Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు | Israel-Palestine War: Hamas militants infiltrate Israel amid barrage of rockets | Sakshi
Sakshi News home page

Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు

Oct 8 2023 1:21 AM | Updated on Oct 8 2023 1:21 AM

Israel-Palestine War: Hamas militants infiltrate Israel amid barrage of rockets - Sakshi

ఇజ్రాయెల్‌ దాడులతో గాజా సిటీలోని బహుళ అంతస్తుల భవనాన్ని కమ్ముకున్న మంటలు, పొగ; హమాస్‌ మిలిటెంట్ల రాకెట్లతో ఇజ్రాయెల్‌లోని అషె్కలాన్‌లో చెలరేగిన మంటలు

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు.

దాడుల్లో కనీసం 100 మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డట్టు చెబుతున్నారు. సరిహద్దుల ప్రాంతాల్లో పౌరులతో పాటు సైనికులను కూడా మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. వారిని, చేజిక్కించుకున్న ఇజ్రాయెల్‌ సైనిక వాహనాలను గాజా వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఊహించని దాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్‌ తేరుకుని హుటాహుటిన సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరువర్గాల ఎక్కడికక్కడ మధ్య భీకర పోరు సాగుతోంది. కాల్పులు, మోరా్టర్లు, రాకెట్ల మోతతో దేశం దద్దరిల్లుతోంది.

తాము ముట్టడిలో ఉన్నామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘ఇది దాడి కాదు, మాపై పూర్తిస్థాయి యుద్ధమే’’అని పేర్కొన్నారు. దీనికి పాలస్తీనా అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘‘ముందుగా చొరబాటుదారులను ఏరేస్తాం. అనంతరం భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరతాం’’అని ప్రకటించారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. గత కొన్నేళ్లలో ఆ దేశంపై జరిగిన అతి తీవ్ర దాడి ఇదే. మరోవైపు ఇజ్రాయెల్‌ ప్రతి దాడిలో గాజాలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్టు, 2000 మంది దాకా గాయపడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది.

14 చోట్లనుంచి చొరబాటు...!
ఇజ్రాయెల్‌లోకి కనీసం 7 నుంచి 14 ప్రాంతాల గుండా మిలిటెంట్లు చొచ్చుకొచి్చనట్టు చెబుతున్నారు. తొలుత వివాదాస్పద గాజా స్ట్రిప్‌ నుంచి తెల్లవారుజామున రాకెట్ల వర్షం కురిపించారు. 20 నిమిషాల్లోనే 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించారు. దాంతో జెరూసలేం, టెల్‌ అవీవ్‌తో పాటు దేశమంతటా వాయుదాడి సైరన్లు మోగాయి. ఆ వెంటనే మిలిటెంట్లు దేశంలోకి చొచ్చుకొచ్చారని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. దక్షిణాన గాజా–ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో కంచెలను పేల్చేసి మోటార్‌సైకిళ్లు, వాహనాల్లో, పారా గ్లైడర్ల ద్వారా కూడా దూసుకొచ్చి దాడులకు దిగారు. ప్రతిగా సైన్యం కూడా గాజాపైకి వేలాది రాకెట్లు ప్రయోగించింది.

అల్‌ హక్సా మసీదుపై ఇజ్రాయెల్‌ అకృత్యాలకు, గాజాపై ఏళ్ల తరబడి అణచివేతకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు హమాస్‌ మిలిటరీ వింగ్‌ నేత మొహమ్మద్‌ దెయిఫ్‌ పేర్కొన్నాడు. దీన్ని ‘ఆపరేషన్‌ అల్‌ అక్సా ఫ్లడ్‌’గా అభివరి్ణంచాడు. తూర్పు జెరూసలేం నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌ దాకా ఉన్న పాలస్తీనియన్లంతా యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఈ దాడి నెతన్యాహూ నాయకత్వ సామర్థ్యంపై పలు సందేహాలు లేవనెత్తింది. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, భారీ ఆందోళనలకు ఆయన కారకుడవడం తెలిసిందే. దాడి నేపథ్యంలో సైనిక ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు.  

ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండ: మోదీ
ఇజ్రాయెల్‌పై దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని ప్రకటించారు. బాధిత పౌరులు, కుటుంబాల క్షేమం కోసం ప్రారి్థస్తున్నానంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దాడిని అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించగా. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని పలు ఇతర దేశాలు కోరాయి.

అక్కడి భారతీయులకు అడ్వైజరీ
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయు లు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. అ నవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దని పేర్కొంది. ఈ మేరకు అక్కడి భారత ఎంబసీ ఇంగ్లిష్‌తో పా టు హిందీ, మరాఠా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయె ల్‌లో 18 వేల మంది దాకా భారతీయులున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement