హమాస్. అత్యాధునిక నిఘాలో, అంతకుమించిన సైనిక సంపత్తిలో ప్రపంచంలోనే తిరుగులేనిదని పేరున్న ఇజ్రాయెల్‌ను మెరుపు దాడులతో నిలువునా వణికించిన పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్. పక్కా ప్రణాళిక ప్రకారం భూ, జల, వాయుతలాల గుండా దాడులకు దిగి గుక్కతిప్పుకోనివ్వలేదు. ఇంతకీ ఏమిటీ సంస్థ? ఎందుకు ఈ స్థాయిలో దాడులకు దిగింది? ఇంతటి శక్తి సామర్థ్యాలను ఎలా సంతరించుకుంది...?
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న సాయుధ సంస్థ హమాస్. ఇజ్రాయెల్ వినాశనం, ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనే లక్ష్యమని ప్రకటించుకుంది. 2007లో గాజాను చేజిక్కించుకున్న నాటినుంచీ ఇజ్రాయెల్‌తో ఎన్నోసార్లు పోరుకు దిగింది. హమాస్ అంటే హర్కతల్ ముఖవమా అల్ ఇస్లామియా. రాజకీయ పారీ్టగా మొదలై సాయుధ సంస్థగా మారింది. 2000లో రెండో తిరుగుబాటులో భాగంగా ఇజ్రాయెల్‌పై భారీ దాడులకు పాల్పడి వందల మందిని బలి తీసుకుంది.
► శనివారం నాటి దాడి ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన వాటిలో అత్యంత తీవ్రమైనది. ఈజిప్టు, సిరియా ఇలాగే ఇజ్రాయెల్‌పై సరిగ్గా 50 ఏళ్ల కింద, 1973లో మెరుపు దాడికి దిగాయి. అది మధ్యప్రాచ్యంలో తీవ్ర యుద్ధంగా çమారింది.
► 2000లో బందీగా దొరికిన ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడిని అడ్డం పెట్టుకుని వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయించుకుంది. తాజాగా భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులను నిర్బంధించిన ఆ సంస్థ, ఈసారి ఏ స్థాయిలో బేరం పెడుతుందన్నది తేలాల్సి ఉంది!
► ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ యూనియన్ హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.
► ఈ సంస్థకు ఇరాన్ దన్నుగా నిలుస్తోంది. నిధులు, ఆయుధాలతో పాటు సాయుధ శిక్షణ ఇస్తోంది. తుర్కియే, ప్రవాస పాలస్తానీయులు, ప్రైవేటు దాతలతో పాటు పలు ఇస్లామిక్ సంస్థలు సాయం చేస్తుంటాయి.
పాలస్తీనా సంగతేంటి?
ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణ ఇప్పటిది కాదు. అవి ఆవిర్భవించినప్పటి నుంచీ నిత్య రావణకాష్టంలా రగులుతోంది. వెస్ట్‌బ్యాంక్, గాజాలను కలిపి పాలస్తీనాగా పిలుస్తారు. రోమన్ సామ్రాజ్య కాలంనాటి పాలస్తీనాలో నేటి తూర్పు జెరూసలేం, ఇజ్రాయెల్ కలిసే ఉంటాయి. బైబిల్‌లో వీటిని యూదు రాజ్యాలుగా పేర్కొన్నారు. యూదులు వీటిని తమ పూర్వీకుల భూభాగంగా పరిగణిస్తారు.
► 1948లో ఇజ్రాయెల్ తనను తాను స్వతంత్రదేశంగా ప్రకటించుకుంది. దీన్ని పాలస్తీనా ముస్లింలు మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
► పాలస్తీనియన్లతో పాటు అరబ్ దేశాలు తమ సైనిక చర్యలో పాల్గొని ఇజ్రాయెల్‌ను తుడిచి పెట్టాలని హమాస్ సైనిక కమాండర్ మొహమ్మద్ దెయిఫ్ శనివారం దాడులు మొదలయ్యాక వీడియో సందేశంలో పిలుపునిచ్చాడు.
► అరబ్బు దేశాల మాట అటుంచితే వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం పాలస్తీనియన్లు ఆ పిలుపునకు ఏ మేరకు స్పందిస్తారన్నది చూడాలి.
► పాత జెరూసలేంలోని అల్ అక్సా మసీదుపై నియంత్రణ దాడికి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. క్రైస్తవులతో పాటు ముస్లింలు, యూదులకు ఇది అతి పవిత్ర ప్రాంతం. ఇది ఇజ్రాయెల్ అ«దీనంలో ఉంది. శాంతి ఒప్పందానికి లోబడి అక్కడ ముస్లింల ప్రార్థనలకు అనుమతిస్తూ వస్తోంది. మసీదుకు పహారాగా ఉండే ఇజ్రాయెలీ దళాల దన్నుతో యూదు అతివాదులు అక్కడ హల్‌చల్ చేస్తుండటం హమాస్ ఆగ్రహానికి మరో కారణం.
గాజా స్ట్రిప్ కథ ఇదీ..
ఇజ్రాయెల్, ఈజిప్టు, మధ్యదరా సముద్రం మధ్యన ఉండే కేవలం 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు భూభాగమిది. అక్కడ జనాభా ఏకంగా 23 లక్షలు!
► గాజా గగనతలమే గాక చాలావరకు సముద్ర తీరం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి గాజాలోకి ఆహార పదార్థాలు, నిత్యావసరాల సరఫరాను అనుమతిస్తోంది.
అత్యవసర జాతీయ ఐక్య ప్రభుత్వం!
దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో రాజకీయ పారీ్టలన్నీ చేతులు కలుపుతున్నాయి. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. అన్ని పారీ్టల ప్రతినిధులతో కూడిన అత్యవసర జాతీయ ఐక్య ప్రభుత్వ ఏర్పాటుపై సంప్రదింపులు జరుపుతున్నాయి. దీనిపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, విపక్ష నేతలు యాయిర్ లాపిడ్ బెన్నీ గాంట్జ్ ఇప్పటికే చర్చించుకున్నారు. అత్యవసర ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరేందుకు విపక్ష నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ కళ్లు గప్పి..
ఇజ్రాయెల్‌కు పకడ్బందీగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ప్రపంచం నలుమూలల ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇజ్రాయెల్ నిఘా వర్గాలకే మొట్టమొదట సమాచారం అందుతుంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇజ్రాయెల్ కళ్లు గప్పి హమాస్ మిలిటెంట్లు ముప్పేట దాడులకు తెగబడడం అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలైన షిన్‌బెత్, మొసాద్‌ల గురించి ఎప్పుడూ ఆ దేశం గర్వంగా చెప్పుకుంటుంది. గాజా సరిహద్దుల్లో భారీగా భద్రతా సిబ్బంది మోహరించి ఉంటారు. నిరంతరం సీసీ కెమెరాలు పని చేస్తూ ఉంటాయి. ఆర్ట్ థర్మల్ ఇమేజింగ్, మోషన్ సెన్సర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లను దాటుకొని హమాస్ మిలిటెంట్ల దాడులకు దిగారంటే కచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్న అభిప్రాయాలున్నాయి.
మోటరైజ్డ్ పారా గ్లైడర్ల సాయంతో
మోటరైజ్డ్ పారా గ్లైడర్ల సాయంతో సరిహద్దుల్లో కంచెలు దాటిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దిగుతూనే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.సరిహద్దులు దాటడానికి పారా గ్లైడర్లు హమాస్ వినియోగిస్తుందని ఇజ్రాయెల్ ఊహకి కూడా అందలేదు. ుద్యాధర సముద్రం నుంచి చిన్న చిన్న బోట్లలో గాజా మీదుగా ఇజ్రాయెల్‌లోకి అడుగు పెట్టారు. పికప్ ట్రక్కుల్లో భారీ మిషన్ గన్లుతో భూ మార్గంలో చొచ్చుకువచ్చారు.
సరిహద్దులు దాటినప్పుడు భారీగా పేలుడు పదార్థాలు వినియోగించారు. కొందరు మిలిటెంట్లు వైర్లను కట్ చేసుకుంటూ కంచెలు అడ్డం తొలగించి లోపలికి వచ్చారు. ఇలా ఏకకాలంలో మూడు మార్గాల ద్వారా దాడులకు దిగడంతో తేరుకొని ఎదురు దాడులకు దిగేలోపుల నష్టం జరిగిపోయింది. హమాస్ మిలిటెంట్లు పకడ్బందీగా దాడులు జరపడానికి పదేళ్ల కిందట నుంచే విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పారాగ్లైడర్ల దాడికి శిక్షణ తీసుకున్న వీడియోలను హమాస్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఐరన్ డోమ్‌ను దాటుకొని మరీ..
ఇజ్రాయెల్ వద్ద శత్రు దుర్భేద్యమైన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఉంది. దూసుకొచ్చే శుత్రుదేశ రాకెట్ల దిశకు తగ్గట్లు ప్రతిగా రాకెట్లను ప్రయోగించి వాటిని ధ్వంసం చేయడంలో ఐరన్‌డోమ్ వ్యవస్థ పేరుగాంచింది. అయితే హమాస్ మిలిటెంట్లు ఆ ఐరన్ డోమ్ వ్యవస్థ తికమకపడేలా లెక్కలుమిక్కిలిగా అంటే 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లను ప్రయోగించారు. ఇన్నాళ్లూ 80% సక్సెస్ రేటుతో పని చేసిన ఐరన్ డోమ్ వ్యవస్థ దీంతో ఒక్కసారిగా చేతులెత్తేసింది. ఈ రాకెట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment