Australian scientists
-
Global warming: సముద్ర జీవజాలానికి భూతాపం ముప్పు
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న శిలాజ ఇంధనాల వినియోగం.. తద్వారా నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం. వీటివల్ల భూగోళంపై మానవాళి మనుగడకు ముప్పు ముంచుకొస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం భూమిపై ఉన్న జీవజాలమే కాదు, సముద్రాల్లోని జీవులు సైతం అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా సైంటిస్టులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను ‘నేచర్’ పత్రికలో ప్రచురించారు. ► ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనేది యథాతథంగా కొనసాగితే అంటార్కిటికాలో మంచు మరింత కరిగి, ఆ మంచినీరంతా సముద్రాల్లోకి చేరుతుంది. ► కొత్త నీటి రాకతో సముద్రాల ఉపరితల జలంలో లవణీయత, సాంద్రత తగ్గిపోతుంది. ఈ పరిణామం సముద్ర ఉపరితలం నుంచి అంతర్భాగంలోకి జల ప్రవాహాన్ని నిరోధిస్తుందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా సముద్రాల్లో పైభాగం నుంచి లోపలి భాగంలోకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంతర్భాగంలో కూడా ఒకచోటు నుంచి మరోచోటుకి జల ప్రవాహాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ► మంచు కరిగి, కొత్త నీరు వస్తే సముద్రాల పైభాగం నుంచి 4,000 మీటర్ల(4 కిలోమీటర్ల) దిగువన నీటి ప్రవాహాలు తొలుత నెమ్మదిస్తాయి. ఆ తర్వాత పూర్తిగా స్తంభించిపోతాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. ► నీటి ప్రవాహం స్తంభిస్తే సముద్రాల్లో లోతున ఉండే ప్రాణవాయువు(ఆక్సిజన్), ఇతర పోషకాలు సైతం అంతమైపోతాయని సైంటిస్టు ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లాండ్ చెప్పారు. దీంతో సముద్రాల్లోని జీవుల మనగడకు అవసరమైన వనరుల కొరత ఏర్పడుతుందని తెలిపారు. వాటి మనుగడ ప్రమాదంలో పడుతుందని వివరించారు. ఇదంతా మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని వారు వెల్లడించారు. ► సముద్రాల్లో జలమట్టం పెరిగితే ఉపరితలంపై కొత్త నీటి పొరలు ఏర్పడుతాయి. దానివల్ల సముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను శోషించుకోలేవు. అంతేకాకుండా తమలోని కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. సముద్రాల నుంచి కర్బన ఉద్గారాలు ఉధృతమవుతాయి. ఫలితంగా భూగోళం మరింత వేడెక్కుతుంది. ► అంటార్కిటికాలో ప్రతిఏటా 250 ట్రిలియన్ టన్నుల చల్లని, ఉప్పు, ఆక్సిజన్‌తో కూడిన నీరు చేరుతుంది. ఇది ఉత్తర దిశగా విస్తరిస్తుంది. హిందూ, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోకి ఆక్సిజన్‌ను చేరుస్తుంది. రానున్న రోజుల్లో అంటార్కిటికా నుంచి విస్తరించే ఆక్సిజన్ పరిమాణం తగ్గనుందని అంచనా వేస్తున్నారు. ► ప్రపంచ కర్బన ఉద్గారాలను సమర్థంగా నియంత్రించకపోతే రాబోయే 40 సంవత్సరాల్లో అంటార్కిటికాలోని సముద్రాల కింది భాగంలో జల ప్రవాహం ఆగిపోతుందని, సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సైంటిస్టులు నిర్ధారించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా సోకితే 8 నెలలు సేఫ్?
సాక్షి, హైదరాబాద్ : ఒకసారి కరోనా బారిన పడ్డవారికి కనీసం 8 నెలలపాటు ఆ వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నియంత్రణకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల ద్వారా ఎక్కువ కాలం రక్షణ లభించే అవకాశముందని తమ పరిశోధన ద్వారా తెలుస్తోందని ఆస్ట్రేలియా లోని మొనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మెమో వాన్ జెల్మ్ తెలిపారు. సైన్స్ ఇమ్యూనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. కరోనా బారినపడ్డవారిలో రోగ నిరోధక వ్యవస్థకు చెం దిన మెమరీ బీ–సెల్స్‌ను గుర్తించారు. (చదవండి: వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!) ఈ కణాలు వ్యాధి, వైరస్ రెండింటినీ గుర్తుంచుకుంటాయి. ఒకవేళ మళ్లీ వైరస్ దాడి చేస్తే ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థను చైతన్యపరిచి యాంటీ బాడీలు వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. పరిశోధనల్లో భాగంగా 25 మంది కరోనా సోకిన వారిని ఎంపిక చేశామని, వ్యాధికి గురైన నాలుగో రోజు నుంచి 242వ రోజు వరకు పరిశీలించామని వాన్ జెల్మ్ తెలిపారు. వైరస్ నిరోధానికి ఉపయోగపడే యాంటీబాడీలు 20వ రోజు నుంచి తగ్గిపోవడం మొదలైందని, కాకపోతే మెమరీ బీ– సెల్స్ చివరి రోజు వరకు కొనసాగాయని పేర్కొన్నారు. ఈ మెమరీ సెల్స్ వైరస్ కొమ్ము, న్యూక్లియో ప్లాస్టిడ్ ప్రొటీన్ రెండింటినీ గుర్తించగలదన్నారు. (చదవండి: ముంబై, కర్ణాటకల్లో రాత్రి కర్ఫ్యూ) -
కేన్సర్ చికిత్సలో నత్తలు..!
కాన్బెర్రా: సముద్రపు నత్తల గ్రంధులు స్రవించే జిగురు కేన్సర్ వ్యాధి చికిత్సకు సమర్థమైన మందుగా ఉపయోగపడుతుందని ఆ్రస్టేలియాలోని ఫ్లిండర్స్, సదరన్ క్రాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే నత్తల నుంచి నొప్పిని తగ్గించే మందులతోపాటు మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడే ఇన్సులిన్‌ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సముద్ర జీవుల్లో మనకు ఉపయోగపడే రసాయనాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు కేథరీన్ అబోట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. బ్యాక్టీరియా నుంచి రక్షించుకునేందుకు గాను ఆ్రస్టేలియా ప్రాంతంలోని ఒక రకమైన నత్త తన గుడ్లలోకి ప్రత్యేకమైన పదార్థాన్ని విసర్జిస్తున్నట్లు వీరు గుర్తించారు. ఈ పదార్థాన్ని కేన్సర్ కణాలపై ప్రయోగించినప్పుడు అవన్నీ మరణించాయని తెలిపారు. నత్తల జిగురులోని 6-బీఆర్ అనే పదార్థం పేగు కేన్సర్ కణితుల సైజును తగ్గించగలదని ప్రయోగాల ద్వారా వెల్లడైంది. సహజ సిద్ధమైన పదార్థం స్థానంలో తాము కృత్రిమంగా తయారు చేసిన 6-బీఆర్‌ను జంతువులపై ప్రయోగించి సత్ఫలితాలు సాధించామని కేథరీన్ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఫలితాలను రూఢీ చేసుకుని మానవులపై ఈ రసాయనాన్ని ప్రయోగించేందుకు వీలు ఉందని అంచనా. -
చనిపోయేందుకు ఆస్ట్రేలియా నుంచి స్విట్జర్లాండ్‌కు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాకు చెందిన 104 సంవత్సరాల శాస్త్రవేత్త అనాయాస మరణం కోసం స్విట్జర్లాండ్ రానున్నారు. అనారోగ్య సమస్యలు లేకున్నా కారుణ్య మరణంతో తనువు చాలించాలని ఉందని డేవిడ్ గుడాల్ అనే వయసు మీరిన శాస్త్రవేత్త తన కోరికను వెల్లడించారు. గుడాల్ ఆలోచనకు కుటుంబ సభ్యులూ పూర్తిగా బాసటగా నిలిచారు. తనకు నాణ్యతతో కూడిన జీవితం క్రమంగా క్షీణిస్తోందని కారుణ్య మరణం ప్రసాదించాలని గుడాల్ బాసెల్‌లోని ఏజెన్సీకి ఫాస్ట్‌ట్రాక్ అపాయింట్మెంట్ కోసం వేడుకున్నారు. గత నెలలోనే గుడాల్ కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో 104వ బర్త్‌డేను జరుపుకున్నారు. ‘ఈ వయసుకు చేరుకోవడం పట్ల ఇప్పుడు నేను చింతిస్తున్నా..నేను సంతోషంగా లేను..నాకు కన్నుమూయాలని ఉంద’ని ఆయన ఆవేదన చెందారు. తనలాంటి వయసుమళ్లిన వ్యక్తులకు స్వేచ్ఛగా మరణించే హక్కుతో సహా పౌర హక్కులన్నీ ఉండాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు. 2016లో 102 ఏళ్ల వయసులో ఆయనను తన యూనివర్సిటీ బలవంతంగా విధుల నుంచి తప్పించడంతో ప్రొఫెసర్ గుడాల్ వార్తల్లో నిలిచారు. వయసు మళ్లిన కారణంగా తనను వర్సిటీ నుంచి పంపించివేయడంపై ఆయన చేసిన పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గౌరవంగా మరణించేలా సహకరించడం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చట్టవిరుద్ధం. ఆస్ట్రేలియాలోనూ దీనిపై నిషేధం విధించారు. గత ఏడాది విక్టోరియా స్టేట్ దీన్ని తొలిసారిగా చట్టబద్ధం కాగా, అది కూడా దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతూ ఆరు నెలలకు మించి జీవించని వారికి మాత్రమే జూన్ 2019 నుంచి వర్తింపచేస్తారు. ఆస్ర్టేలియా అంతటా కారుణ్య మరణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గుడాల్‌ను స్విట్జర్లాండ్‌కు తరలించేందుకు సాయపడుతున్న ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో నెలకొన్న పరిస్థితిపై పలు వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన వయసుమీరిన, ప్రముఖ వ్యక్తులు గౌరవంగా మరణించేందుకు ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి బాధాకరమని పేర్కొంది. -
వాతావరణ కాలుష్యం నుంచి కాపాడే బీర్!
మెల్ బోర్న్:ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ వాతావరణ కాలుష్యం బారిన పడుతూనే ఉంటారు. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా ప్రతీ ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా , రోగాల బారిన పడే వారు కూడా లెక్కకు మించే ఉంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ తో అల్లాడిపోతున్నజనాభాను చల్లబరిచేందుకు శాస్త్రవేత్తలు కొత్త ద్రవపదార్ధాన్ని మన ముందుకు తీసుకువస్తున్నారు. పచ్చ రంగులో ఉండే ఈ ద్రావకానికి బీర్ లో ఉపయోగించే బార్లి గింజలనే ప్రధానంగా వినియోగించినట్లు క్వీన్స్ లాండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త పీటర్ గోస్ తెలిపారు. కాలుష్యం బారిన పడి వేడిని తట్టుకోలేని సమయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని ద్వారా అధికమొత్తంలో కాలుష్యానికి గురైన వ్యక్తికి ఉపశమనం చేకూరుతుందని పరిశోధకులు తెలిపారు. దీని ధర సాధారణ బీర్ ల కంటే అధిక మొత్తంలొ ఉంటుందన్నారు. దీని ధర 5 యూఎస్ డాలర్లు మొదలుకొని 20 డాలర్ల వరకూ ఉండవచ్చన్నారు. కాగా, అసలు ధర ఎంత ఉంటుందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.