Embassy Building
-
Iran-Israel war: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడి
జెరూసలేం: అనుకున్నంతా అయింది. సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామునే 300కుపైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్‌తో భీకరదాడికి తెగబడింది. ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మధ్యధరా సముద్రంలో సిద్ధంగా ఉన్న అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిగా ప్రయోగించిన క్షిపణులు, ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిప ణులు ఈ ఇరాన్ మెరుపుదాడిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్ దేశాలు ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు సాయపడ్డాయి. లెబనాన్, జోర్డాన్ గగనతలాల మీదుగా దూసుకొచ్చిన వాటిల్లో దాదాపు 90 శాతం క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను గాల్లోనే తుత్తినియలు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ సైనిక స్థావరం దెబ్బతింది. బెడోయిన్ అరబ్ పట్టణంలో పదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్‌లో చాలా ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు వినిపించాయి. జనం భయంతో వణికిపో యారు. అండగా ఉంటామన్న అమెరికా ఇరాన్ దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ‘‘ ఉక్కుకవచంలా ఇజ్రా యెల్‌కు రక్షణగా నిలుస్తాం. అన్నివిధాలుగా అండగా ఉంటాం’ అని అన్నారు. దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచి వివరాలు అడిగి తెల్సుకు న్నారు. అమెరికా స్పందనపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ ఘాటుగా స్పందించింది. ‘‘ మా దాడికి ప్రతిదాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు దారు ణంగా ఉంటాయి. ఈ సమస్య పశ్చిమాసి యాకే పరిమితం. ఉగ్ర అమెరికా ఇందులో తలదూర్చొద్దు’’ అని హెచ్చరించింది. ఇంతటితో మా ఆపరేషన్ ముగిసిందని ఇరాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మొహమ్మద్ హుస్సేన్ బఘేరీ ప్రకటించారు. ‘‘దాడిని మేం అడ్డుకున్నాం. మిత్రదేశాల సాయంతో విజయం సాధించాం’ అని దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఖండించిన ప్రపంచదేశాలు ఇరాన్ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ‘‘ ఈ శత్రుత్వాలకు వెంటనే చరమగీతం పాడండి. లేదంటే ఈ ఉద్రిక్త పరిస్థితి పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పరస్పర సైనిక చర్యలకు దిగకండి’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వేడుకున్నారు. భారత్, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు ఇరాన్ సైనికచర్యను తప్పుబట్టాయి. పౌరుల భద్రతపై భారత్ ఆందోళన ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయపౌరుల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడి ఎంబసీలు మన పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారంటూ మరో ముఖ్య అడ్వైజరీని విడుదలచేసింది. ‘అనవసరంగా బయటికి వెళ్లకండి. మీ పేర్లను సమీప ఎంబసీల్లో రిజిస్టర్ చేసుకోండి. శాంతంగా ఉంటూ భద్రతా సూచనలు పాటించండి’ అని సూచించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన నౌకను ఇరాన్ బలగాలు హైజాక్‌చేసిన ఘటనలో అందులోని 17 మంది భారతీయ సిబ్బంది విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇరాన్ గగనతల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ నగరానికి ఢిల్లీ నుంచి విమానసర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
Israel-Iran Tensions: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘా లు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ దేశం ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని డెమాస్కస్‌లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి, ఇద్దరు ఉన్నతస్థాయి సైనికాధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఇరాన్ ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ సైన్యం ఏ క్షణమైనా దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయిల్ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిస్సైల్ మొబైల్ లాంచర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిసింది. టెహ్రాన్ నుంచి తమ విమానాల రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకూ రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ తెలియజేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులకు కొన్ని దేశాలు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి. ఆ నౌకలో భారతీయులు 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్‌లోని హొర్మూజ్ జలసంధిలో ఈ సంఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వా«దీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి. -
ఇజ్రాయెల్ టార్గెట్ మిస్?.. ఇరాన్ ఎంబసీపైకి మిస్సైళ్లు!
గాజా సంక్షోభ నేపథ్యంలో.. ప్రత్యర్థి దేశాలపై ఇజ్రాయెల్ తన దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సోమవారం సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి జరిపింది. ఈ దాడిలో మొత్తం 11 మంది మృతి చెందారు. అయితే ఈ దాడి ఎంబసీ లక్ష్యంగా జరిగి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. గాజా యుద్ధంలో ఇరాన్ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియా దౌత్య విభాగాలు ఇది ఇజ్రాయెల్ దాడేనని ధృవీకరించాయి. ఆరు మిస్సైల్స్ ఎంబసీ భవనంపైకి దూసుకొచ్చాయని.. ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ద్వారా ఇజ్రాయెల్ రక్షణ దళం ఈ దాడికి తెగబడిందని ప్రకటించాయి. మరోవైపు బ్రిటన్ తరఫున సిరియాలో పని చేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒకటి ఈ క్షిపణి దాడిపై ప్రకటన చేసింది. దాడిలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని.. ఎనిమిది మంది ఇరాన్, ఇద్దరు సిరియా, ఒక లెబనీస్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలోనే సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ జరిపిన ఐదో దాడి ఇది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఇరాన్ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది. మిస్ టార్గెట్? సిరియాలో ఇరాన్ ఎంబసీ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ దాడి ఇరాన్ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్‌గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఇస్తున్నారు. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని సదరు కథనాల సారాంశం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్‌కి సోలెయిమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే.. 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో సోలెయిమానీ చనిపోయాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు సిరియా రాజధానిలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల దాడిని లెబనాన్ రెబల్ గ్రూప్ హిజ్బుల్లా ఖండిచింది. ఐఆర్జీసీ సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్‌కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్‌జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి. -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద నిప్పంటించుకొని ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి మృతి
వాషింగ్టన్: గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసన తెలుపుతూ నిప్పంటించుకున్న అమెరికా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి మరణించాడు. సోమవారం ఈ విషయాన్ని పెంటాగన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఎంబసీ ముందు మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఇజ్రాయెల్ ఎంబసీ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి తనకు తాను నిప్పు పెట్టుకోవటం వల్ల మంటల్లో చిక్కుకున్నాడు. మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది... అతనికి తీవ్రమైన గాయాలు కావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స అందిస్తున్న సమయంలో అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. Hazmat crews arrive at Israeli Embassy for a suspicious vehicle after a man lit himself on fire pic.twitter.com/YDIrc9o5gp — Andrew Leyden (@PenguinSix) February 25, 2024 ‘పాలస్తీనాను విడిచిపెట్టండి’.. ‘మారణహోమంలో పాలుపంచుకోవద్దు’.. అంటూ నినాదాలు చేస్తూ సదరు వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియా వైరల్‌గా మారింది. దీంతో అమెరికా ఎయిర్ ఫోర్స్ స్పందించి.. నిరసన తెలుపుతూ నిప్పుపెట్టుకొని మృతి చెందన వ్యక్తి తమ డిపార్టుమెంట్‌కు చెందిన ఆరోన్ బుష్నెల్ అని గుర్తించారు. అయితే అతను ఎయిర్ ఫోర్స్‌లో ఏ స్థాయికి చెందని ఉద్యోగి, ర్యాంక్ ఏంటి? వంటి వివరాలు తెలియజేడానికి నిరాకరించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ ఎంబసీకి సంబంధించిన సిబ్బందికి ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎంబసీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అతను గుర్తు తెలియని వ్యక్తి అని తెలిపారు. -
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు పేలుడు? లేఖ లభ్యం
ఢ్లిలీ: ఢ్లిలీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు బెదిరింపుల ఘటనలో ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు. దీంతోపాటు గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తూ ఓ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. లేఖను ఇజ్రాయెల్ జెండాలో చుట్టారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చర్యను ఎండగడుతూ ఢిల్లీలో ఆదేశ దౌత్యవేత్తకు దుండగులు లేఖ రాశారని వెల్లడించారు. ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఎంబసీపై బాంబు పేలుళ్లు జరుపుతామని బెదిరింపు కాల్ప్ వచ్చాయి. పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కానీ ఆ శబ్దం పేలుళ్లకు సంబంధించిందేనని ఇజ్రాయెల్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీపై దాడిగానే పరిగణించింది. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. #WATCH | Forensic teams and Dog squad of NSG carry out an investigation near the Israel Embassy. As per the Israel Embassy, there was a blast near the embassy at around 5:10 pm yesterday pic.twitter.com/X4lMPD2FR8 — ANI (@ANI) December 27, 2023 ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు సహా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) విస్తృతంగా గాలింపు చేపట్టగా ఓ లేఖ లభ్యమైంది. గాజాపై ఇజ్రాయెల్ చర్యను విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనపై నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఎంబసీ ప్రాంతంలో శబ్దం రసాయన పేలుడు అయి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్ఐఏ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. సమగ్రంగా దర్యాప్తు చేపడుతోంది. ఇదీ చదవండి: అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత -
Pakistan Crisis : ఆర్ధిక సంక్షోభంతో ఆస్తులను అమ్ముకుంటున్న పాకిస్తాన్..
వాషింగ్టన్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. చాలాకాలంగా బకాయిపడ్డ ఉద్యోగుల వేతనాలు, భారీగా పెరిగిన అప్పులు తీర్చేందుకు వేరే మార్గం లేక వాషింగ్టన్ లోని పాకిస్తాన్ ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలోని అమ్మకానికి పెట్టిన ఎంబసీ 7.1 మిలియన్ డాలర్లకు అమ్ముకుంది. వాషింగ్టన్‌లోని పాకిస్తాన్ చారిత్రాత్మక భవనమైన ఎంబసీ 2003 నుంచి ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉన్న కారణంగా 2018లో దౌత్య హోదాను కూడా కోల్పోయిన ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌కు చెందిన ఓ రియాల్టీ సంస్థతో సహా పలు సంస్థలు పోటీపడగా చివరకు పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త హఫీజ్ ఖాన్ దీన్ని 7.1 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు వాషింగ్టన్లో రెండు చోట్ల ఎంబసీ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్ స్ట్రీట్‌లో ఉన్న ఈ భవనాన్ని1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. క్రమేపీ అందులో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఈ భవనాన్ని దుర్భర స్థితిలో ఉన్న ఆస్తుల లెక్కలో చేర్చడంతో దీని అంచనా విలువపై టాక్స్ కూడా భారీగా పెరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు గతేడాది బిడ్ లను ఆహ్వానించింది పాకిస్తాన్ ప్రభుత్వం. తర్వాత భవనం తరగతిని మార్చిన పాకిస్తాన్ అధికారిక వర్గం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఒకపుడు క్లాస్ -2 హోదాలో ఉన్న ఈ భవనం తర్వాత క్లాస్-3 కి ఇప్పుడు క్లాస్-4 స్థాయికి పడిపోయింది. ఇది కూడా చదవండి: పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధుల కుమ్ములాట -
పాక్ ఆర్థిక కష్టాలు.. అమ్మకానికి అమెరికాలోని ఎంబసీ ఆస్తులు
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్థాన్. చేసిన అప్పులు తీర్చేందుకు, ఉద్యోగులకు జీతాలు సైతం ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతూ ఆస్తులు అమ్ముకుంటోంది. తమకు సాయం చేయాలని అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ దేశాలను వేడుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్‌లోని పాత ఎంబసీ బిల్డింగ్‌ను అమ్మకానికి పెట్టగా కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు పాకిస్థాన్ స్థానిక మీడియా వెల్లడించింది. భారత సంస్థ బిడ్.. వాషింగ్టన్‌లోని పాక్ ఎంబసీ భవనాన్ని కొనుగోలు చేసేందుకు అత్యధికంగా 6.8 మిలియన్ డాలర్లకు జువిష్ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఆ భవనం స్థానంలో ప్రార్థనా మందిరం నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత రెండోస్థానంలో భారత్‌కు చెందిన ఓ రియాల్టీ సంస్థ బిడ్ వేసింది. 5 మిలియన్ డాలర్లకు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే.. పాకిస్థాన్‌కు చెందిన రియాల్టీ సంస్థ 4 మిలియన్ డాలర్లకు కోట్ చేసినట్లు పాక్ డాన్ పత్రిక వెల్లడించింది. మరోవైపు.. ప్రైవేటీకరణపై ఏర్పడిన పాకిస్థాన్ కేబినెట్ కమిటీ ఆర్థిక మంత్రి ఇషాక్ డార్ నేతృత్వం సోమవారం భేటీ అయింది. న్యూయార్క్‌లోని రూసెవెల్త్ హోటల్ సైట్‌ను లీజుకు ఇచ్చేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను నియమించాలని ప్రైవేటీకరణ కమిషన్‌కు సూచించినట్లు డాన్ పత్రిక తెలిపింది. పాకిస్థాన్‌కు వాషింగ్టన్లో రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. ఆర్ స్ట్రీట్‌లో ఉన్న భవనాన్ని 1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. పాత భవనాన్ని అలాగే అమ్మేయాలా? లేక పునరుద్ధరణ పనులు చేయించి విక్రయించాలా? అనే అంశంపై ఎంబసీ అధికారులు చర్చిస్తున్నట్లు పాక్ పత్రిక పేర్కొంది. ఇదీ చదవండి: ‘ఏ దోస్త్ మేమున్నాం’.. పాకిస్థాన్‌కు జిన్‌పింగ్ భరోసా -
ఉక్రెయిన్ ఎంబసీలకు ‘జంతువుల కళ్ల’ పార్శిళ్లు
కీవ్: వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలకు లెటర్ బాంబులు, ఉత్తుత్తి లెటర్ బాంబులు, ఆవు, పంది కళ్లతో కూడిన పార్శిళ్లు అందినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీకి శుక్రవారం జంతువుల కళ్లతో కూడిన పార్శిల్ అందింది. ప్రత్యేకమైన రంగు, వాసనతో కూడిన ద్రవంలో ముంచిన ఇటువంటి ప్యాకేజీలు హంగరీ, నెదర్లాండ్స్, పోలండ్, క్రొయేషియా, ఇటలీ తదితర ప్రాంతాల్లోని 17 ఎంబసీలకు అందాయని ఉక్రెయిన్ పేర్కొంది. అదేవిధంగా, వాటికన్ సిటీలోని ఉక్రెయిన్ రాయబారి నివాసంపై దాడి జరిగింది. కజకిస్తాన్ ఎంబసీకి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో ఎంబసీలు, కాన్సులేట్ల వద్ద భద్రత మరింత పెంచాలని ఉక్రెయిన్ ఆదేశించింది. గత వారం స్పెయిన్ ప్రధాని సాంచెజ్‌తోపాటు మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్, అమెరికా దౌత్య కార్యాలయాలకు లెటర్ బాంబులు అందాయి. -
ప్రపంచంలోనే ఖరీదైన దౌత్య భవనం
లండన్ : ఎలాంటి టెర్రరిస్టుల దాడులనైనా తట్టుకొని చెక్కుచెదరకుండా ఉండే విధంగా లండన్ నగరంలో అమెరికా తన దౌత్య కార్యాలయాన్ని నిర్మిస్తోంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే కాకుండా అత్యధికంగా డబ్బులు కూడా ఖర్చు చేస్తోంది. వంద కోట్ల డాలర్లతో నిర్మిస్తోన్న ఈ భవనమే ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన అమెరికా దౌత్య భవనం అవుతుందని రాయబార కార్యాలయ వర్గాలు తెలిపారు. ప్రస్తుతం గ్రాస్‌వీనర్‌లో ఉన్న అమెరికా దౌత్య భవనం చిన్నది అవడం, 1950లో నిర్మించడం వల్ల పురాతనం అవడం వల్ల కొత్త భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లండన్‌లోని అత్యంత ఖరైదైన నైన్ ఎల్మ్స్ ప్రాంతంలో ఈ కొత్త దౌత్య భవనాన్ని అమెరికా ప్రభుత్వం నిర్మిస్తోంది. అమెరికా దౌత్య కారణంగా తమ భవనాలకు కూడా టెర్రరిస్టుల దాడుల ప్రమాదం ఉంటుందని ఇరుగు, పొరుగు భవనాల యజమానులు ఆరోపించడంతో టెర్రరిస్టు దాడులను నివారించేందుకు వీలుగా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. భద్రతలో భాగంగా భవనం చుట్టూ అర్ధ చంద్రాకారంలో నీటి కొలనును ఏర్పాటు చేశారు. భవనంపైనా స్కైపూల్‌ను ఏర్పాటు చేశారు. కింది రిసెప్షన్ నుంచి చూస్తే పైన కప్పుగా నీరు, ఆ పైన ఆకాశం కనిపిస్తుంది. పైన నీటిలోకి చూసిన కింది రిసెప్షన్ కనిపిస్తోంది. ఈ నీరు కూడా బాంబు దాడులను తట్టుకునే విధంగా ఉపయోగపడుతుందని భవనం ఇంజనీర్లు చెబుతున్నారు. ఎలా అన్నది మాత్రం వారు వివరించలేదు. 2008లో డిజైన్చేసి రెండేళ్లుగా కొనసాగుతున్న దీని నిర్మాణం ఈ పాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ కాలేదు. మరెంత కాలం పడుతుందో కూడా ఇంజనీర్లు చెప్పలేకపోతున్నారు. సిబ్బంది కోసం రెస్టారెంట్, క్లబ్ హౌజ్‌లను కూడా ఇందులో నిర్మిస్తున్నారు.