దుబాయ్: ప్రతీకార దాడితో పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండింది. తమ భూభాగంపై ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేసి చూపించింది. తమ డ్రోన్‌లను రంగంలోకి దింపింది. అమెరికా తయారీ ఎఫ్–14 టామ్‌క్యాట్స్ యుద్ధవిమానాలు ఉన్న ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే ఇస్ఫహాన్ నగర గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని, దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్‌పై దాడి పని ఇజ్రాయెల్‌దేనని అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న శుక్రవారం రోజే ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం గమనార్హం. అణుకార్యక్రమాలు జరిగే ఆగ్నేయ జెర్డెంజన్ ప్రాంతంలో శత్రు విమానాలు, డ్రోన్లను నేలమట్టం చేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్రియాశీలం చేసింది. ఈ అణుకేంద్రంలో చైనా సరఫరాచేసిన స్వల్పస్థాయి అణు పరిశోధనా రియాక్టర్లు ఉన్నాయి. పౌర అణు అవసరాల కోసం అణు ఇంథనాన్ని ఇక్కడ ఉత్పత్తిచేస్తారు. ఇదే నగరంలో భూగర్భ అణు శుద్ది కర్మాగారం ఉంది. దీనిని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment