ఉత్తరాఖండ్‌ విలయానికి కారణం ఆ పరికరమేనా?! | Uttarakhand Disaster Villagers Suspect Radioactive Device Behind It | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌ విలయానికి కారణం ఆ పరికరమేనా?!

Published Tue, Feb 9 2021 8:49 PM | Last Updated on Wed, Feb 10 2021 1:29 AM

Uttarakhand Disaster Villagers Suspect Radioactive Device Behind It - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది సృష్టించిన జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. మంగళవారం (ఫిబ్రవరి 9) మరో ఐదు మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 203 మంది గల్లంతయ్యారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు చెందిన రెండో టన్నెల్‌లో 30 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని కాపడటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొదటి టన్నెల్‌ నుంచి 12 మందిని సురక్షితంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈ భయానక విపత్తుకు అందరూ భావించినట్లు హిమనీనదం పేలుడు కారణం కాదని రైనీ గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాక వారు మరో సంచలన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 56 ఏళ్ల కిందట అధికారులు నందాదేవి శిఖరంపై ఓ రేడియో యాక్టివ్ (రేడియోధార్మిక పదార్థం) పరికరాన్ని ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత ఆ పరికరం మిస్సైందని తెలిపారు. తాజా పేలుడుకు ఆ పరికరమే కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘సీఐఏ, ఐబీ అధికారులు 1965లో నందాదేవి శిఖరంపై అణుశక్తితో కూడిన న్యూక్లియర్ పరికరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. చైనాపై నిఘా ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. ఈ నేపథ్యంలో పర్వత శిఖరాన్ని పరిశీలించానికి వెళ్లిన అధికారుల బృందం ఊహించని ప్రమాదం బారిన పడింది. దాంతో ప్రాణాలతో బయటపడే క్రమంలో ఆ రేడియో యాక్టివ్ డివైస్‌ను అక్కడే వదిలేశారు. మరుసటి సంవత్సరం అధికారులు అక్కడికి మళ్లీ వెళ్లారు.. అయితే ఆ పరికరం మాత్రం కనిపించలేదు’’ అని గ్రామస్తులు తెలిపారు. రేడియో యాక్టీవ్‌ పరికరం జీవిత కాలం వందేళ్లు. ఇప్పటివరకు అది ఆ మంచు కొండల్లో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందని తాము భావిస్తున్నామని తెలిపారు.

ప్రమాద సమయంలో ఘాటైన వాసన..!
ప్రమాదం జరిగిన నందాదేవి పర్వత శిఖరానికి సమీపంలోనే రైనీ గ్రామం ఉంది. ప్రమాదాన్ని కొంత మంది గ్రామస్తులు దగ్గరి నుంచి చూశారు. ఆ రోజు ప్రమాదం జరిగిన తీరును వారు వివరించారు. ‘‘పర్వత శిఖరం పైనుంచి మంచు కొండ ఒక్కసారిగా విరిగి కుప్పకూలింది. అందులోంచి ఉప్పెనలా నీరు పొంగి రిషిగంగా నదిలోకి దూకింది. దీంతో వరద ఉధృతి పెరిగింది. ఆ ప్రవాహం.. అడ్డుగా ఉన్న రాళ్లను, డ్యామ్‌లను నాశనం చేస్తూ ముందుకు సాగింది. ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది’’ అని గ్రామస్తులు నాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు.

అలానే శిఖరం పైనుంచి భారీ శబ్దంతో మంచు కొండ విరిగిపడిన వెంటనే అక్కడ ఘాటైన వాసన వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ‘‘ఆ వాయువు చాలా ఘాటుగా ఉంది. మేం కొద్దిసేపు ఊపిరి పీల్చుకోలేకపోయాం. ఇది మంచు కొండ విరిగిపడటం, శిథిలాల కారణంగా వచ్చి ఉంటుందని మేం భావించడం లేదు. ఆ వాసన చాలా వేరుగా ఉంది. దాంతో మాకు రేడియో యాక్టీవ్‌ పరికరం మీద అనుమానం వచ్చింది. మా పెద్దలు తరచూ చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి. నందాదేవి శిఖరంపై రేడియో యాక్టివ్ పరికరం మిస్సైన ఘటన గురించి మా పెద్దలు మాకు అనేక సార్లు చెప్పారు’’ అని గ్రామస్తులు తెలిపారు. 

1965లో నందాదేవి శిఖరంపైకి వెళ్లిన అధికారుల బృందానికి కొంత మంది గ్రామస్తులు సహకరించారు. వారిలో ఒక వ్యక్తి భార్య అయిన ఇమర్తి దేవి(90) ఆదివారం నాడు జరిగిన ప్రమాదంలో మృతి చెందడం మరో విషాదకర అంశం. సంగ్రామ్ సింగ్ రావత్ అనే మరో గ్రామస్తుడు కూడా ఆ రేడియోధార్మిక పరికరంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఆదివారం నాటి ఘటన అనంతరం భయంతో అతడు తన కుటుంబంతో కలిసి ఊరికి దూరంగా అడవిలో ఉంటున్నాడు.

2018లో పర్యాటక మంత్రి సప్తాల్ మహరాజ్ ఆ రేడియోధార్మిక పరికరం గురించి ప్రస్తావించడం గమనార్హం. ‘నందాదేవి శిఖరంపై మిస్సైన ఆ పరికరం.. ఆ మంచు కొండలను కలుషితం చేస్తోంది. దాన్ని వెలికితీయడానికి తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రధాని మోదీ ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు. ఏది ఏమైనా ప్రమాదానికి గల కారణాలను అధికారులు తేల్చాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement