కంటైనర్‌ను ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకుంటున్న దృశ్యం
ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి జరిగే అవకాశం ఉందన్న బైడెన్
ఇజ్రాయెల్ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్ కమాండోలు
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘా లు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ దేశం ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని డెమాస్కస్‌లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి, ఇద్దరు ఉన్నతస్థాయి సైనికాధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఇరాన్ ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ సైన్యం ఏ క్షణమైనా దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు.
ఇజ్రాయెల్‌లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయిల్ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిస్సైల్ మొబైల్ లాంచర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిసింది. టెహ్రాన్ నుంచి తమ విమానాల రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకూ రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ తెలియజేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులకు కొన్ని దేశాలు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి.
ఆ నౌకలో భారతీయులు
17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్‌లోని హొర్మూజ్ జలసంధిలో ఈ సంఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వా«దీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment