Israel-Palestine war: భీకర యుద్ధం | Israeli-Palestinian Conflict: Israel retaliates after Hamas attacks, deaths Rises | Sakshi
Sakshi News home page

Israel-Palestine war: భీకర యుద్ధం

Published Mon, Oct 9 2023 5:11 AM | Last Updated on Mon, Oct 9 2023 9:01 AM

Israeli-Palestinian Conflict: Israel retaliates after Hamas attacks, deaths Rises - Sakshi

టెల్‌ అవివ్‌/జెరూసలేం:  ఇజ్రాయెల్‌ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం మొదలైన ఘర్షణ ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. దక్షిణ ఇజ్రాయెల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకువచి్చన తీవ్రవాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్‌ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది.

ఈ దాడుల్లో గాజాలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే 20,000 మంది ఇళ్లు విడిచి వెళ్లిపోయినట్లు అంచనా. దాడులు, ప్రతి దాడుల్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌లో 600 మందికిపైగా, గాజాలో 370 మందికిపైగా మొత్తంగా దాదాపు వేయి మంది మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్‌ యుద్ధ రంగంలో ఉన్నట్లు ప్రధాని నెతన్యాహూ కేబినెట్‌ ఆదివారం  ప్రకటించింది. సంక్షోభ నివారణకు సైనిక పరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది.   

బందీలపై తీవ్రవాదుల అత్యాచారాలు  
హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లో బీభత్సం సృష్టించారు. ఇజ్రాయెల్‌ పౌరులను బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వీరిలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఈ బందీలను అడ్డం పెట్టుకొని పెద్ద బేరమే ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేలాది మంది పాలస్తీనావాసులు ఖైదీలుగా ఇజ్రాయెల్‌ ఆ«దీనంలో ఉన్నారు. వీరిని విడిపించుకోవడానికి మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ బందీలను పావులుగా ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ఇంకోవైపు చాలామంది ఇజ్రాయెల్‌ పౌరులను మిలిటెంట్లు అపహరించినట్లు ప్రచారం సాగుతోంది.     

ఇజ్రాయెల్‌లో వందలాది మంది...
ఇజ్రాయెల్‌లో హమాస్‌ దాడిలో మరణించిన వారి సంఖ్య ఇప్పటిదాకా 600కు చేరినట్లు  మీడియా సంస్థలు  వెల్లడించాయి. వీరిలో 44 మంది సైనికులు ఉన్నారని తెలిపాయి.  ఇజ్రాయెల్‌ ఎదురుదాడిలో గాజాలో 370 మందికి పైగా మృతి చెందారని పాలస్తీనా అధికారులు చెప్పారు. ఇరువైపులా 2,000 మంది చొప్పున గాయపడినట్లు సమాచారం. తమ సైనిక దళాలు 400 మంది హమాస్‌ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ అధికార వర్గాలు తెలియజేశాయి. చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

తల్లిదండ్రుల కళ్లెదుటే పసిబిడ్డ హత్య   
హమాస్‌ తీవ్రవాదులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. వారి ఘాతుకం సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచి్చంది. తీవ్రవాదులు ఇజ్రాయెల్‌లో ఓ కుటుంబాన్ని బందీలుగా మార్చారు. తమ అ«దీనంలో ఉన్న భార్యాభర్తలు, వారి ఇద్దరి కుమార్తెలు, కుమారుడిని హింసించారు. ఒక పసిబిడ్డను ఆమె తల్లిదండ్రుల కళ్లెదుటే మెడు తాడు బిగించి చంపేశారు. అది చూసి బిగ్గరగా రోదిస్తున్న మరో కుమార్తె, కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ సోదరి స్వర్గానికి వెళ్లింది’ అని అరుస్తూ చెప్పారు. ఇజ్రాయెల్‌ జర్నలిస్టు హనాయా నఫ్తాలీ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  

భారతీయులు క్షేమం..
ఇజ్రాయెల్, గాజాలో భారతీయులంతా ఇప్పటిదాకా క్షేమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు.  భారతీయులకు తాము అందుబాటులో ఉంటున్నామని, వారి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నామని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశాయి. మరోవైపు గాజాలో వాతావరణం భయంకరంగా ఉందని అక్కడి భారతీయులు చెప్పారు.  ఇంటర్నెట్, విద్యుత్‌ సౌకర్యం పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.  ఇలా ఉండగా, ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌కు ఈ నెల 14 దాకా తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement