మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాకు చెందిన 104 సంవత్సరాల శాస్త్రవేత్త అనాయాస మరణం కోసం స్విట్జర్లాండ్ రానున్నారు. అనారోగ్య సమస్యలు లేకున్నా కారుణ్య మరణంతో తనువు చాలించాలని ఉందని డేవిడ్ గుడాల్ అనే వయసు మీరిన శాస్త్రవేత్త తన కోరికను వెల్లడించారు. గుడాల్ ఆలోచనకు కుటుంబ సభ్యులూ పూర్తిగా బాసటగా నిలిచారు. తనకు నాణ్యతతో కూడిన జీవితం క్రమంగా క్షీణిస్తోందని కారుణ్య మరణం ప్రసాదించాలని గుడాల్ బాసెల్‌లోని ఏజెన్సీకి ఫాస్ట్‌ట్రాక్ అపాయింట్‌మెంట్ కోసం వేడుకున్నారు. గత నెలలోనే గుడాల్ కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో 104వ బర్త్‌డేను జరుపుకున్నారు. ‘ఈ వయసుకు చేరుకోవడం పట్ల ఇప్పుడు నేను చింతిస్తున్నా..నేను సంతోషంగా లేను..నాకు కన్నుమూయాలని ఉంద’ని ఆయన ఆవేదన చెందారు.
తనలాంటి వయసుమళ్లిన వ్యక్తులకు స్వేచ్ఛగా మరణించే హక్కుతో సహా పౌర హక్కులన్నీ ఉండాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు. 2016లో 102 ఏళ్ల వయసులో ఆయనను తన యూనివర్సిటీ బలవంతంగా విధుల నుంచి తప్పించడంతో ప్రొఫెసర్ గుడాల్ వార్తల్లో నిలిచారు. వయసు మళ్లిన కారణంగా తనను వర్సిటీ నుంచి పంపించివేయడంపై ఆయన చేసిన పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గౌరవంగా మరణించేలా సహకరించడం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చట్టవిరుద్ధం.
ఆస్ట్రేలియాలోనూ దీనిపై నిషేధం విధించారు. గత ఏడాది విక్టోరియా స్టేట్ దీన్ని తొలిసారిగా చట్టబద్ధం కాగా, అది కూడా దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతూ ఆరు నెలలకు మించి జీవించని వారికి మాత్రమే జూన్ 2019 నుంచి వర్తింపచేస్తారు. ఆస్ర్టేలియా అంతటా కారుణ్య మరణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గుడాల్‌ను స్విట్జర్లాండ్‌కు తరలించేందుకు సాయపడుతున్న ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో నెలకొన్న పరిస్థితిపై పలు వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన వయసుమీరిన, ప్రముఖ వ్యక్తులు గౌరవంగా మరణించేందుకు ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి బాధాకరమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment