ముంబై: ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశం అమెరికా.. చమురు ఉత్పత్తి పరంగా బలమైన ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తేలికపడడం ప్రపంచవ్యాప్తంగా గురువారం ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. గత వారం ఇరాక్‌లో ఇరాన్ సైనిక కమాండర్ సులేమానీని అమెరికా దళాలు చంపేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆ నష్టాల్లో అధిక శాతం మేర గడిచిన రెండు రోజుల్లో మన ఈక్విటీ మార్కెట్లు తిరిగి పూడ్చుకున్నాయి.
ప్రతీకార చర్య కింద ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినా కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తీసుకోకపోవడం, తాము శాంతినే కోరుకుంటున్నామని చెప్పడం పరిస్థితిని కుదుటపరిచింది. ఫలితంగా గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 635 పాయింట్ల లాభాన్ని (1.55 శాతం) నమోదు చేసుకుంది. 41,482 పాయింట్ల గరిష్టస్థాయిని తాకి... చివరకు 41,452 వద్ద క్లోజయింది. అటు నిఫ్టీ సైతం 191 పాయింట్లు పెరిగి (1.58 శాతం) 12,216 వద్ద క్లోజయింది. ట్రంప్ ప్రకటనతో క్రితం రాత్రి యూఎస్ మార్కెట్లు కూడా లాభాలను నమోదు చేశాయి. తమ ఉపాధ్యక్షుడు లీ వచ్చే వారం వాషింగ్టన్‌ను సందర్శిస్తారని, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారంటూ చైనా చేసిన ప్రకటన కూడా ఇన్వెస్టర్లను రిస్క్ తీసుకునే దిశగా ప్రోత్సహించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
► అధికంగా లాభపడిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంకు ముందుంది. ఆ తర్వాత ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌బ్యాంకు, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
► నష్టపోయిన షేర్లలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా ఉన్నాయి.
► బీఎస్‌ఈ రియల్టీ, ఆటో, బ్యాంకెక్స్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్, ఎనర్జీ సూచీలు లాభపడ్డాయి. ఐటీ సూచీ నష్టపోయింది.
► బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.55 శాతం వరకు పెరిగాయి.
► షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ 2.31 శాతం వరకు గరిష్టంగా లాభపడ్డాయి. యూరోప్ మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడింగ్ ఆరంభించాయి.
ఒక్కరోజులో 2.25 లక్షల కోట్లు
గురువారం నాటి మార్కెట్ ర్యాలీ పుణ్యమా అని ఒక్కరోజే ఇన్వెస్టర్ల వాటాల విలువ రూ.2.25 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ముగింపుతో పోలిస్తే.. రూ.2,25,554 కోట్లు పెరిగి మొత్తం రూ.1,57,06,155 కోట్లకు చేరుకుంది.
మార్కెట్లపై క్యూ3 ఫలితాల ప్రభావం..
‘‘వృద్ధిని పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బడ్జెట్లో చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు చల్లారడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించే విధానపరమైన చర్యలు, నిర్ణయాలు దీర్ఘకాలంలో ఈక్విటీలకు ప్రయోజనం కలిగిస్తాయి. అయితే, స్వల్పకాలానికి మాత్రం మార్కెట్లను మూడో త్రైమాసికం ఫలితాలు నిర్ణయిస్తాయి. తక్కువ బేస్(క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న గణాంకాలతో పోలిస్తే) కారణంగా డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో కొంత పురోగతి ఉంటుందని అంచనా’’ అంటూ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘ఈక్విటీ మార్కెట్లకు అసాధారణ రోజు. ఒకటిన్నర శాతానికి పైగా లాభపడ్డాయి. చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం మరింత ఉత్సాహాన్నిచ్చింది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
చల్లారిన పసిడి.. క్రూడ్
రూపాయికి 48 పైసలు లాభం
న్యూయార్క్/న్యూఢిల్లీ: యుద్ధాన్ని కాంక్షించడంలేదంటూ అమెరికా–ఇరాన్ నుంచి వెలువడుతున్న సంకేతాలతో తిరిగి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనాలైన బంగారం, క్రూడ్‌ల నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు కనబడుతోంది. దీంతో అంతర్జాతీయంగా పసిడి, క్రూడ్ ధరలు గురువారమూ తగ్గాయి. ఈ ధోరణి భారత్ రూపాయి బలోపేతం కావడానికీ దోహదపడింది. బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర అంతర్జాతీయ మార్కెట్ నైమెక్స్‌లో గురువారం ఈ వార్తరాసే 10.30 రాత్రి గంటల సమయానికి క్రితం ముగింపుతో పోల్చిచూస్తే, 10 డాలర్ల నష్టంలో 1,550 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. బుధవారం గరిష్టంతో పోల్చితే ఇది 62 డాలర్లు తక్కువ. ట్రేడింగ్ ఒక దశలో ఈ ధర 1,541 డాలర్ల కనిష్టాన్నీ తాకింది.
► నైమెక్స్ క్రూడ్ పావు శాతం తగ్గుదలతో 59.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
► డాలరుతో రూపాయి విలువ 48 పైసలు లాభపడి 71.21 వద్ద ముగిసింది.
► దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.377 నష్టంతో రూ.39,733 వద్ద ట్రేడవుతోంది.
‘‘యూఎస్–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లు బలం చూపిస్తున్నాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్ బలంగా ముగియడం ఆసియాలోనూ కొనుగోళ్లకు దారితీసింది. ఇప్పుడు యూరోప్‌లోనూ బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తోంది. యూఎస్, ఇరాన్ ఇప్పటికీ ఒకరిపట్ల మరొకరు విభేదంగా ఉన్నా, వివాదం ముదరకపోతే మంచి వాతావరణం కొనసాగే అవకాశమే ఉంటుంది’’ అని బ్రిటన్‌కు చెందిన సీఎంసీ మార్కెట్స్ అనలిస్ట్ డేవిడ్ మాడెన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment