనిషి నుంచి మనిషికి చాలా వేగంగా వ్యాప్తి చెందే విషయం గనక నిజమైతే...  మనకి మళ్లీ ఓ వేవ్‌ లాగా కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. వాటిని నివారించే చర్యలు ఇప్పటినుంచే ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరమూ ఉంది. ఈ క్రమం లో బూస్టర్‌ డోస్‌ విషయంలో ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మొదటి డోసు మాత్రమే వేసుకుని రెండో డోసు వేసుకోని వారందరికీ చాలా వేగంగా రెండో డోసుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చిన్నపిల్లల వ్యాక్సినేషన్‌ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇప్పటికే మర్చిపోతున్న మాస్కును, భౌతిక దూరాన్ని వాళ్లకి మళ్లీ గుర్తు చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కరోనా వైరస్‌ గురించి జరిగే తప్పుడు ప్రచారాల  గురించి, అవి కలగజేసే భయాందోళనల గురించి ప్రజలకి ముందుగానే వివరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement